రబ్బర్‌వుడ్‌ రంగంలో థాయ్‌లాండ్‌ పెట్టుబడులు

Rubberwood Industry Will Be In Telangana Says KTR - Sakshi

రాష్ట్రంతో ఎంఓయూ చేసుకున్నథాయ్‌లాండ్‌.. కేటీఆర్‌ హర్షం

ఫర్నిచర్‌పార్కు ఏర్పాటు చేయాలని థాయ్‌ ఉపప్రధానికి విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రబ్బర్‌వుడ్‌ పరిశ్రమ రంగంలో థాయ్‌లాండ్‌ భారీ పెట్టుబడులు పెట్టనుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫర్నిచర్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి థాయ్‌లాండ్‌ ప్రభుత్వాన్ని కోరారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమ న్నారు. థాయ్‌లాండ్‌తో భారత్‌కు చాలా దగ్గరి సంబంధాలున్నాయని, రెండు దేశాల మధ్య వాణిజ్య రంగంలో మంచి అవకాశాలున్నాయన్నారు. తెలంగాణలో థాయ్‌లాండ్‌ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడం సంతోష కరమన్నారు.

మాదాపూర్‌లో శనివారం ఐటీసీ కోహినూర్‌ హోటల్‌లో జరిగిన ఇండియా–థాయ్‌లాండ్‌ బిజినెస్‌ మ్యాచింగ్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌ సెమినార్‌లో థాయ్‌లాండ్‌ ఉప ప్రధాని జురిన్‌ లక్సనావిసిత్‌తో కలసి మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి థాయ్‌ ప్రతినిధులకు వివరించారు. రబ్బర్‌వుడ్‌ పరిశ్రమలో థాయ్‌ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణతో పరస్పర అవగాహన ఒప్పందం చేసుకోవటం సంతోషంగా ఉందని కేటీఆర్‌ అన్నారు. థాయ్‌లాండ్‌ ఉప ప్రధాని భారత్‌ పర్యటన పెట్టుబడులకు ఊతం ఇచ్చేలా ఉందన్నారు.

రవాణా రాయితీ కల్పిస్తాం: మంత్రి కేటీఆర్‌ 
రబ్బర్‌ వుడ్, టింబర్‌ వుడ్‌ ఉత్పత్తుల రవాణా కోసం 400 కి.మీ దూరంలో కృష్ణపట్నం పోర్టు ఉందని, రవాణా సబ్సిడీలు కూడా థాయ్‌ కంపెనీలకు అందిస్తామని కేటీఆర్‌ వెల్లడించారు. దేశంలో తెలంగాణ యంగెస్ట్‌ స్టేట్‌ అని, దేశవృద్ధిరేటు కంటే ఎక్కువ అభివృద్ధిని రాష్ట్రం నమోదు చేసిందని తెలిపారు. సమాచారం, లైఫ్‌ సైన్సెస్‌ సహా ఇతరప్రముఖ రంగాలకు హైదరాబాద్‌ వేదికగా మారిం దన్నారు. తద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలను కల్పించ గలుగుతుందని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు ప్రకారం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో తెలంగాణ అత్యున్నత స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణ– థాయ్‌లాండ్‌ మధ్య వాణిజ్య పరంగా అపార అవకాశాలున్నాయన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూపొందించిన పథకాల వల్ల సరిపోయేంత సాగునీరు వ్యవసాయానికి అందటం వల్ల రాష్ట్రంలో పంటలు సమృద్ధిగా పండుతున్నాయని, తద్వారా ఆగ్రో బేస్డ్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో అనేక అవకాశాలు కలుగుతున్నాయని చెప్పారు.

బ్యాంకాక్‌–హైదరాబాద్‌ విమాన సర్వీసులు పెంచి పర్యాటకాన్ని అభివృద్ధి చెందేలా ప్రోత్సహించాలని కోరారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నియంత్రించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని, ఈ విషయంలో థాయ్‌లాండ్‌ సహకారంతో తీసుకుని ముందుకు వెళ్తామన్నారు. వివిధ రంగాల్లో ఇరువురం కలిసి పనిచేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ థాయ్‌లాండ్‌ ఉప ప్రధాని జరీన్‌ లక్సనావిత్‌ను శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. ఈ సెమినార్‌లో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌తో పాటు 30 మందితో కూడిన థాయ్‌ ప్రభుత్వ వాణిజ్య విభాగం ప్రతినిధుల బృందం పాల్గొంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top