బడి దూరం పెరగనుందా?

Schools Neighbourhood Distance May Increase In Telangana - Sakshi

నైబర్‌హుడ్‌ పరిధి 5కి.మీ.లకుపెంచే యోచన

ఆ దిశగా మొదలైన కసరత్తు.. అధికారుల కమిటీ ఏర్పాటు

ఆ నిబంధన మార్పు సాధ్యాసాధ్యాలపై

నివేదిక కోరిన విద్యాశాఖ

సాక్షి, హైదరాబాద్‌ : విద్యా హక్కు చట్టం ప్రకారం నివాస ప్రాంతానికి (నైబర్‌హుడ్‌) కిలోమీటర్‌ దూరంలో ప్రాథమిక పాఠశాల, 3 కి.మీ. దూరంలోపు ప్రాథమికోన్నత, 5 కిలోమీటర్లలోపు ఉన్నత పాఠశాల ఉండాలి. ఈ నిబంధన ఇకపై మారబోతోందా అంటే, విద్యాశాఖ నుంచి అవుననే సమాధానమే వస్తోంది. నైబర్‌హుడ్‌ పరిధి పెంపునకు కసరత్తు మొదలైందని విద్యాశాఖ వర్గాలు నిర్ధారించాయి. పాఠశాల కేటగిరీని బట్టి ఒక కిలోమీటర్, 3 కి.మీ., 5 కి.మీ. ఉండగా, ఇకపై అన్నింటికి 5 కి.మీ. దూరాన్నే వర్తింపజేసే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. అయితే అది సాధ్య మవుతుందా? లేదా? విద్యాహక్కు చట్టం ఏం చెబుతోంది. అది సాధ్యం కాకపోతే ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టవచ్చునన్న అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ ఈనెల 15వ తేదీన విద్యాశాఖ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఆ కమిటీ ఈ నెల 22వ తేదీలోగా నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. అందులో మరోవైపు మున్సిపాలిటీ, కార్పొరేషన్, కంటోన్మెంట్‌ వంటి సంస్థల పరిధిలో ఉండే పట్టణ ప్రాంతాల్లో నైబర్‌హుడ్‌ పరిధిని ఒక వార్డుగా చేర్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు విద్యా హక్కు చట్టం నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలో చట్టం అమలుకు ఇచ్చిన రూల్స్‌కు సవరణ చేసేందుకు విద్యాశాఖ సిద్ధమైంది.

హేతుబద్ధీకరణ కోసమేనా?
రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 26,754 పాఠశాలలుంటే.. ఒక్క విద్యార్థీ లేని స్కూళ్లు 916 ఉన్నాయి. ఈస్కూళ్లలో 748 మంది టీచర్లున్నారు. వారిని విద్యాశాఖ ఇతర స్కూళ్లలో తాత్కాలికంగా సర్దుబాటు చేసింది. అయితే 1–10 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలు 1,752 ఉండగా, వాటిల్లో 2,022 మంది టీచర్లు ఉన్నారు. 11 నుంచి 20 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్లు 3,441 ఉండగా, వాటిల్లో 5,275 మంది టీచర్లను కొనసాగించాల్సి వస్తోంది. మొత్తంగా 20 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్లలోనే 5 మందికి పైగా టీచర్లను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హేతుబద్ధీకరణకు ఆలోచనలు చేసింది. అయితే ఉపాధ్యాయ సంఘాలు స్కూళ్లు మూసేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వాస్తవానికి ఒకటి నుంచి ఐదు తరగతులు ఉండే ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక టీచర్‌ ఉండేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ప్రస్తుతం ఉన్న టీచర్లను సర్దుబాటు చేయకుండా, పాఠశాలల హేతుబద్ధీకరణ చేయకుండా అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. విద్యార్థులు చాలా తక్కువ మంది ఉన్నా 5 వేల మందికి పైగా టీచర్లను వాటికి కేటాయించడం ద్వారా మానవ వనరులు వృథా అవుతున్నాయి. వారిని ఆయా స్కూళ్లలోనే కొనసాగించాల్సి రావడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు వారిని పంపించలేని పరిస్థితి నెలకొంది. విద్యా హక్కు చట్టంలో ఆవాస ప్రాంతానికి నిర్ధేశిత దూరంలో పాఠశాల లేకపోతే ట్రాన్స్‌పోర్టు సదుపాయం కల్పించాలని చట్టం చెబుతోంది. దానిని కొన్ని చోట్ల అమలు చేస్తున్నా.. తక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూళ్లను ఇతర స్కూళ్లలో విలీనం చేసేందుకు తంటాలు పడాల్సి వస్తోంది. అందుకే విద్యాహక్కు చట్టం నిబంధనలకే మార్పులు చేయడం సాధ్యమా? అది సాధ్యమైతే తమ ఆలోచనలను సులభంగా ఆచరణలో పెట్టవచ్చన్న భావనతో అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది.

న్యూ ఎడ్యుకేషన్‌ పాలసీ చెబుతున్నదీ అదే..
త్వరలోనే కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టిన నూతన విద్యా విధానంలో కూడా స్కూల్‌ కాంప్లెక్స్‌ పేరుతో ఉన్నత పాఠశాలలను అభివృద్ధి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఆ కాంప్లెక్స్‌కు 5 నుంచి 10 మైళ్ల పరిధిలో కింది తరగతులతో కూడిన పాఠశాలలను కొనసాగించాలని గతంలోనే ఎడ్యుకేషన్‌ కమిషన్‌ సిఫారసు చేసిందని న్యూ ఎడ్యుకేషన్‌ పాలసీ అభిప్రాయపడింది. ఇప్పుడు స్కూల్‌ కాంప్లెక్స్‌ విధానాన్ని అమల్లోకి తేవాల్సిన అవసరం ఉందని పాలసీని రూపొందించిన నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. అది అమల్లోకి రావాలంటే విద్యాహక్కు చట్టంలోని నివాస ప్రాంతంలో స్కూల్‌ ఉండాల్సిన నిర్ధేశిత పరిధిని పెంచేలా మార్పులు చేయాల్సి వస్తుంది. కేంద్రం ఇంకా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏం సిఫారసు చేస్తుందన్నది ఇపుడు ఆసక్తికరంగా మారింది.

పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసిన కమిటీలోని సభ్యులు..

  • హైదరాబాద్‌ ఆర్జేడీ
  • హైదరాబాద్‌ డీఈవో
  • రంగారెడ్డి డీఈవో
  • హైదరాబాద్‌ జిల్లాకు చెందిన ఒక డిప్యూటీ ఈవో.
  • రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక ఎంఈవో
  • సమగ్ర శిక్షా అభియాన్‌ నుంచి ఏఎస్‌పీడీ తరపున ఒక ప్రతినిధి 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top