‘స్లో’ట్యాగ్‌!

Scanning issues with fixing Fastags - Sakshi

సెన్సార్లతో ఫాస్టాగ్‌ల దాగుడుమూతలు

ట్యాగ్‌లు తోచిన చోట ఫిక్స్‌ చేయటంతో స్కానింగ్‌ సమస్యలు

ఆర్టీసీ బస్సులు, లారీల ట్యాగ్‌లు పసిగట్టలేని యంత్రాలు

హ్యాండ్‌హెల్డ్‌ పరికరాలతో స్కాన్‌ చేయాల్సిన దుస్థితి

నగదు చెల్లించే విధానం కంటే మరింత ఆలస్యం..  

ఇది హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వెళ్తున్న రాజధాని బస్సు. దానికి ఫాస్టాగ్‌ ఉంది. టోల్‌ప్లాజాలో అక్కడి సెన్సార్‌ దాన్ని స్కాన్‌ చేసి రుసుము డిడక్ట్‌ చేసుకుని క్షణాల వ్యవధిలో గేట్‌ తెరుచుకోవాల్సి ఉంది. కానీ సెన్సార్లు ఆ పని చేయకపోవటంతో టోల్‌ప్లాజా సిబ్బంది హ్యాండ్‌హెల్డ్‌ యంత్రం ద్వారా స్కాన్‌ చేసే ప్రయత్నం చేశారు. అయినా సాధ్యం కాకపోవటంతో ఆ యంత్రాన్ని డ్రైవర్‌ చేతికే ఇచ్చారు. ఆయన కాసేపు అటూఇటూ కదిలిస్తూ తిప్పలుపడితేగాని పని కాలేదు. ఇందుకు ఐదారు నిమిషాల సమయం తీసుకుంది. ఈలోపు వెనక వాహనాలు నిలిచిపోయాయి. ఇది ఈ ఒక్క బస్సుకు ఎదురైన సమస్య కాదు. దాదాపు అన్ని బస్సులది ఇదే సమస్య.. 
– సాక్షి, హైదరాబాద్‌

కొత్తగా ఓ పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే దాన్ని ఎలా వినియోగించుకోవాలో కూడా తెలియాలి. అందుకు కొంత నేర్పు, అవగాహన, శిక్షణ అవసరం. ఇవేవీ లేకుండా ఆ పరిజ్ఞానాన్ని వినియోగిస్తే కొత్త ఇబ్బందులు రావటమే కాకుండా అభాసుపాలు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫాస్టాగ్‌ విషయంలో ఇదే జరుగుతోంది. పాత పద్ధతిలో నగదు చెల్లించి టోకెన్‌ తీసుకునేందుకు పట్టే సమయం కంటే, ఫాస్టాగ్‌ వచ్చాక ట్యాగ్‌ స్కానింగ్‌కు ఎక్కువ సమయం పట్టాల్సి రావటం విశేషం. ఆర్టీసీ బస్సులు, కొన్ని ఇతర ప్రైవేటు బస్సులు, లారీలకు ఈ సమస్య ఎక్కువగా ఉత్పన్నమవుతోంది. టోల్‌గేట్ల పైభాగంలో ఉండే స్కానర్లు వీటి ట్యాగ్‌లను స్కాన్‌ చేయలేకపోతున్నాయి.

