దిగువ మానేరుకు ఎగువ నీరు

Release of 40 thousand cusecs of water from Madhya Maneru - Sakshi

మధ్యమానేరు నుంచి 40 వేల క్యూసెక్కుల నీరు విడుదల

దిగువ మానేరులో సుమారు 6 టీఎంసీలకు చేరుతున్న నీరు

లక్ష్మీపూర్‌ పంపుహౌస్‌ నుంచి మరో పంపు ప్రారంభం

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: మధ్యమానేరు (రాజరాజేశ్వర ప్రాజెక్టు) నుంచి సుమారు 40 వేల క్యూసెక్కుల నీటిని కరీంనగర్‌లోని లోయర్‌ మానేరు డ్యాంకు వదిలారు. శుక్రవారం రాత్రి ఈఎన్‌సీ అనిల్‌కుమార్, రాజన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్‌ హెగ్డేతో కలసి నీటిని విడుదల చేశారు. భారీగా వస్తున్న నీటితో లోయర్‌ మానేరు జలాశయం కళకళలాడుతోంది. నీటిని విడుదల చేసే సమయంలో కందికట్కూరు గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో కొంత ఆలస్యమైంది.

గ్రామస్తులను ఒప్పించి నీటిని విడుదల చేశారు. అధికారులు సాయంత్రం వరకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రి 10 గంటలకు మిడ్‌మానేరు నుంచి అకస్మాత్తుగా నీటిని విడుదల చేయడంతో ఇల్లంతకుంట, గన్నేరువరం మండలాల్లోని కందికట్కూరు, పొత్తూరు, చొక్కారావుపల్లి గ్రామాల్లో కాపరులకు చెందిన 240 గొర్రెలు వరదలో కొట్టుకుపోయాయి. ఇల్లంతకుంట మండలం కందికట్కూరులో 13 మంది గొర్రెల కాపర్లు కూడా వరద ఉధృతిలో చిక్కుకున్నారు. పలు ద్విచక్రవాహనాలు కూడా నీటిలో కొట్టుకుపోయాయి. అయితే పలువురు కాపర్లు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. పోలీసులు మిగతా వారిని రక్షించారు. ఎగువ నుంచి వస్తున్న వరదనీటితో లోయర్‌ మానేరులో నీటిమట్టం ఒక్కరోజులోనే 3.7 టీఎంసీల నుంచి 6 టీఎంసీలకు చేరుకుంది.

బాహుబలి నాలుగో పంపు నుంచి కూడా
మధ్యమానేరు నుంచి లోయర్‌ మానేరుకు నీటి విడుదల నేపథ్యంలో తగ్గిపోయిన జలాన్ని నింపేందుకు లక్ష్మీపూర్‌ పంప్‌హౌస్‌లోని బాహుబలి నాలుగో మోటారును అధికారులు రాత్రి ప్రారంభించారు. ఏడు మోటార్లు ఉన్న ఈ పంప్‌హౌస్‌లో ప్రస్తుతం 5, 4, 1వ మోటార్లు నిరంతరాయంగా పనిచేస్తూ, ఎల్లంపల్లి నుంచి వచ్చిన నీటిని మధ్య మానేరుకు ఎత్తిపోస్తున్నాయి. శనివారం రాత్రి రెండవ నంబర్‌ మోటారును అధికారులు ఆన్‌ చేశారు. దీంతో మరో మూడు వేల క్యూసెక్కుల నీరు మధ్యమానేరుకు తరలివెళ్లనుంది. ప్రస్తుతం మూడు పంపుల ద్వారా 9 వేల నుంచి 10 వేల క్యూసెక్కుల నీరు తోడేస్తున్నారు.

ఎల్‌ఎండీకి జలకళ 
వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు పూర్తయినా డెడ్‌ స్టోరేజీలోనే ఉన్న లోయర్‌ మానేరుడ్యాం (ఎల్‌ఎండీ)కు జలకళ సంతరిం చుకుంది. మొదటిసారి కాళేశ్వరం జలాలు కరీంనగర్‌కు రావడంతో నగరవాసులు ఆనందం వ్యక్తం చేశారు. శనివారం కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డ్యాంలోని గంగమ్మ దేవాలయం వద్ద జలహారతి నిర్వహించారు. కేసీఆర్‌ నిలువెత్తు కటౌట్లకు జలాభిషేకం చేసి ప్రజాప్రతినిధులు నెత్తిన జలాలు చల్లుకుంటూ పులకించిపోయారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top