టీఎస్‌ఆర్టీసీ వచ్చాక రెండోసారి ఛార్జీల పెంపు

Second Time RTC Charges Increased By TSRTC - Sakshi

2016 జూన్‌లో తొలిసారి 8.77శాతం మేర పెంపు

ప్రస్తుత అధ్వాన పరిస్థితుల్లో పెంపు తప్పదన్న సీఎం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఆవిర్భవించాక ఇప్పటి వరకు కేవలం ఒక్కసారే బస్సు ఛార్జీలు పెరిగాయి. 2016 జూన్‌లో 8.77% మేర ఛార్జీలు పెంచారు. కొన్ని రకాల కేటగిరీ బస్సులపై మాత్రం 10% పెరిగింది. ఫలితంగా అప్పట్లో సాలీనా రూ.286 కోట్ల మేర భారం పడింది. ఆ తర్వాత ప్రభుత్వం ఛార్జీల పెంపు జోలికి పోలేదు. మూడ్నాలుగు దఫాలు ఆర్టీసీ అధికారులు ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలిచ్చినా ప్రభుత్వం అంగీ కరించలేదు. తీవ్ర నష్టాలతో జీతాలు చెల్లించేందుకు ఇబ్బంది ఉండటంతో ఛార్జీల పెంపు తప్ప గత్యంతరం లేదని అధికారులు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.

ఇప్పుడు పరిస్థితి అత్యంత అధ్వానంగా మారటంతో పెంపు తప్పదని సీఎం నిర్ణయించారు.ఇప్పుడు కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెంచటంతో.. సాలీనా రూ.752 కోట్ల మేర ప్రజలపై భారం పడనుంది. అంటే 18.80% మేర ఛార్జీలు పెంచి నట్టు అవుతోంది. అన్ని కేటగిరీలకు ఇది వర్తిస్తుంది. అంటే వంద కి.మీ. దూరానికి ప్రస్తుత ఛార్జీపై రూ.20 చొప్పున పెరుగుతుందన్నమాట. కొత్త టికెట్‌ ధరలను శుక్రవారం ఖరారు చేయనున్నారు.

బస్సులు బాగుపడేందుకు నెల సమయం 
ప్రస్తుతం రాష్ట్రంలోని ఒకటి రెండు మినహా అన్ని డిపోల్లో బస్సులు పూర్తిగా కండీషన్‌ తప్పాయి. రెగ్యులర్‌గా డిపోల్లో వాటికి నిర్వహించే షెడ్యూల్‌ 1 నుంచి షెడ్యూల్‌ 5 వరకు మెయింటెనెన్స్‌ పనులు దాదాపు పడకేశాయి. నెలన్నరగా కేవలం ఒకటో షెడ్యూల్‌ను కొంతమేర నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అన్ని బస్సులు షెడ్యూల్‌ 5 మెయింటెనెన్స్‌ నిర్వహించాలి. అంటే ఇంజిన్‌ పూర్తిగా విప్పదీసి సరిచేయాలి. ఇలా అన్ని బస్సులకు పూర్తి చేసేందుకు నెల సమయం పడుతుంది.

లేబర్‌ కోర్టు తేల్చాల్సిందే: జీతాల్లేక కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో, విధుల్లోకి చేరితే చాలు అన్న పరిస్థితి వారి ముందు ఉంది. ఏ డిమాండ్ల కోసం సమ్మెకు దిగారో, వాటిని పట్టించుకునే పరిస్థితే లేదు. లేబర్‌కోర్టులో నే తేల్చుకోవాలని హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో..ఆ డిమాండ్ల భవితవ్యం కార్మిక న్యాయస్థానమే తేల్చాల్సి ఉంది. శుక్రవారం ఉదయం కార్మికులు విధుల్లోకి వస్తున్నందున తాత్కాలిక సిబ్బందికి సెలవు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top