మా బడిలో సీట్లు ఖాళీగా లేవు

Seats are not empty in our school - Sakshi

సిద్దిపేట ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలకు పోటా పోటీ 

మూడేళ్లుగా రెండు రోజుల్లోనే అడ్మిషన్లు పూర్తి 

ఈ ఏడాది వెయిటింగ్‌ లిస్టులో 88 మంది విద్యార్థులు

సాక్షి, సిద్దిపేట: దశాబ్ద కాలం క్రితం పుట్టగొడుగుల్లా పుట్టుకువచ్చిన ప్రైవేట్, కార్పొరేట్‌ పాఠశాలల పుణ్య మా అని రాష్ట్రంలోని సగానికి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. విద్యార్థులు లేరని కొన్ని చోట్ల పాఠశాలలను మూసివేసిన సంఘటనలూ ఉన్నాయి. కానీ సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్‌ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో మాత్రం పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. 

ఈ పాఠశాలలో వేసవి సెలవుల తర్వాత ప్రారంభమైన మూడు, నాలుగు రోజుల్లోనే పరిమితికి మించి దర ఖాస్తులు వస్తుంటాయి. అనేకమందిని వెయిటింగ్‌ లిస్టులో పెట్టి మరీ తమ పాఠశాలలో ప్రవేశాలు నిలిపి వేశామని బోర్డు పెడుతుండడం గమనార్హం.  

ఐదు తరగతులు.. పదహారు సెక్షన్లు..  
ఒక్కో తరగతికి సరిపడా విద్యార్థులు లేని ప్రభుత్వ పాఠశాలలు ఉన్న ఈ రోజుల్లో ఐదు తరగతులకు 16 సెక్షన్లు ఏర్పాటు చేసినా విద్యార్థుల ప్రవేశాలకోసం క్యూలు కట్టడం ఈ పాఠశాల ప్రత్యేకత. ఇంగ్లిష్‌ మీడియంలో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న సిద్దిపేట ఇందిరానగర్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలలో మొత్తం 16 సెక్షన్లు ఉన్నాయి.  గడిచిన మూడు సంవత్సరాల్లో పాఠశాలలు ప్రారంభమైన కొద్ది రోజులకే ఈ స్కూలు నోటీస్‌ బోర్డు మీద ప్రవేశాలు నిలిపి వేశామనే బోర్డు పెట్టడం పరిపాటిగా మారింది. ఈ ఏడాది ఆరవ తరగతిలో మూడు సెక్షన్లకు సరిపడా విద్యార్థులు పోగా మరో 88 మంది విద్యార్థులను వెయిటింగ్‌ లిస్టులో ఉంచారు. 

వైవిధ్యంగా బోధన  
ఈ పాఠశాలలో బోధన అంతా వైవిధ్యంగా ఉంటుంది. విద్యా క్యాలెండర్‌ను ఒక వైపు పాటిస్తూనే.. మరో వైపు కొన్ని ప్రత్యేక కార్యక్రమాతో విద్యార్థికి మార్కు లు, ర్యాంకులే కాకుండా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా బోధన ఉంటుంది. ఇక్కడ ఒక ప్రధానోపాధ్యాయు డు, 20 మంది ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యావలంటీర్లు, మరో ముగ్గురు వృత్తి విద్యా కోర్సులు బోధించే వారు ఉన్నారు. విద్యార్థులకు బోధన కోసం ఐదు టీంలు ఏర్పాటు చేశారు. క్రీడలతోపాటు నృత్యం, సంగీతం, సాంఘిక ఉన్నతి, చేతి వృత్తులు నేర్పించడం ఇక్కడి ప్రత్యేకత. మామూలు పాఠశాలలకన్నా అరగంట ముందుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలకు చేరుకుంటారు. ధ్యానంతో పాఠశాల దైనందిన కార్యక్రమాలు మొదలవుతాయి. ఇంటి వద్ద ఉన్న పరిస్థితులు, ఒత్తిడి నుంచి విద్యార్థులను పాఠ్యాంశాలను వినేందుకు సన్నద్ధం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ముందుగా రూపొందించుకున్న పాఠ్య ప్రణాళిక ప్రకారం బోధన ఉంటుంది. సాయం త్రం గ్రూపుల వారిగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందుకే ఈ పాఠశాలలో పేద విద్యార్థులే కాదు. దాదాపు 50 మందికి పైగా ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను కూడా చేర్పించడం విశేషం.  

