ఆర్టీసీ అద్దెకు తీసుకున్న ప్రైవేటు బస్సు
తాండూరు/తాండూరు టౌన్: ఆర్టీసీ అద్దెకు తీసుకున్న ప్రైవేటు బస్సులతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. తాండూరు డిపోలో మొత్తం 90 బస్సులు ఉండగా అందులో 57 సంస్థకు చెందినవి కాగా, 33 ప్రైవేటు వ్యక్తుల నుంచి అద్దెకు తీసుకున్నవి. డిపోలో మొత్తం 132 మంది డ్రైవర్‌లు, 165 మంది కండక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అద్దె బస్సులను ప్రైవేటు డ్రైవర్‌లే నడిపిస్తున్నారు. ఐదేళ్లుగా తాండూరు డిపోకు చెందిన బస్సులు పెద్ద ఎత్తున ప్రమాదాలకు గురయ్యాయి. తాండూరు– భద్రాచలం వైపు వెళ్లే బస్సు ప్రమాదానికి గురికావడం అప్పట్లో సంచలనంగా మారింది. తర్వాత వరుసగా అనంతగిరి గుట్టలో బస్సు బొల్తాపడింది.
చేవెళ్లలోని ఆలూరు వద్ద ఓ బస్సు ప్రమాదానికి గురైంది. తాజాగా మీర్జాగూడ వద్ద (34టీఏ6354) ఇదే డిపో బస్సు ప్రమాదానికి గురైంది. దీంతో తాండూరు డిపో నిర్వహణ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి డిపోలో సుమారు 30 వరకు ప్రైవేటు వ్యక్తులకు చెందిన బస్సులు అద్దెకు తిప్పుతున్నారు. ప్రైవేటు బస్సులు నడిపించే డ్రైవర్‌ల పని తీరును డిపో అధికారులు పరిశీలించాల్సి ఉంది.
అయితే సోమవారం తెల్లవారు జామున 4.40 గంటలకు తాండూరు ప్రాంతానికి చెందిన ప్రైవేట్ డ్రైవర్ దస్తగిరి బాబా హైదరాబాద్‌కు బయలు దేరేందుకు బస్సు ఎక్కాడు. అతడికి ఆరోగ్య పరీక్షలు చేయకుండానే బస్సును డిపో నుంచి పంపించారు. సదరు డ్రైవర్ గతంలో అనంతగిరి గుట్టపై బస్సును బోల్తా కొట్టించాడు. అదే డ్రైవర్‌కు తిరిగి బస్సు నడిపించేందుకు అవకాశం ఎలా ఇచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. డిపోకు చెందిన బస్సును, సంస్థ సిబ్బందిని ఫస్ట్ ట్రిప్‌లో పంపించకపోవడం డిపో అధికారుల నిర్లక్ష్యమేనని విమర్శిస్తున్నారు.
శాణమ్మ పేరిట రిజిస్ట్రేషన్
అద్దెకు తీసుకున్న ప్రైవేటు బస్సు శాణమ్మ పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉంది. 2026 సెప్టెంబర్  వరకు అగ్రిమెంట్ ఉంది. ఆరేళ్లుగా బస్సు డిపోలో నడుస్తోంది. ప్రైవేటు బస్సు కావడంతో డిపోలోకి వెళ్లవు. బయటి నుంచి మాత్రమే వెళ్తాయి.   

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
