
ఎంపీటీసీ లక్ష్మీదేవమ్మ ఇంటిపై దాడి చేసేందుకు వెళ్తున్న టీడీపీ నాయకులు
వైఎస్సార్‌సీపీ మహిళా ఎంపీటీసీకి కోడుమూరు టీడీపీ ఎమ్మెల్యే, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ హెచ్చరిక
40 కార్లలో వెళ్లి పోలీసుల సమక్షంలోనే ఆమె మనవడిని కిడ్నాప్ చేసిన టీడీపీ నేతలు
అడ్డొచ్చిన మహిళలపై విచక్షణారహితంగా దాడి
కర్నూలు రూరల్ మండలం నూతనపల్లెలో తీవ్ర ఉద్రిక్తత...
బలం లేకపోయినా ఎంపీపీ పదవి కోసం పచ్చమూక బరితెగింపు
టీడీపీలో చేరకపోతే అంతుచూస్తామని మరో ఎంపీటీసీకి హెచ్చరిక
సాక్షి టాస్క్ ఫోర్స్: ‘ఆమెకు చెప్పండి... లక్ష్మీదేవమ్మ టీడీపీలో చేరకపోతే ఆమె మనవడిని చంపేస్తాం...’ అని కర్నూలు జిల్లా కోడుమూరు టీడీపీ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ డి.విష్ణువర్ధన్‌రెడ్డి కర్నూలు రూరల్ మండలం నూతనపల్లె వైఎస్సార్‌సీపీ మహిళా ఎంపీటీసీ లక్ష్మీదేవమ్మను హెచ్చరించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి 40 కార్లలో లక్ష్మీదేవమ్మ ఇంటికి వెళ్లి పట్టపగలు పోలీసుల సమక్షంలోనే ఆమె మనవడు మహేంద్రను కిడ్నాప్ చేశారు.
అడ్డొచ్చిన మహిళలపై విచక్షణారహితంగా టీడీపీ మూకలు దాడి చేశారు. ఈ దౌర్జన్యకాండను వీడియోలు తీసినవారి సెల్‌ఫోన్‌లు లాక్కుని ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఒక ఎమ్మెల్యేనే దగ్గరుండి కిడ్నాప్ చేయించడం, పోలీసులు చేష్టలుడిగి చూడటం రాష్ట్రంలో అరాచక పాలనకు మరో నిదర్శనమని గ్రామస్తులు మండిపడుతున్నారు.
గ్రామంపైకి దండయాత్ర
టీడీపీ నాయకులు కర్నూలు రూరల్ ఎంపీపీ పదవిపై కన్నేశారు. తమకు బలం లేకపోయినా వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను భయపెట్టి టీడీపీలో చేర్చుకోవాలని ఎమ్మెల్యే దస్తగిరి, విష్ణువర్ధన్‌రెడ్డి నిర్ణయించారు. గురువారం వైఎస్సార్‌సీపీకి చెందిన నూతనపల్లె ఎంపీటీసీ లక్ష్మీదేవమ్మ, నందనపల్లె ఎంపీటీసీ జ్యోతి, రేమట ఎంపీటీసీ సుజాత, దిన్నెదేవరపాడు–1 ఎంపీటీసీ రామనాథ్‌రెడ్డిలను అభివృద్ధి పనులపై చర్చించాలని పిలిచి వారికి టీడీపీ కండువాలు వేశారు. నూతనపల్లె ఎంపీటీసీ లక్ష్మీదేవి తాను వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతానని శుక్రవారం ప్రకటించారు.
దీనిని జీరి్ణంచుకోలేని టీడీపీ ఎమ్మెల్యే దస్తగిరి, విష్ణువర్ధన్‌రెడ్డి శనివారం ఉదయం 40 వాహనాలతో నూతనపల్లెపై దండయాత్ర చేశారు. ఊరిలో అడ్డువచ్చిన వారిని కొట్టి ఎంపీటీసీ సభ్యురాలి ఇంటిపై దండెత్తారు. ఆ సమయంలో ఎంపీటీసీ లక్ష్మీదేవమ్మ, ఆమె కుమారుడు కృష్ణ ఇంట్లో లేరు. భయంతో ఆడవాళ్లు తలుపులు వేసుకుని లోపల ఉన్నారు. టీడీపీ మూకలు తలుపులు పగలగొట్టి అడ్డువచ్చిన మహిళలపై విచక్షణారహితంగా దాడి చేసి లక్ష్మీదేవమ్మ మనవడు మహేంద్ర(22)ను లాక్కెళ్లి కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు.
లక్ష్మీదేవమ్మ టీడీపీలోకి రాకపోతే మహేంద్రను చంపేస్తామని కుటుంబ సభ్యులను హెచ్చరించారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ మూకలు ఇష్టానుసారంగా కొట్టడం, యువకుడిని కిడ్నాప్ చేయడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు.
మరో ఎంపీటీసీ కుటుంబానికీ బెదిరింపులు
గురువారం టీడీపీ నేతలు కండువా కప్పిన దిన్నెదేవరపాడు–1 ఎంపీటీసీ రామనాథ్‌రెడ్డి కూడా శుక్రవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులను కూడా టీడీపీ నాయకులు బెదరించారు. రామనాథ్‌రెడ్డి టీడీపీలోకి రాకపోతే ఎంతవరకైనా వెళతామని, అంతు చూస్తామని హెచ్చరించారు.
ప్రజాస్వామ్యం ఖూనీ: ఎస్వీ మోహన్‌రెడ్డి
నూతనపల్లె ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మీదేవమ్మ, దిన్నెదేవరపాడు–1 ఎంపీటీసీ రామనాథ్‌రెడ్డి కుటుంబ సభ్యులను టీడీపీ నాయకులు బెదిరించడం, కిడ్నాప్ చేయడంపై వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ నాయకులు బరితెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, వారికి పోలీసులు వత్తాసు పలకడం అన్యాయమన్నారు. మహేంద్ర కిడ్నాప్‌పై వెంటనే కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బలం లేకపోయినా బరితెగింపు
కర్నూలు రూరల్ మండలంలో 23 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 12, టీడీపీ 10 స్థానాల్లో విజయం సాధించాయి. ఇండిపెండెంట్ ఒక స్థానంలో గెలుపొందారు. వైఎస్సార్‌సీపీకి చెందిన జి.సింగవరం ఎంపీటీసీ డి.సవారన్న, పసుపల టీడీపీ ఎంపీటీసీ మురళీకృష్ణ చనిపోయారు. పంచలింగాల ఎంపీటీసీగా ఉన్న బస్తిపాటి నాగరాజు(టీడీపీ) కర్నూలు ఎంపీగా గెలిచారు. ఆర్.కొంతలపాడు ఎంపీటీసీ కె.గిడ్డమ్మ(టీడీపీ) సుంకేసుల సర్పంచ్‌గా గెలిచారు.
దీంతో పంచలింగాల, ఆర్.కొంతలపాడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎంపీటీసీ బోయమద్దిలేటి(దిన్నెదేవరపాడు–2)తో కలుపుకొని వైఎస్సార్‌సీపీకి 12 మంది సభ్యుల బలం ఉంది. టీడీపీ బలం 7కు తగ్గింది. ఎంపీపీగా ఉల్చాల ఎంపీటీసీ వెంకటేశ్వరమ్మ(వైఎస్సార్‌సీపీ) కొనసాగుతున్నారు. తగిన బలం లేకపోయినా ఎంపీపీ పదవిని పొందాలని టీడీపీ నాయకులు కుట్రలు పన్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను బెదిరించి తమ పార్టీలో చేర్చుకునేందుకు బరితెగించారు.