దాతల సహకారంతో వసతుల కల్పన  
ప్రభుత్వ పాఠశాల అంటే ఒకటి ఉంటే మరొకటి ఉండదు అనే భావన ప్రజల్లో నెలకొంది. కానీ ఈ పాఠశాలలో మాత్రం విద్యార్థులకు అన్ని వసతులూ ఉన్నాయి. పరిశుభ్రమైన మరుగుదొడ్లు, విశాలమైన తరగతి గదులు, డిజిటల్‌ బోధన పరికరాలు. రక్షిత తాగునీరు, ఆడుకునేందుకు ఆహ్లాదకరమైన వాతావరణం.. ఆట స్థలాలు ఉన్నాయి. ఉన్నత ప్రమాణాలతో బోధన సాగుతున్న ఈ పాఠశాలను నాట్కో సంస్థ గుర్తించి రూ. 60 లక్షల వ్యయంతో వివిధ వసతులు కల్పించింది. బాలవికాస, లయన్స్‌క్లబ్, ఇతర దాతలతోపాటు, పాఠశాల ఉపాధ్యాయులు కూడా తరచుగా విరాళాలు ఇస్తుంటారు. ఇదే కాకుండా గత ఏడాది గూగుల్‌ కంపెనీ ప్రోత్సాహకాలు, యూనిసెఫ్‌ ద్వారా టాకింగ్‌ బుక్స్‌ సరఫరాకు కూడా ఈ పాఠశాల ఎంపిక కావడం గమనార్హం. పాఠశాల పనితీరును చూసిన నాట్కో కంపెనీ ప్రతినిధులు ఈ ఏడాది కూడా మరో రూ.40 లక్షల నిధులు ఖర్చు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 

అంకిత భావంతో పనిచేయడమే.. 
ప్రభుత్వ పాఠశాలంటే చాలా మందికి చిన్నచూపు. దీన్ని రూపుమాపాలన్నదే మా ఉద్దేశం. అందుకే నాతోపాటు సహచర ఉపాధ్యాయులు, ఉన్నత ప్రమాణాలతో బోధన చేస్తున్నాం.  ఇదే మా విజయానికి మూలం. 
– రామస్వామి, ప్రధానోపాధ్యాయుడు 

మంచి బోధన అందిస్తున్నారు 
నేను గతంలో న్యూజిలాండ్‌లో ఉండేవాడిని. అక్కడే మా బాబు పుట్టాడు. ఇక్కడ ప్రైవేట్‌ పాఠశాలల్లో మూస విద్యా బోధన జరుగుతోంది. దీన్ని గమనించి మా బాబును ఇందిరానగర్‌ జెడ్పీ పాఠశాలలో చేర్పించాను. ఇక్కడ విద్యనే కాకుండా నైతిక విలువలు కూడా బోధించడం సంతోషకరం.    
– డాక్టర్‌ కృష్ణ దయాసాగర్, ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాల డీన్‌

మా ఊరు నుంచి వచ్చాం
మాది సిద్దిపేట పక్కనే ఉన్న చందలాపూర్‌. అక్క డి కన్నా ఇక్కడ మంచిగా చదువు చెబుతారని తెలిసిన మా తల్లిదండ్రులు సిద్దిపేటకు మకాం మార్చి నన్ను ఈ బడిలో చేర్పించారు. ఇక్కడ పాఠాలు బాగా చెబుతున్నారు.   
 – శిరీష, పదవ తరగతి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top