 
													3వ తరగతి నుంచే కృత్రిమ మేధతో పరిచయం
2026–27 విద్యా సంవత్సరం నుంచి అమలు
కేంద్ర విద్యా శాఖ నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ విద్యా వ్యవస్థలో మరో విప్లవాత్మక మార్పునకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు అన్ని పాఠశాలల్లోనూ 3వ తరగతి నుంచే ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), కంప్యూటేషనల్ థింకింగ్ (సీటీ)ను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని కేంద్ర విద్యా శాఖ నిర్ణయించింది. జాతీయ విద్యా విధానం–2020 జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం (ఎన్సీఎఫ్‌ఎస్‌ఈ) 2023 సిఫార్సుల మేరకు పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయను న్నారు. ఈ నెల 29వ తేదీన సీబీఎస్‌ఈ, ఎన్‌సీఈఆర్‌టీ, కేంద్రీయ విద్యాలయ సంగఠన్, నవోదయ విద్యాలయ సమితి ప్రతినిధులు, ఇతర విద్యా రంగ నిపుణులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ ఈ విషయం తెలిపారు.
ఏఐ విద్యను మన చుట్టూ ఉన్న ప్రపంచంతో ముడిపడి ఉన్న ఒక ప్రాథమిక సార్వత్రిక నైపుణ్యంగా పరిగణించాలన్నారు. ప్రజా ప్రయోజనం కోసం ఏఐ అనే భావనను బలోపేతం చేయడం, సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించడానికి ఏఐను నైతికంగా ఉపయోగించడంపై పునాది స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలి్పంచడం ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఏఐ, సీటీ పాఠ్యాంశాల రూపకల్పన కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఐఐటీ మద్రాస్‌కు చెందిన ప్రొఫెసర్ కార్తీక్ రామన్ అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామన్నారు.
నూతన పాఠ్యాంశాల అమలులో ఉపాధ్యాయ శిక్షణ అత్యంత కీలకమని కార్యదర్శి సంజయ్ కుమార్ తెలిపారు. ఇందుకోసం ‘నిష్ఠ’శిక్షణా మాడ్యూల్స్, వీడియో ఆధారిత వనరులను విస్తృతంగా ఉపయోగించుకోనున్నారు. గ్రేడ్‌ల వారీగా ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలను పరిశీలిస్తూనే దేశ అవసరాలకు తగినట్లుగా పాఠ్యాంశాలను రూపొందించాలని సంజయ్ కుమార్ సూచించారు. డిసెంబర్ కల్లా పాఠ్యాంశాల అభివృద్ధి పూర్తి చేయాలన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
