ప్రాజెక్టుపై కోటి ఆశలు

Reservoir Works Is Completely In Adilabad - Sakshi

ఇచ్చోడ(బోథ్‌): జిల్లాలోని భీంపూర్‌ మండలం పిప్పల్‌కోటి వద్ద నిర్మించనున్న రిజర్వాయర్‌ నిర్మాణ టెండర్‌ పూర్తయింది. 1.423 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్న రిజర్వాయర్‌కు అవసరమైన బండ్‌( కట్ట)కోసం అధికారులు రెండువందల ఎకరాల భూమిని ఇప్పటికే సమీకరించారు. గతేడాది జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్‌ పిప్పల్‌కోటి వద్ద రూ.368 కోట్లతో రిజర్వాయర్‌ నిర్మించనున్నట్లు ప్రకటించారు. అప్పటినుంచి రిజర్వాయర్‌పై ఇక్కడిప్రాంత రైతులు ఆశలు పెట్టుకున్నారు. చెప్పిన వెంటనే సీఎం కేసీఆర్‌ పిప్పల్‌కోటి రిజర్వాయర్‌కోసం కేబినెట్‌లో ఆమోద ముద్రవేశారు. దీంతో రిజర్వా యర్‌ నిర్మాణంపై పూర్తిగా స్పష్టత వచ్చింది. దీంతో సంబంధిత అధికారులు రిజర్వాయర్‌ నిర్మాణంకోసం కసరత్తు ప్రారంభించారు. రిజర్వాయర్‌ జిల్లాకే తలమానికంకానుంది.

పూర్తయిన భూసేకరణ
బండ్‌(కట్ట) నిర్మాణంకోసం రెండు వందల ఎకరాల భూసేకరణను రెవెన్యూ అధికారులు పూర్తి చేశారు. పనులు త్వరలో ప్రారంభించడానికి నీటిపారుదలశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ట్యాంకు నిర్మాణం, నీటి నిల్వకోసం మరో 8 వందల ఎకరాల వరకు భూసేకరణ జరగాల్సి ఉందని ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. కట్ట నిర్మాణం ప్రారంభం జరుగుతుండగానే వీలైనంత త్వరగా కావాల్సిన 8 వందల ఎకరాల భూమిని అధికారులు సమీకరించనున్నారు.

సహజ నీటి ప్రవాహం లేని పిప్పల్‌కోటి
పిప్పల్‌కోటికి సహజ నీటి ప్రవాహం లేదు. కాని లోయర్‌ పెన్‌గంగ కెనాల్‌ ద్వారా ఖరీఫ్‌లో 37వేల 5 వందల ఎకరాలకు నీళ్లదించే పరిస్థితి ఉంటుంది. రబీ సమయం వచ్చేసరికి ఈకెనాల్‌ ద్వారా నీరు అందించే పరిస్థితి ఉండకపోవడంతో, ఆ సమయంలో పిప్పల్‌కోటి రిజర్వాయర్‌ ద్వారా నీళ్లు అందించడానికే ఈ రిజర్వాయర్‌ ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో వృథాగాపోతున్న నీటిని పిప్పల్‌కోటి రిజ్వరాయర్‌లో నింపి ఉంచి రబీలో రైతులకు రిజర్వాయర్‌ ద్వారా నీటి ని ఇవ్వడానికి వీలు పడుతుంది. ఈ రిజర్వాయర్‌ నుంచి లోయర్‌ పెన్‌గంగ ప్రాజెక్టు కెనాల్‌కు అనుసంధానం చేసి  రిజర్వాయర్‌ నీటిని లోయర్‌ పెన్‌గంగ కెనాల్‌ నుంచి దాదాపుగా 37 వేల 5 వందల సాగు నీటిని అందించడానికి అనువుగా డిజైన్‌ చేస్తున్నారు. దీంతో వర్షాకాలంలో పెన్‌గంగ నీరు వృథాపోకుండా రెండోపంటకు రైతులకు నీరు అందించడానికి రిజర్వాయర్‌ పూర్తిస్థాయిలో ఉపయోగపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

51 వేయి ఎకరాలకు సాగునీరు
పిప్పల్‌ కోటి రిజర్వాయర్‌ ద్వారా ఆదిలాబాద్, బోథ్‌ నియోజకవర్గంలో 51 వేయి ఎకరాలకు సాగు నీరు అందనుంది. లోయర్‌ పెన్‌గంగ కాలువ కింద  ఆదిలాబాద్‌ నియోజకవర్గంలోని బేల, జైన«థ్, ఆదిలాబాద్‌ మండలాల్లో 37 ,500 ఎకరాలకు, బోథ్‌ నియోజకవర్గంలోని ఎత్తిపోతల ద్వారా భీంపూర్, తాంసి మండలాల్లో మరో 13,500 ఎకరాలలో సాగు నీరు అందడానికి అవకాశం ఉంది. రెండు నియోజకవర్గాల్లో ఐదు మండలాల్లో 51 వేయి ఎకరాలకు సాగు నీరు అందేలా రిజర్వాయర్‌కు అధికారులు డిజైన్‌ చేస్తున్నారు.
 
రూ.368 కోట్లకు ప్రభుత్వం ఆమోదం

తెలంగాణ ప్రభుత్వం పిప్పట్‌కోటి రిజర్వాయర్‌ నిర్మాణంకోసం రూ.368 కోట్లకు ఆమోదం తెలిపింది. రూ.273 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ అయింది. 11–09–2018 సంబంధిత అధికారులు టెండర్లు పూర్తి చేశారు. కాంట్రాక్టర్‌ అగ్రిమెంట్‌ కూడా పూర్తికావడంతో ఇక పనులు ప్రారంభం కావడమే తరువాయి.

పూర్తయిన అగ్రిమెంట్‌
పిప్పల్‌కోటి రిజర్వాయర్‌ నిర్మాణంకోసం రూ.368 కోట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని లోయర్‌ పెన్‌గంగ ప్రాజెక్టు డివిజన్‌ ఆధికారి రవీందర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. 2018 సెప్టెం బర్‌లో రూ.273 కోట్లకు టెండర్లు వేశాం. సంబంధిత కాంట్రాక్టర్‌ అగ్రిమెంట్‌ కూడా పూర్తి చేసుకున్నారు. కట్టకు సంబంధించిన రెండువందల ఎకరాల భూసేకరణ కూడా పూర్తయింది. నీటి నిల్వకోసం మరో 8 వందల ఎకరాల భూ సర్వే చేయాల్సి ఉంది. ఈ  రిజర్వాయర్‌ నిర్మాణంతో ఇక్కడి ప్రాంతంలో సాగునీటితోపాటు తాగునీరు, భూగర్భజలాలు పెరిగి భవిష్యత్‌లో ఇక్కడి ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది.  

రిజర్వాయర్‌ భూములను పరిశీలించిన ఆర్డీవో

తాంసి: భీంపూర్‌ మండలం పిప్పల్‌కోటి వద్ద రూ.810 కోట్లతో నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్‌కు సంబంధించిన భూములను ఆర్డీవో సూర్యనారాయణ పరిశీలించారు. ముంపునకు గురయ్యే భూముల సర్వేను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్‌ నిర్మాణంతో ముంపునకు గురయ్యే భూములు పరిశీలించి సర్వే నంబర్లు తెలుసుకుని రైతులతో మాట్లాడారు. ముంపునకు భూములు గురయ్యే రైతులతో ఆర్డీవో మాట్లాడుతూ రిజర్వాయర్‌కు భూములు ఇచ్చే రైతులకు సరైన పరిహారం అందించేలా జిల్లా యంత్రాంగానికి వివరిస్తామని హామీఇచ్చారు. ఆర్డీవో వెంట కార్యక్రమంలో ఆర్‌ఐ నూర్‌సింగ్, ల్యాండ్‌ ఎమ్‌సీ శ్రీనివాస్, పిప్పల్‌కొటి గ్రామరైతులు లస్మన్న, గంగయ్య, సంతోష్, రమణారెడ్డి రైతులు ఉన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top