
సాక్షి, చిత్తూరు: స్వయానా సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో టీడీపీ అప్రజాస్వామికంగా వ్యవహరించింది. అడ్డదారిలో మణీంద్రం ఎంపీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంది. నామినేషన్ల పరిశీలనకు వెళ్లకుండా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి హర్పితను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. దీంతో ఆమె నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.
2021లో జరిగిన ఎన్నికల్లో ఎంపీటీసీగా గెలుపొందిన శాంతకుమారి అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో ఉప ఎన్నిక అవసరమైంది. గత నెల 30 నుంచి ఈనెల 1వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ జరిగింది. టీడీపీ అభ్యర్థులుగా అరుణ, విశాలాక్షి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా శాంతకుమారి తనయ హర్పిత నామినేషన్లు దాఖలు చేశారు.
అయితే.. హర్పితను రెండో సెట్ నామినేషన్ వేయనీయకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఆమె తనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోలేదు. ఈలోపు రామకుప్పం మండలంలో ఒక్క స్థానం గెలవని టీడీపీ, అప్రజాస్వామికంగా వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకుంది. అదే సమయంలో టీడీపీ గూండాల వల్ల హర్పిత నామినేషన్ల పరిశీలనకు వెళ్లలేకపోయారు. ఫలితంగా మణీంద్రం ఎంపీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. రామకుప్పంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందనే చర్చ జోరందుకుందక్కడ.