తెలంగాణ ప్రభుత్వంలో పదవీ విరమణ చేసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగులకు పింఛన్ రావడం లేదు.
- ‘తెలంగాణ’లో రిటైరైన ఏపీ ఉద్యోగుల డైలమా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంలో పదవీ విరమణ చేసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగులకు పింఛన్ రావడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచడమే. ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వుల్లో భాగంగా కొంత మంది ఆంధ్రాకు చెందిన ఉద్యోగులు తెలంగాణకు వచ్చారు. అయితే తెలంగాణ ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును పెంచలేదు.
ఈ నేపధ్యంలో గత ఆరు నెలల కాలంలో తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగుల్లో 58 ఏళ్ల వయసు నిండిన వారు వందల సంఖ్యలో రిటైర్ అయ్యారు. వారికిప్పుడు పిం ఛన్ రావడం లేదు. ఉద్యోగుల తుది కేటాయింపులో ఏపీకి వెళితే.. అక్కడ మళ్లీ 60 ఏళ్లు వచ్చే వరకు ఉద్యోగం చేయవచ్చుననే అభిప్రాయంతో కొందరు ఉద్యోగులకు పింఛన్‌కు దరఖాస్తు చేయడం లేదు. మరి కొంత మంది పదవీ విరమణ చేసి పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వాలు మంజూరు చేయడం లేదు.
ఇందుకు కారణం ఉద్యోగుల తుది పంపిణీలో ఏ ఉద్యోగి ఏ రాష్ట్రానికి వస్తారో తెలియకపోవడమేనని అధికార వర్గాలు తెలిపాయి. ఒకసారి పింఛన్ తీసుకుంటే తుది పంపిణీలో ఆంధ్రాకు వెళ్లినా ఉద్యోగంలో తిరిగి చేర్చుకోరనే భావనతో కొందరు పింఛన్ తీసుకోవడం లేదు. అలా ఆంధ్రాకు కేటాయిస్తే ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవడమే కాకుండా అప్పటి వరకు పింఛన్ తీసుకోకుండా ఉంటే ఆ కాలానికి వేతనాలను చెల్లిస్తుందనే భావనలో పలువురు ఉద్యోగులున్నా రు.
కాగా, తెలంగాణ ఉద్యోగ సంఘాలన్నింటిలోని ఆఫీస్ బేరర్స్‌గా ఉన్న ఉద్యోగులను ప్రొవి జనల్‌గా తెలంగాణకు కేటాయించాల్సిందిగా టీ ఉద్యోగ సంఘాలు చేసిన వినతిని కమలనాథన్ కమిటీ తిరస్కరించింది. తెలంగాణ ఉద్యోగ సంఘాలు చాలా ఉన్నాయని, ఇందుకు అంగీకరిస్తే మరో వైపు నుంచి కూడా ఇలాంటి వినతులే వస్తాయని, ఈ నేపథ్యంలో ప్రొవిజనల్ ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులను జారీ చేయడం సాధ్యం కాదని కమలనాథన్ కమిటీ పేర్కొంది.