వ్యవసాయ శాఖలో 1,446 పోస్టుల భర్తీ | Replacement of 1,446 posts in the Department of Agriculture department | Sakshi
Sakshi News home page

వ్యవసాయ శాఖలో 1,446 పోస్టుల భర్తీ

Oct 31 2017 2:37 AM | Updated on Jun 4 2019 5:04 PM

Replacement of 1,446 posts in the Department of Agriculture department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు వ్యవసాయ శాఖలో 1,446 పోస్టులను భర్తీ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు పుట్టా మధుకర్, అల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, ఆరూరి రమేశ్‌లు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. తమ శాఖలో ఇప్పటివరకు 1,311 మంది వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో), 114 వ్యవసాయాధికారులు, 18 జూనియర్‌ అసిస్టెంట్లు, మూడు టైపిస్టు పోస్టులను భర్తీ చేశామన్నారు. అలాగే నాలుగు వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలు, ఒక ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలను ఏర్పాటు చేశామన్నారు.
 
4 ఔటర్‌ రింగ్‌రోడ్లు: మంత్రి తుమ్మల 
సభ్యులు శ్రీనివాస్‌గౌడ్, ఆరూరి రమేశ్, పువ్వాడ అజయ్‌కుమార్‌లు ఔటర్‌ రింగ్‌రోడ్లకు సంబంధించి అడిగిన ప్రశ్నలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బదులిచ్చారు. గజ్వేల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్‌లకు ప్రభుత్వం ఔటర్‌ రింగ్‌రోడ్లను మంజూరు చేసిందన్నారు. సూర్యాపేటృ అశ్వారావుపేట, కోదాడృమహబూబాబాద్‌లకు జాతీయ రహదారి మంజూరైందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ రోడ్లకు ఏదో ఒకవైపు కాకుండా రెండు వైపులా భూమిని సేకరించాలన్నారు. ఓవర్‌సీస్‌ విద్యానిధి పథకం కింద రాష్ట్రంలో 496 మంది విద్యార్థులు ప్రయోజనం పొందారని ఇంధన, షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.  

81.32 కోట్ల మొక్కలు నాటాం: జోగు రామన్న  
హరితహారం కింద ఇప్పటివరకు రాష్ట్రంలో 81.32 కోట్ల మొక్కలు నాటినట్లు అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. సభ్యులు మనోహర్‌రెడ్డి, రవీంద్రకుమార్, గువ్వల బాలరాజు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. నాటిన మొక్కల మనుగడను పర్యవేక్షించేందుకు జియో రిఫరెన్సింగ్‌ నిమిత్తం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామన్నారు. చెక్‌డ్యాంలపై సభ్యులు చల్లా ధర్మారెడ్డి, దుర్గం చిన్నయ్య, పుట్టా మధుకర్‌లు అడిగిన ప్రశ్నలకు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమాధానమిచ్చారు. వివిధ గ్రాంట్ల కింద రాష్ట్రంలో రూ. 273.60 కోట్లతో 105 చెక్‌డ్యాంలను, వంతెనల నిర్మాణం చేపట్టామన్నారు. అందులో 24 పూర్తయ్యాయన్నారు.  

పాత పెన్షన్‌ స్కీమ్‌నే వర్తింపజేయాలి
1.20 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించి పాత పెన్షన్‌ స్కీమ్‌నే వర్తింప చేయాలని టీడీపీ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. దీనిపై సీఎం పునరాలోచన చేయాలన్నారు. సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య మాట్లాడుతూ ఇటీవల భారీ వర్షాలకు రాష్ట్రంలో 30 లక్షల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నదన్నారు. 10 లక్షల ఎకరాలకు ఎర్ర తెగులు సోకిందన్నారు. దీంతో అటువంటి పత్తికి ధర రావడంలేదన్నారు. పత్తికి రూ. 8 వేలు ధర చెల్లించాలని ఆయన కోరారు. పూర్వ మహబూబ్‌నగర్‌ జిల్లాలో మాదాని కురువ, మాదారి కురువలకు ఎస్సీ సర్టిఫికెట్‌ ఇవ్వడంలేదని సభ్యుడు చిన్నారెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవలి వర్షాలకు పత్తిలోని విత్తనాలు మొలకెత్తాయని టీఆర్‌ఎస్‌ సభ్యుడు అంజయ్య యాదవ్‌ పేర్కొన్నారు. దీంతో దళారులు తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పత్తికి బోనస్‌ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.  

పూరిగుడిసెకు లక్ష కరెంటు బిల్లా?
జహీరాబాద్‌ నియోజకవర్గంలోని దిడిగి గ్రామంలో ఒక వ్యక్తికి చెందిన పూరి గుడిసెకు ఏకంగా రూ.1.05 లక్షల కరెంటు బిల్లు రావడాన్ని జీరో అవర్‌లో కాంగ్రెస్‌ సభ్యురాలు గీతారెడ్డి లేవనెత్తారు. అధికారుల నిర్వాకంపై ఆమె మండిపడ్డారు. బిల్లు కట్టకపోతే చర్యలు తీసుకుంటామని అక్కడి బిల్‌ కలెక్టర్‌ హెచ్చరించడం శోచనీయమని చెప్పారు. దీంతో ఆ కుటుంబ యజమాని చనిపోయాడన్నారు. అయినా ఇప్పటికీ ఎవరూ స్పందించలేదని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా అదే గ్రామంలో రూ. 95 వేలు, రూ. 65 వేలు కరెంటు బిల్లులు వచ్చినవారున్నారని తెలిపారు. దీనికి మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ పూర్తి పరిశీలన చేసి ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement