రెండేళ్లలో కొత్త రైళ్లు..

Railway GM Gajanan Mallya: New Trains Will Introduce In Adilabad - Sakshi

రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వకనే నిలిచిన పనులు

ఎలక్ట్రికల్‌ లైన్‌ సర్వే పనులకు టెండర్లు

రైల్వే జీఎం గజానన్‌ మాల్యా

సాక్షి, ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌లో రైల్వే అభివృద్ధికి కృషి చేస్తానని, రెండేళ్లలో కొత్త రైళ్లు వేస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్‌ రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. పలు అభివృద్ధి పనులతోపాటు కొత్తగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ భద్రతపైనే ప్రధాన దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. రైల్వే ఇంజిన్‌ కండీషన్, కొత్త రైళ్ల పొడిగింపు, రైల్వేస్టేషన్‌లో సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రయాణికుల డిమాండ్‌ మేరకు ప్రభుత్వానికి బడ్జెట్‌ కోసం నివేదికను పంపించామని, నిధులు విడుదలైతే రెండేళ్లలో కొత్త రైళ్లతోపాటు ఆయా పనులు చేపడుతామన్నారు. కలకత్తా, బెంగళూరు, తిరుపతి, తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి రైళ్ల రాకపోకలు సాగించాలని ప్రయాణికుల నుంచి విజ్ఞప్తి ఉందని తెలిపారు. ఎలక్ట్రిసిటీ రైళ్ల కోసం టెండర్‌ పనులు ప్రారంభించామని, త్వరలోనే టెండర్లు పూర్తయితే పనులు ప్రారంభిస్తామన్నారు.

గతంలో మీటర్‌గేజ్‌ రైలు, ప్రస్తుతం బ్రాడ్‌గేజ్‌ రైళ్లు నడుస్తున్నాయని, ప్రయాణికుల సౌకర్యార్థం మరింత నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నామని చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి నాందేడ్‌ వరకు వచ్చే రైళ్లను ఆదిలాబాద్‌ వరకు పొడిగించాలని పలువురు విన్నవించారని, ఈ విషయంపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పిప్పల్‌కోటి, ముత్‌ఖేడ్‌ ఎలక్ట్రేషన్‌ పనులు పూర్తయ్యాయని, వచ్చే ఏడాది డబ్లింగ్‌ పనులు మొదలు పెడుతున్నట్లు తెలిపారు. చిల్ర్డన్‌ పార్క్, సోలార్‌ ప్లాంట్, టీటీఈ రెస్ట్‌రూమ్‌లను ప్రారంభించారు. రైల్వే క్వార్టర్స్‌ను పరిశీలించి అక్కడ ఉంటున్న వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రహరీ పనులను పరిశీలించారు. రోడ్డు సౌకర్యం, బోరు వేయించాలని అందులో ఉంటున్న వారు విన్నవించడంతో సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా రైల్వేస్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటి వాటికి నీరు పోశారు.

రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకనే ఆటంకాలు 
రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతోనే రైల్వే పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా అన్నారు. ప్లైఓవర్, అండర్‌బ్రిడ్జి కోసం రూ.78 కోట్లు అవసరం ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం చెల్లించాల్సి ఉంటుందని, నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పనులు చేపట్టడం లేదన్నారు. అలాగే ఆదిలాబాద్‌–ఆర్మూర్‌ రైల్వే లైన్‌ జాయింట్‌ వెంచర్‌కు సంబంధించిందని, ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. ఈ విషయమై పలుసార్లు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కలిశామని, మరోసారి కలిసి ఈ పనుల విషయమై చర్చిస్తామన్నారు. 

వినతుల వెల్లువ..
జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌కు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యాకు పలువురు వినతులు సమర్పించారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న రైల్వే జీఎంను కలిసి పెండింగ్‌లో ఉన్న పనులను పరిష్కరించాలని విన్నవించారు. చిల్ర్డన్‌ పార్కు, సోలార్‌ విద్యుత్, రైల్వే సిబ్బంది క్వార్టర్‌ను పరిశీలించారు. ఇతర ప్రాంతాల నుంచి నాందేడ్‌కు వచ్చే వివిధ రైళ్లను ఆదిలాబాద్‌ వరకు పొడిగించాలని కోరారు. ఆయన వెంట జెడ్పీ వైస్‌చైర్మన్‌ రాజన్న, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రహ్లాద్, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్, సీపీఎం జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి, జిల్లా నాయకులు విలాస్, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశ్, రాష్ట్ర నాయకులు బండి దత్తాత్రితోపాటు పలువురు రైల్వే జీఎంను కలిసి వినతిపత్రాలు అందజేశారు. రైల్వేఓవర్, అండర్‌బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టాలని, ఆదిలాబాద్‌–ఆర్మూర్‌ రైల్వేలైన్‌ పనులను చేపట్టాలని కోరారు. ఆదిలాబాద్‌–ఢిల్లీ రైలు వేయాలని, ఆదిలాబాద్‌–ముత్‌ఖేడ్‌ వరకు డబుల్‌ రైల్వే లైన్‌ పనులు చేపట్టాలని, నిజామాబాద్‌ వరకు వస్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్, రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆదిలాబాద్‌ వరకు పొడిగించాలని, ఆదిలాబాద్‌–హైదరాబాద్‌ వరకు ఉద యం పూట రైలు నడిపించాలని, ఆదిలాబాద్‌–నాగ్‌పూర్‌ రైలు సాయంత్రం వేళల్లో నడిపించాలని విన్నవించారు. కృష్ణ ఎక్స్‌ప్రెస్‌లో రెండు స్వీపర్‌ బోగీలను  పెంచాలని కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top