
కూటమి నేతలు కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు
ఆదోని రూరల్: కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగేరి గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు నాగభూషణంరెడ్డి కిడ్నాప్ అయ్యారు. ఆయన ఆదివారం నుంచి కనిపించడం లేదు. బుధవారం ఆదోని ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో నాగభూషణం కిడ్నాప్ కావడంతో తన భర్తను కూటమి నాయకులే కిడ్నాప్ చేశారంటూ అతడి భార్య విజయలక్ష్మి ఆదోని తాలూకా పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు.
గ్రామానికి చెందిన కూటమి నాయకుడు శ్రీనివాస ఆచారి ఆదివారం రాత్రి 7 గంటలకు తన భర్తను కారులో తీసుకెళ్లారని, అప్పటి నుంచి ఆయన ఆచూకీ లేదని తెలిపారు. ఈ విషయమై శ్రీనివాస ఆచారిని అడిగితే ఈరోజు వస్తాడు, రేపు వస్తాడు.. అంటూ మాయమాటలు చెబుతున్నారని పేర్కొన్నారు. సోమవారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి శ్రీనివాస ఆచారి ఇంటివద్దకు వెళ్లి గట్టిగా నిలదీస్తే తమపైనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తావా అని బెదిరించారని తెలిపారు. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు తన భర్త ఆచూకీ లేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రలోభాలు, కిడ్నాప్
ఆదోని ఎంపీపీ బడాయి దానమ్మపై బుధవారం అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి నేతలు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులపై ప్రలోభాల వల విసరటమేగాక కిడ్నాప్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. మండలంలో 29 ఎంపీటీసీ స్థానాలున్నాయి. వీటిలో మూడుస్థానాలకు ఎన్నికలు జరగలేదు. మిగిలిన 26 ఎంపీటీసీ స్థానాల్లో 24 వైఎస్సార్‌సీపీ గెల్చుకుంది. కపటి ఎంపీటీసీ సభ్యురాలు బడాయి దానమ్మ ఎంపీపీగా ఎన్నికయ్యారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దానమ్మ, ఆమె భర్త పంపాపతి బీజేపీలో చేరారు.
ఈ నేపథ్యంలో ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆదోని సబ్‌కలెక్టర్‌కు మెమొరాండం ఇచ్చారు. సబ్‌కలెక్టర్ ఈనెల 22వ తేదీకి నోటీసు జారీచేశారు. ఎలాగైనా ఎంపీపీ పదవిని నిలబెట్టుకోవాలని దానమ్మ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. దీంతో ఎలాగైనా ఈ పదవిని నిలబెట్టుకోవాలని దానమ్మ భర్త పంపాపతి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు ముగ్గురికి డబ్బు వల విసిరి, నాగభూషణంరెడ్డిని కిడ్నాప్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. కూటమి నేతలు ఎన్ని కుతంత్రాలు పన్నినా ఆఖరికి అవిశ్వాస తీర్మానం నెగ్గేంత సంఖ్యాబలం వైఎస్సార్‌సీపీకే ఉంటుందని భావిస్తున్నారు.