
పార్టీలో అంతర్గత విభేదాలపై నేతలకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ హెచ్చరిక
స్థానిక ఎన్నికల వేళ విభేదాలకు దూరంగా ఉండాలని పార్టీ నేతలకు హితవు
పీసీసీ చీఫ్, సీఎంకు వరంగల్ విభేదాలపై కమిటీ నివేదిక
కేటీఆర్ తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడన్న కమిటీ చైర్మన్ మల్లురవి
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థలకు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ పిలుపునిచ్చింది. విభేదాలకు దూరంగా ఉండాలని హితవు పలికింది. అంతర్గత విభేదాల పేరుతో ఎవరైనా మీడియా ముందుకొచ్చి మాట్లాడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కమిటీ చైర్మన్, ఎంపీ మల్లురవి అధ్యక్షతన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదివారం గాందీభవన్‌లో సమావేశమైంది.
కమిటీ సభ్యులు అనంతుల శ్యాంమోహన్, కమలాకర్‌రావు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపై కమిటీ చర్చించింది. వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి సురేఖ, పార్టీ నేతలు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలపై రూపొందించిన నివేదికను.. సీఎం రేవంత్‌తోపాటు, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు అందజేయాలని కమిటీ నిర్ణయించింది. ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం వారికే ఇవ్వాలని తీర్మానించింది. సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌చార్జి పూజల హరికృష్ణపై ఫిర్యాదు రావడంతో ఆయన వివరణ కోరింది.
కమిటీ ముందుకు నర్సారెడ్డి
సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తూంకుంట నర్సారెడ్డి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై తనపై వచ్చిన ఫిర్యాదుల గురించి వివరణ ఇచ్చారు. అనంతరం నర్సారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తనపై నమోదైన పోలీస్ కేసు గురించి కమిటీ వివరణ అడిగిందని చెప్పారు. తనపై ఫిర్యాదు చేసిన నాయకులు పార్టీకి సేవ చేసిన వారు కాదని, బీజేపీకి పనిచేసిన వారని చెప్పారు. అలాంటి వారు ఆరోపణలు చేస్తే కమిటీ తనను వివరణ ఎందుకు అడిగిందో అర్థం కావడం లేదన్నారు. గజ్వేల్‌తో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావుకు సంబంధం లేదన్నారు.
రాజగోపాల్‌రెడ్డి అంశం మా దృష్టికి రాలేదు: చైర్మన్ మల్లురవి
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గురించి తాము చర్చించలేదని మల్లురవి చెప్పారు. కమిటీ భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎవరి ప్రయోజనాల కోసమో క్రమశిక్షణ కమిటీలో చర్చ జరగదన్నారు. రాజగోపాల్‌రెడ్డి అంశం తమ దృష్టికి రాలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే అది క్రమశిక్షణ కమిటీకి వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ నుంచి బయటకెళ్లిన వారంతా మళ్లీ పార్టీ గూటికి రావాలని కోరారు. పార్టీలో అంతర్గత విభేదాల పేరుతో రచ్చకెక్కితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మాజీ మంత్రి కేటీఆర్ తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డాడని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో ఆయన ఏం చేశారో ఒక్కసారి చూసుకుని తమను ప్రశ్నించాలన్నారు. పదేళ్లలో ఎంతో మందిని చేర్చుకున్న ఆయన కూడా రాజీనామాలు చేయించారా అని ప్రశ్నించారు. అసలు ఆ ఎమ్మెల్యేలు తాము పార్టీనే మారలేదని చెపుతుంటే కేటీఆర్‌కు వచి్చన ఇబ్బందేంటో అర్థం కావడం లేదన్నారు.