సాక్షి హైదరాబాద్ : ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రంలోని ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని సీఎం తెలిపారు. మంగళవారం గాంధీభవన్ లో నిర్వహించిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాలను ఇంటింటింకీ తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీతో మహిళలు సంతోషంగా ఉన్నారని, కోటి చీరలను ఆడబిడ్డలకు సారెగా అందిస్తున్నామని ప్రతీ ఆడబిడ్డకు చీర చేరేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షులదే అని తెలిపారు. డిసెంబర్ లోగా గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరల పంపిణీ పూర్తయ్యేలా చూడాలని మార్చిలో పట్టణ ప్రాంతాల్లో మహిళలకు 35 లక్షల చీరలను పంపిణీ చేయాలన్నారు.
2034 నాటికి రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చి దిద్దాలని లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ నెల 7న ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీ ముందు సభ పెట్టి యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని వర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈనెల 8, 9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించుకుంటున్నామని ఆకార్యక్రమంలోనే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించుకోబోతున్నాం.
తెలంగాణలో నూతనంగా నాలుగు విమానాశ్రయాలు, ఒక డ్రై పోర్టు ఏర్పాటు చేసుకోబోతున్నామన్నారు. కేంద్రంతో కొట్లాడి హైదరాబాద్ బెంగుళూరు గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ మంజూరు చేయించుకున్నామని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు అనేది గొప్ప బాధ్యత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని పేర్కొన్నారు. రాజకీయాల్లో కాళ్లలో కట్టెలు పెట్టడం సహజమని దానిని పెద్ద సమస్యగా భావించొద్దనిల అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని పార్టీ నాయకులకు సూచించారు.
రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోరీ కార్యక్రమం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే నేషనల్ హెరాల్డ్ కేసుల పేరుతో కేంద్రం హడావుడి చేస్తుందన్నారు.సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై పెట్టిన అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తూ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.


