‘సీతారామ’ కొత్తదా? పాతదా? 

Seetharama lift project was new says Godavari Board - Sakshi

     కొత్తదే అంటున్న గోదావరి బోర్డు

     కాళేశ్వరం మాదిరే రీ డిజైన్‌ చేసినందున పాతదే అంటున్న తెలంగాణ

     బోర్డుకు లేఖ రాసే యోచనలో రాష్ట్రం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల కొత్తదా, పాతదా? అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. ప్రాజెక్టు పాతదేనని రాష్ట్రం పలుమార్లు స్పష్టం చేసినా దీన్ని కొత్త ప్రాజెక్టుగానే పరిగణిస్తామంటూ గోదావరి బోర్డు పదేపదే లేఖలు రాస్తుండటం వివాదానికి దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పాతదే అని చెప్పడానికి గల కారణాలను పేర్కొంటూ మరోసారి లేఖ రాయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి జలాలను తీసుకుంటూ రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్‌ దుమ్ముగూడెం ప్రాజెక్టులను చేపట్టిన విషయం తెలిసిందే.

అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇందిరాసాగర్‌ ఇన్‌టేక్‌కు సంబంధించిన పనులు ఏపీలోకి వెళ్లాయి. ఇక రాజీవ్‌సాగర్‌ పనులన్నీ వన్యప్రాణి క్షేత్రంలో ఉండటంతో అటవీ అను మతులు ఇబ్బందిగా పరిణమించాయి. దీంతో దీన్ని రీ ఇంజనీరింగ్‌ చేసిన ప్రభుత్వం రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్‌ ప్రాజెక్టులను సమీకృతం చేసి గోదావరి నుంచి 50 టీఎంసీల జలాలను తీసుకుంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 5లక్షల ఎకరాలకు నీరిచ్చేలా సీతారామ ఎత్తిపోతలను చేపట్టింది. అనంతరం గోదావరి నీటిని 70 టీఎంసీలు తీసుకునే వెసులుబాటు ఉందని గుర్తించి, అందుకు అనుగుణంగా ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్‌ల్లోని ఆయకట్టుతో తాగు, పరిశ్రమల అవసరాలకు నీరిచ్చే అవకాశం ఉందని గుర్తించి.. దీనికిఅనుగుణంగా ఆయకట్టును 5లక్షల నుంచి 6.74 లక్షల ఎకరాలకు పెంచారు.  

ఏడాదిగా ఇదే తీరు..: మారిన డిజైన్‌కు అనుగుణంగా కేంద్ర సంస్థల నుంచి అనుమతి కోరుతూ గత ఏడాదే ప్రభుత్వం కేంద్రానికి రిపోర్టు పంపింది. దీనిపై స్పందించిన సీడబ్ల్యూసీ గోదావరి బోర్డు నుంచి వివరణ కోరింది. అయితే అప్పటికే ఏపీ చేసిన ఫిర్యాదుల దృష్ట్యా, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏదేని కొత్త ప్రాజెక్టు చేపడితే దానికి బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి తప్పనిసరని, గ్రూప్‌ ఆఫ్‌ మినిష్టర్స్‌ (జీఓఎం)కు సమర్పించిన నివేదికలో ఈ ప్రాజెక్టు లేనందున దీన్ని కొత్త ప్రాజెక్టుగా గుర్తిస్తామని తెలిపింది. దీనిపై అంతకుముందు గోదావరి బోర్డు సమావేశాల్లో తెలంగాణ వివరణ ఇచ్చినా, దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కొత్త ప్రాజెక్టేనని చెబుతూ వచ్చింది.

ఇటీవల సైతం ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్‌)ను తమకు సమర్పించాలని బోర్డు రాష్ట్రానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో బోర్డుకు వివరణ ఇచ్చేందుకు నీటిపారుదల శాఖ సిద్ధమైంది. కాళేశ్వరం ఎత్తిపోతల మాదిరే రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పాత ప్రాజెక్టులనే రీ డిజైన్‌ చేశామని, కాళేశ్వరం పాతదేనని కేంద్ర జల సంఘం గుర్తించినప్పుడు సీతారామ సైతం పాతదే అన్న అభిప్రాయాన్ని బోర్డుకు తెలియజేయాలని నిర్ణయించింది. దీనిపై త్వరలోనే ప్రభుత్వ సీఎస్‌ ఎస్‌కే జోషి బోర్డుకు లేఖ రాసే అవకాశాలున్నట్లు తెలిసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top