క్యాంపులు పెడితే వేటు

Serious Action On Political Camps EC Wars To Parties - Sakshi

ఎలాంటి ప్రలోభాలు చేయొద్దు : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు 

ప్రవర్తనా నియమావళిలో మార్పులు

జెడ్పీ, ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: జెడ్పీ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులకు నిర్వహించే ఎన్నికలకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికైన ప్రజాప్రతినిధులతో పరోక్ష, ప్రత్యక్ష పద్ధతుల్లో ఎలాంటి క్యాంప్‌లు నిర్వహించొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) ఆదేశించింది. ఈ పదవులకు పరోక్ష పద్ధతుల్లో ఎన్నికల నిర్వహణకు 48 గంటల ముందు ఎలాంటి ప్రచారం నిర్వహించొద్దని, స్థానిక సంస్థల పదవులకు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ ప్రచారంపై నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్‌ఈసీ కార్యదర్శి అశోక్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.

గతంలో ఈ పదవులకు జరిగిన ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు.. డబ్బు, అంగబలమున్న అభ్యర్థులు ఇళ్లు, రిసార్ట్‌లలో క్యాంప్‌లు నిర్వహించి గెలిచిన ప్రజాప్రతినిధులను సుదీర్ఘకాలం పాటు ఎక్కడో ఉంచడం తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొంది. అధికారంలో ఉన్న పార్టీకి అదనపు అవకాశాలుండటంతో ప్రభుత్వ యంత్రాంగా న్ని ఉపయోగించి ఏదోక రూపంలో ప్రభావితం చేసేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని పేర్కొంది. ఇలాంటి పద్ధతుల కారణంగా కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రలోభాలకు లొంగి, విప్‌లను ధిక్కరించి ఓటేసే పరిస్థితులు ఉన్నట్లు పేర్కొంది.

ప్రలోభాల నివారణకు.. 
జెడ్పీ చైర్‌పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షులు, మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లను పరోక్ష పద్ధతుల్లో ఎన్నుకునేటప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులను వివిధ రూపాల్లో ప్రలోభాలకు గురిచేయకుండా ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ప్రత్యేక సెక్షన్‌ను ఎస్‌ఈసీ చేర్చింది. పరిషత్‌ (జెడ్పీపీ, ఎంపీపీ పదవులకు), పట్టణ స్థానిక సంస్థల్లో (యూఎల్‌బీ)ని పదవులకు పరోక్ష పద్ధతుల్లో నిర్వహించే ఎన్నికలకు సంబంధించి మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను ఈ మేరకు సవరించింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించే వారిపై ఆయా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకునే అంశాన్ని చేరుస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల కోడ్‌ స్థానిక ఫలితాల వెల్లడి నుంచి మొదలై పరోక్ష పద్ధతుల్లో జెడ్పీపీ, ఎంపీపీ, మున్సిపాలిటీల్లో ఆయా పదవులకు ఎన్నికలు ముగిసే వరకు అమల్లో ఉం టుందని స్పష్టం చేసింది.

జెడ్పీ చైర్‌పర్సన్లు, వైస్‌చైర్మన్లు, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మున్సిపల్‌ చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్, మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులు (ప్రత్యక్ష లేదా పరోక్ష పద్ధతుల్లో) కోరుకునే ఏ రాజకీయపార్టీకి చెందినవారైనా ప్రజాప్రాతినిథ్య చట్టంలో పొందుపరిచిన లంచం ఇతరత్రా రూపాల్లోని ప్రలోభాలకు పాల్పడొద్దని పేర్కొంది. పార్టీలు ఇచ్చిన విప్‌ను ధిక్కరించి ప్రజాప్రతినిధులు ఓటేసేలా ఒత్తిళ్లు తేవొద్దని తెలిపింది. విప్‌ను ధిక్కరిస్తే పదవి కానీ ప్రోత్సాహకం కానీ ఇస్తామన్న ప్రలోభాలకు పాల్పడొద్దని హెచ్చరించింది. అధికార పార్టీ లేదా ప్రభుత్వ ప్రతినిధులు తమ అధికార హోదా లేదా పదవులను ఉపయోగించి కాంట్రాక్ట్‌ల కల్పన, పెండింగ్‌ బిల్లుల చెల్లింపులు, లైసెన్సులు, సర్టిఫికెట్లు అందజేయడం, పెండింగ్‌కేసుల ఎత్తివేత వంటి వాటికి పాల్పడొద్దని స్పష్టంచేసింది.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top