ఎక్కడ అతికించాలో తెలియదు..
కేంద్ర ఉపరితల రవాణాశాఖ గడువు విధించి మరీ ఎలక్ట్రానిక్‌ టోల్‌ చెల్లింపు విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అంతకు కొన్ని నెలల ముందు నుంచే ప్రయోగాత్మకంగా దాన్ని అమలు చేయటం కూడా ప్రారంభించింది. నగదు చెల్లించే వాహనాలకు సంబంధించి కేవలం ఒక్క లేన్‌ మాత్రమే అందుబాటులో ఉంచుతామని, మిగతావన్నీ ఫాస్టాగ్‌ అతికించిన వాహనాలకే కేటాయిస్తామని, ట్యాగ్‌ లేని వాహనాలు టోల్‌ చెల్లించేందుకు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంటుందంటూ ప్రకటనల రూపంలో ప్రచారం కూడా చేసింది. దీంతో వాహనదారులు హడావుడిగా ట్యాగ్‌ కొంటూ వచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ కొన్న ట్యాగ్‌ను వాహనానికి ఎక్కడ అతికించాలనే విషయంలో చాలామందికి అవగాహన లేకుండా పోయింది. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. కార్లతో పోలిస్తే పెద్ద వాహనాల్లో ఈ సమస్య ఏర్పడింది. ట్యాగ్‌ను తోచిన చోట అతికించటంతో స్కానర్లు దాన్ని గుర్తించటం లేదు.

పెద్ద వాహనాలకు ఆ చోటనే.. 
లారీలు, బస్సులు లాంటి పెద్ద వాహనాలకు ఫాస్టాగ్‌ను ముందు వైపుండే ఎడమ అద్దానికి దిగువ భాగంలో డ్రైవర్‌ వైపు అతికించాలి. సెన్సార్లు గుర్తించే స్థలం ఇదే. ఆటోమేటిక్‌గా స్కాన్‌ చేసి గ్రీన్‌సిగ్నల్‌ చూపి గేట్‌ను ఓపెన్‌ చేస్తుంది. కానీ చాలామంది డ్రైవర్‌  ముందుండే అద్దం పైభాగంలో అతికిస్తున్నారు. ఫలితంగా సెన్సార్‌లు మొండికేస్తున్నాయి. ఇక కార్లకు అయితే అద్దంపై భాగంలో అతికించాలి. అక్కడ ఉంటేనే సెన్సార్లు గుర్తిస్తాయి.  

ఆర్టీసీ స్టిక్కర్లు పాతబడి.. 
ఇటు స్టిక్కర్లు తప్పుడు ప్రాంతాల్లో అతికించటం వల్ల ఏర్పడ్డ సమస్యకు తోడు ఆర్టీసీ బస్సుల్లో మరో ఇబ్బంది వచ్చిపడింది. ఎలక్ట్రానిక్‌ టోల్‌ చెల్లింపు విధానం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన 2017లోనే ఆర్టీసీ కొన్ని దూర ప్రాంత బస్సులకు ఫాస్టాగ్‌లు తీసుకుంది. ఇప్పుడు అవి పాతబడిపోయాయి. బస్సు అద్దాలను కడిగే సమయంలో చాలా ట్యాగ్‌లు స్వల్పంగా దెబ్బతింటూ వచ్చాయి. దీంతో సెన్సార్లు వాటిని గుర్తించటం లేదు. కొన్ని బస్సులకు ట్యాగ్‌ ఉండి కూడా డ్రైవర్లు నగదు చెల్లించి పాత పద్ధతిలో టోకెన్‌ తీసుకోవాల్సి వస్తోంది.  

సమస్యను గుర్తించాం.. 
‘ఆర్టీసీ బస్సుల్లో ఎదురవుతున్న సమస్యను గుర్తించాం. తప్పుడు చోట్ల అతికించిన వాటిని తొలగించి సరైన స్థానంలో అతికించుకోవాలని ఆర్టీసీకి సూచించాం. దీంతోపాటు పాతబడ్డ ట్యాగ్‌ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసుకోవాలని కూడా పేర్కొన్నాం. గతంలో ట్యాగ్‌ అతికించిన కొన్ని బస్సులు ఇతర డిపోలకు మారటంతో వాటికి అక్కడ కొత్త ట్యాగ్‌లు తీసుకున్నారు. ఇలా రెండు ఉండటం వల్ల కూడా సమస్య ఎదురవుతోంది. మిగతా బస్సులకు కూడా ట్యాగ్‌లు ఏర్పాటు చేసే విషయంలో సోమవారం బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ లోపాలపై చర్చించి ఆర్టీసీ అధికారులకు సూచనలు జారీ చేశాం..’
– ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top