సభకు వెళ్తూ.. మృత్యు ఒడికి..

Road Accident In Warangal - Sakshi

వరంగల్‌/చిల్పూరు: ప్రగతి నివేదన సభకు వెళ్తూ మార్గమధ్యలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం చిన్న పెండ్యాల గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.  వరంగల్‌ పోచమ్మమైదాన్‌కు చెందిన గానుపు భిక్షపతి(40) ఆదివారం 29వ డివిజన్‌ కార్పొరేటర్‌ యెలుగం లీలావతి సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రగతి నివేదన సభకు బయలుదేరి వెళ్లారు. ఈక్రమంలో స్టేషన్‌ఘనపూర్‌ మండలం చిన్న పెండ్యాల గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై  మూత్ర విసర్జన కోసం బస్సును నిలిపివేశారు.  మూత్ర విసర్జన చేసిన భిక్షపతి తిరిగి బస్సు ఎక్కే సమయంలో వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న మరో బస్సు ఢీకొట్టింది.

దీంతో త్రీవగాయాల పాలైన ఆయనను స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి మైరుగైన చికిత్స కోసం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్టానిక టీఆర్‌ఎస్‌ నాయకులు యెలుగం సత్యనారాయణ తెలిపారు. ఈవిషయాన్ని వెంటనే నగర మేయర్‌ నరేందర్‌కు తెలపడంతో ఆయన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల దృష్టికి తీసుకుపోగా భిక్షపతి కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించినట్లు తెలిపారు.

మార్చురీ వద్ద మృతుడి బంధువుల రోధనలు
కూలి చేసుకుని బతికేవాళ్లం. సభకు పోతే ఇండ్లు ఇస్తామంటే పోయాం. మీటింగ్‌కు పోతున్న క్రమంలో కాలకృత్యాల కోసం దిగి రోడ్డు దాటుతున్న క్రమంలో హైదరాబాద్‌ నుంచి వచ్చిన బస్సు ఢీ కొట్టింది. నాకెవరు దిక్కు అంటూ మృతుడి భిక్షపతి భార్య అనిత రోదించిన తీరు అందరిని కలిచివేసింది. రోడ్డు దాటుతున్న క్రమంలో హైదరాబాద్‌ నుంచి వచ్చిన బస్సు ఢీకొనడంతో భిక్షపతి అక్కడిక్కడే మృతిచెందాడని మృతుడి బంధువు సరోజన తెలిపింది.

రూ.10లక్షలు చెల్లించాలి..  
ప్రగతి నినేదన సభకు వెళ్లిన నిరుపేద భిక్షపతి కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కాంగ్రెస్‌ అర్బన్‌ పార్టీ అధికార ప్రతినిధి చిప్ప వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. సభ విజయవంతం కోసం ప్రజలను తీసుకెళ్లిన నాయకులు సరైన జాగ్రత్తలు తీసుకోనందునే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈకుటుంబాన్ని ఆదుకునేందుకు స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు బాధ్యత తీసుకోవాలన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top