గాంధీభవన్‌లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం రసాభాసగా మారింది.
హైదరాబాద్: గాంధీభవన్‌లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం రసాభాసగా మారింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో పార్టి ఓటమికి కారణాలపై చర్చించాలని కొందరు నేతలు పట్టుబట్టడంతో గొడవ ప్రారంభమైంది. పైస్థాయి నాయకులు వాస్తవాలు చెప్పడం లేదంటూ మండిపడ్డారు.ఏళ్ల తరబడి కార్యకర్తలకు అన్యాయం చేశారంటూ సీనియర్లను బి.కిషన్, వెంకన్న నిలదీశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓడిపోవడానికి తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి తేడా ఉందన్నారు. తెలంగాణలో ఓటమికి సీనియర్ నేతలే కారణమని, వారు తక్షణం పదవుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
సీనియర్ నేతలు రాజీనామా చేయాలన్న ఇతర నేతల డిమాండ్‌లో అర్థం ఉందని పొంగులేటి సుధాకర్ రెడ్డి సమర్థించారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్‌ను ప్రక్షాళన చేయాలన్నారు. ఈ గందరగోళం నడుమ సోనియా, రాహుల్ నాయకత్వాన్ని సమర్థిస్తూ దామోదర రాజనర్సింహ తీర్మానాన్ని ప్రతిపాదించారు. రాజనర్సింహ తీర్మానాన్ని సమావేశం బలపరిచింది.