‘గురుకులం’లో రోజూ థర్మల్‌ స్క్రీనింగ్‌ 

Regular Thermal Screening In Tenth class students - Sakshi

పరీక్షల నేపథ్యంలో పాఠశాలలకు చేరుకున్న పదో తరగతి విద్యార్థులు 

అవసరమైన విద్యార్థులకు వైద్య పరీక్షలు 

ప్రతి పాఠశాల నుంచి పరీక్షా కేంద్రానికి ఆర్టీసీ బస్సు ఏర్పాటు 

సాక్షి, హైదరాబాద్‌: టెన్త్‌ పరీక్షలు తిరిగి ప్రారంభంకా నుండటంతో విద్యార్థుల పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తల పై గురుకుల సొసైటీలు సన్నద్ధమవుతున్నాయి. విద్యార్థులకు వసతి, పరీక్షా కేంద్రాల వరకు రవాణా సౌకర్యం లాంటి ఏర్పాట్లు పక్కాగా చేసేందుకు ఉపక్రమించాయి. రాష్ట్రవ్యాప్తంగా 900  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్‌ గురుకుల పాఠశాలల నుంచి దాదాపు 50 వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే తెలుగు పేపర్‌–1, 2, హిందీ పరీక్షలు ముగియగా... కరోనా నేపథ్యంలో మిగతా పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. తిరిగి ఈ నెల 8 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీంతో గురుకుల విద్యార్థులను వారం ముందే పాఠశాలలకు చేరుకోవాలని అధికారులు ఆదేశించారు. సోమవారం నాటికి 90 శాతం మంది విద్యార్థులు చేరుకున్నారు.

అనుక్షణం అప్రమత్తం: ఇప్పటికే అన్ని పాఠశాలలను సోడియం హైపోక్లోరైడ్‌తో మూడుసార్లు శానిటైజ్‌ చేశారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థికి వ్యక్తిగత శానిటైజర్, సబ్బు, మాస్కులు అందిస్తున్నారు. భౌతిక దూరం పాటించేలా సూచనలు చేస్తున్నారు. పరీక్షల నేపథ్యంలో గురుకుల పాఠశాలల సిబ్బంది మే 28 నుంచే విధులకు హాజరువుతున్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా భౌతిక దూరంపాటించేలా బెడ్లు ఏర్పాటు చేయడంతో పాటు స్టడీ హాలులో కుర్చీలను ఏర్పాటు చేశారు. వంట సిబ్బందికి ప్రత్యేకంగా డ్రెస్‌కోడ్‌ పాటిస్తూ గ్లౌజులు, మాస్కులు ధరించి వంట వడ్డించేలా సూచనలు చేశారు. ప్రతి విద్యార్థికి రోజూ థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేస్తారు. దీనికోసంప్రతి స్కూల్‌కు ఒక ధర్మల్‌ స్క్రీనింగ్‌ యంత్రాన్ని పంపిణీ చేశారు. శరీర ఉష్ణోగ్రతల్లో తేడాలుంటే వెంటనే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి గురుకుల పాఠశాలలో ఒక హెల్త్‌ అసిస్టెంట్‌ను ఏర్పాటు చేసిన సొసైటీ అధికారులు... 24గంటలు అక్కడే అందుబాటులో ఉండాలని ఆదేశించారు.  

రోగనిరోధక శక్తి పెరిగేలా ఆహారం.. 
టెన్త్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల పట్ల అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రతి పాఠశాల ప్రిన్సిపాల్, బోధన, బోధనేతర సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్టు బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు తెలిపారు. పోషకాహారాన్ని అందించే లా డైట్‌ చార్ట్‌ను మార్చామని, రోగ నిరోధకశక్తి పెరిగే ఆహార పదార్థాలు ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top