కరోనా లక్షణాలున్న వారికి ఆర్‌ఎంపీలు చికిత్స | RMP Doctors Tretment Coronavirus Patients in Nagarkurnool | Sakshi
Sakshi News home page

కాసుల కోసం కక్కుర్తి!

Jul 16 2020 1:29 PM | Updated on Jul 16 2020 1:29 PM

RMP Doctors Tretment Coronavirus Patients in Nagarkurnool - Sakshi

శ్రీనగర్‌కాలనీలో వివరాలు సేకరిస్తున్న అధికారులు (ఫైల్‌)

  నాగర్‌కర్నూల్‌ క్రైం: కరోనా వైరస్‌ జిల్లా ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వైరస్‌ లక్షణాలు ఉన్న వారు తమ మధ్యనే తిరుగుతున్నారేమో అన్న భయం ప్రజలను వెంటాడుతోంది. సాధారణ దగ్గు, జలుబు , జ్వరం వచ్చిన వారి దగ్గరకు వెళ్లాంటేనే జంకుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని జిల్లాలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, కొందరు ఆర్‌ఎంపీలు కరోనా లక్షణాలున్న వారికి మలేరియా, టైఫాయిడ్‌తో పాటు ఇతరరోగాల బారిన పడ్డారంటూ చికిత్స చేస్తూ డబ్బులు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రోగులు వారి వద్ద కొన్నిరోజులు చికిత్స చేయించుకున్నా తగ్గకపోవడంతో పరీక్ష చేయించుకుంటే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంఘటనలు  అనేకం చోటు చేసుకుంటున్నాయి. ప్రథమ చికిత్సలు మాత్రమే చేయాలన్న కఠినమైన నిబంధనలను ఆర్‌ఎంపీలు లెక్కచేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు వారిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు  అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనలు ఇలా..
నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్‌ నియోజకవర్గాల్లోని గ్రామాలు, మండల కేంద్రాలు, పట్టణ కేంద్రాల్లోని ఆర్‌ఎంపిలు, ప్రైవేటు ఆసుపత్రులు కరోనా లక్షణాలున్న వారికి వైద్యం అందిస్తున్నారు.  
జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి కొద్దిరోజులుగా దగ్గు, జలుబు, జ్వరం , గొంతునొప్పి వంటి లక్షణాలతో భాదపడు తూ జిల్లాకేంద్రంలోని ఓ ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లాడు. అతడు టైఫా యిడ్‌ వచ్చిందటూ చికిత్స అందించినా తగ్గకపోవడంతో జిల్లా ఆసుపత్రిలో కరోనా పరీక్షకు శాంపిల్‌ ఇచ్చాడు. ఆదివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.  వైద్య ఆరోగ్యశాఖ అధికారులు భాదితుడిని వివరాలు సేకరించే క్రమంలో పదిరోజులు ఆర్‌ఎంపి వద్ద చికిత్స తీసుకున్నట్లు తెల్సింది.   
శనివారం వచ్చిన ఫలితాల్లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రాగా అతడు జిల్లా కేంద్రంలోని ఓ వైద్యుడితో చికిత్స చేయించుకున్నట్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వైద్యుడిని హోం క్వారంటైన్‌ చేశారు.  

కేసుల వివరాల్లో తేడాలు
జిల్లా ప్రజలు కరోనాకు సంబంధించి రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ  విడుదల చేస్తున్న హెల్త్‌ బుటిటెన్‌లను నిశితంగా గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న హెల్త్‌ బులిటెన్‌లో ఉన్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య, జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు మీడియాకు వెల్లడిస్తున్న కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్యల్లో భారీగా వ్యత్యాసాలు ఉండటంతో ప్రజలు అయోమయానికి గురిఅవుతున్నారు. కొద్దిరోజుల క్రితం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో 6పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వెల్లడించినా వాటికి సంబంధించి నేటివరకు జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం లేనట్లు తెల్సింది. గత ఆదివారం విడుదల చేసిన హెల్త్‌బులిటెన్‌లో 23పాజిటివ్‌ కేసులు చూపగా జిల్లా వైద్యశాఖ అధికారులు  13పాజిటివ్‌ కేసుల వివరాలు మాత్రమే వెల్లడించడం అయోమయానికి గురిచేస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement