మిస్టరీ వీడని రేణుక అదృశ్యం

Renuka Disappears Case Going Mystery In Nizamabad - Sakshi

కాకతీయ కాలువలో గల్లంతై రెండు నెలలు 

దొరకని యువతి ఆచూకీ 

నిరంతరం నీటి ప్రవాహమే కారణం 

ప్రయత్నిస్తున్నామంటున్న పోలీసులు 

సాక్షి,మోర్తాడ్‌: ఏర్గట్ల శివారులోని కాకతీయ కాలువలో పడి గల్లంతైన వివాహిత యువతి రేణుక ఆచూకీ రెండు నెలలైనా ఇంకా దొరకలేదు. దీంతో రేణుక అదృశ్యం కేసు మిస్టరీ వీడకుండా ఉంది. అక్టోబర్‌ మొదటి వారంలో ఇబ్రహీంపట్నంలోని తన తల్లిగారి ఇంటి నుంచి బాల్కొండలోని తన అత్తగారింటికి భర్త మారుతితో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మార్గమధ్యలో రేణుక కాకతీయ కాలువలోకి దూకిందని మారుతి పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు చేశాడు.

అయితే కాకతీయ కాలువలో గజ ఈతగాళ్లతో పలు చోట్ల వెతికించినా అప్పట్లో రేణుక ఆచూకీ లభించలేదు. రేణుకకు సంబంధించి ఎలాంటి దుస్తులు, నగలు దొరకకపోవడంతో ఆమె ఏమి అయి ఉంటుందో పోలీసులకు అంతు చిక్కడం లేదు. రేణుకకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఆమె సజీవంగా ఉందా లేదా అని ఒక నిర్దారణకు రాలేక పోతున్నామని పోలీసులు చెబుతున్నారు. రేణుక అదృశ్యం మిస్టరీగానే పోలీసులు పరిగణిస్తున్నారు. అయితే తమ కూతురు కాలువలోకి దూకి ఉండదని ఆమె భర్త మారుతి తోసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తూ రేణుక తల్లి పోలీసుల ఎదుట ఆరోపించింది.

అయితే రేణుక అదృశ్యం అయిన నుంచి కాకతీయ కాలువ నిండుగా ప్రవహిస్తుండటంతో ఎలాంటి ఆధారం దొరకడానికి అవకాశం లభించలేదు. రేణుక భర్త మాత్రం ఆమె తనతో గొడవ పడి కాలువలోకి దూకిందని చెబుతున్నాడు. రేణుకకు సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరికితే తప్ప ఎలాంటి వివరాలు తాము వెల్లడించలేమని ఏర్గట్ల ఎస్‌ఐ హరిప్రసాద్‌ ‘సాక్షి’కి వివరించారు. ఏది ఏమైనా వివాహిత యువతి కాకతీయ కాలువలో గల్లంతై రెండు నెలలు గడచినా ఇంత వరకు ఆచూకీ లభించకపోవడంతో అదృశ్యం కేసు మిస్టరీగానే ఉండిపోయిందని చెప్పవచ్చు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top