కాంగ్రెస్ " రే " వంతు | Revanth Reddy Emerged Leader in Telangana | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ " రే " వంతు

Nov 26 2018 3:48 PM | Updated on Nov 29 2018 12:23 PM

Revanth Reddy Emerged Leader in Telangana - Sakshi

తెలుగు రాష్ట్ర రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు రేవంత్‌ రెడ్డిది. అంతులేని ఆత్మవిశ్వాసానికి, మొక్కవోని పోరాట పటిమకు, మడమ తిప్పని పౌరుషానికి ఒక రూపం అంటూ ఇస్తే దాని పేరే రేవంత్‌ రెడ్డి. ఆయన మాటల్లో ఆత్మవిశ్వాసం తొనికిసలాడుతోంది. రాజకీయాలలో పోలికకు దొరకని నేపథ్యం అతనిది. తాను నిజమని నమ్మిన విషయాన్ని రుజువు చేయడానికి ఏ స్థాయిలోనైనా వెనుకాడరు. ఎంతటి వారితోనైనా పోరాడగల సామర్థ్యం అతనది. ఆయనలోని ఈ తత్వమే అతి తక్కువ రాజకీయ కాలంలోనే ఎన్నో వివాదాలను, కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది. వివాహమయ్యేంత వరకు చెప్పుకోదగ్గ రాజకీయ జీవితం ఏమిలేదు. అయితే ఒక ప్రజానాయకుడిగా ఎదగాలన్న కోరిక మాత్రం స్కూల్‌ రోజుల నుంచే ఉండేది. ఈ కారణాల చేత స్నేహితుల బృందాలను ఏర్పాటు చేసుకుని, వారి ద్వారా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని ప్రయత్నం చేస్తుండేవారు. ఆర్ట్స్‌లో పట్టభద్రుడైన తర్వాత తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. 

రాజకీయ ప్రవేశం
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌ రెడ్డితో బంధుత్వం ఉన్నా దానిని ఏనాడు వాడుకోలేదు. మొదట మిడ్జిల్‌ మండలంలో జెడ్‌పిటిసీకి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఆ రోజు  మండల నేత ఇంత తొందర్లోనే రాష్ట్రస్థాయి నేతగా ఎదుగుతారని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. ఏడాది తిరగక ముందే స్థానిక​ సంస్థల కోటాలో జరిగిన ఎన్నికలలో మళ్లీ ఇండిపెండెంట్‌గానే పోటీ చేసి, శాసనమండలిలో అడుగుపెట్టారు. అప్పటి అధికార పార్టీలో చేరే అవకాశం ఉన్నా ఆయన మాత్రం ప్రతిపక్షమైన టీడీపీలో చేరి 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్లారు.టీడీపీలో అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

ప్రధాన ఆరోపణలు 
కొడంగల్‌ నియోజకవర్గంలో నీళ్లు, రోడ్లు సరిగా లేకపోయిన రేవంత్‌ రెడ్డి పట్టించుకోడనే పేరుంది. ఆయన టీవీ ప్రచారానికి, వివాదాలకు ఇచ్చే ప్రాధాన్యత నియోజకవర్గ అభివృద్ధికి ఇవ్వడంటారు. ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉండి, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడనేదిమ ఆయన మీద ఉన్న ప్రధాన ఆరోపణ. ముందు మా నియోజకవర్గ సమస్యలు తీర్చి తర్వాత రాష్ట్ర సమస్యల గురించి ఆలోచించాలని వారు కోరుకుంటున్నారు.

పేరు : ఎనుముల రేవంత్‌రెడ్డి 
తల్లిదండ్రులు : నరసింహ్మరెడ్డి , రామచంద్రమ్మ
పుట్టిన తేదీ : నవంబర్‌ 8, 1969
ఊరు : కొండారెడ్డి పల్లి, వంగూరు(మండలం), నాగర్‌కర్నూల్‌ (జిల్లా)
నేపథ్యం : వ్యవసాయ కుటుంబం. ఆరుగురు అన్నదమ్ములు, ఒక సోదరి
కుటుంబం : మే 7,1992 గీతతో వివాహం, కూతురు నైమిష రెడ్డి
చదువు : డిగ్రీ లో బి ఎ, ఎ.వి.కాలేజ్‌, ఉస్మానియా యూనివర్శిటీ. ఎల్‌ఎల్‌బీ
వ్యాపారాలు, ఇతర కార్యకలాపాలు : రియల్‌ ఎస్టేట్‌, ప్రింటింగ్‌ ప్రెస్‌

రాజకీయ జీవితం
స్కూల్‌ రోజుల్లోనే స్టూడెంట్‌ యూనియన్‌ లో పనిచేసేవారు.
కాలేజీలో ఎబీవీపీ తరపున పనిచేసేవారు. 
2006 - స్వతంత్ర అభ్యర్థిగా మిడ్జిల్‌ మండలం నుంచి జెడ్‌పిటీసీ గా ఎన్నికయ్యారు.
2007-09 -  స్వతంత్ర అభ్యర్థిగా స్థానిక సంస్థల కోటాలో ఎమ్యెల్సీ గా ఎన్నికయ్యారు.
2008 - టీడీపీలో చేరిక
2009 - కొడంగల్‌లో రాజకీయాలలో 6సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఉన్న గురునాథ్‌రెడ్డి పై ఎమ్మెల్యేగా పోటీ చేసిన మొదటిసారే గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు.
2014 -  గురునాథ్‌రెడ్డి పై మరోసారి విజయదుందుభి మోగించారు.
అక్టోబర్‌ 25, 2017 - తన అనుచరులతో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.
సెప్టెంబర్‌ 20,2018 - టీ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియామకం

ఇతర పదవులు
టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా చేశారు.
తెలుగునాడు విద్యుత్‌ కార్మిక సంఘం ప్రెసిడెంట్‌
టీటీడీపీ ప్లోర్‌ లీడర్‌
జాతీయ హకీ ఫెడరేషన్‌(ఐహెచ్‌ఎఫ్‌), వైస్‌ ప్రెసిడెంట్‌
జాతీయ హకీ ఫెడరేషన్‌(ఐహెచ్‌ఎఫ్‌), ప్రెసిడెంట్‌

కేసులు : మే 31,2015 లో ఓటుకు నోటు కేసు, కేసీఆర్‌పై ఆరోపణల కేసును కలుపుకుని మొత్తం 36 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఆస్తులు : రూ.1,74,97,421 స్థిర ఆస్తులు, రూ.2,02,69,000 చర ఆస్తులు
ఆయన భార్య పేరుపై 9.44,64,000 కోట్లు (మార్కెట్‌ విలువ)

- విష్ణువర్ధన్ రెడ్డి.మల్లెల (ఎస్ ఎస్ జె)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement