
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదకు తోడు ఉజ్జయిని, తుంగభద్రల నుంచి కొనసాగుతున్న ప్రవాహాలతో ప్రాజెక్టులోకి 5.40లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టులోకి ఏకంగా 1,538 టీఎంసీలకు పైగా వరద రావడంగమనార్హం. గడిచిన 35ఏళ్లలో కేవలం ఏడుసార్లు మాత్రమే శ్రీశైలానికి 1,500 టీఎంసీలకు పైగా వరద వచ్చింది. చివరి సారిగా 2007–08లో 1,695 టీఎంసీల మేర వరద రాగా, మొత్తంగా 1994–95లో అధికంగా 2,039 టీఎంసీల మేర వరద వచ్చింది. ప్రస్తుతం ఎగువ ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి స్థిరంగా వరద కొనసాగుతుండటంతో శ్రీశైలానికి మరో పదిరోజుల పాటు వరద కొనసాగే అవకాశాలున్నాయని కేంద్ర జల సంఘం అంచనా వేస్తోంది. ఇక సాగర్‌లోకి ఉధృతంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టులోకి 4.93లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు ఇప్పటికే నిండి ఉండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. ప్రాజెక్టులోకి ఇప్పటికే 1,000 టీఎంసీలకు పైగా వరద రావడం గమనార్హం.
ఎల్లంపల్లికి భారీ వరద: ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. స్థానికంగా కురుస్తున్న వర్షాలతో శుక్రవారం ఏకంగా 1.84లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది.