రబీ సాగు అంచనా 1,86,025 | Rabi cultivation is estimated 1,86,025 | Sakshi
Sakshi News home page

రబీ సాగు అంచనా 1,86,025

Oct 9 2014 3:50 AM | Updated on Sep 2 2017 2:32 PM

రబీ సీజన్ ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 1,92,632 హెక్టార్లు ఉండగా... రైతులు 1,86,025 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తారని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.

వరంగల్ : రబీ సీజన్ ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 1,92,632 హెక్టార్లు ఉండగా... రైతులు 1,86,025 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తారని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఈ సీజన్‌కు అవసరమైన సబ్సిడీ విత్తనాలు, ఎరువుల అవసరాన్ని ప్రణాళికలో పొందుపరిచారు. ఏపీ సీడ్స్ ద్వారా సబ్సిడీ విత్తనాలు అందించేందుకు చర్యలు చేపట్టారు.

ఖరీఫ్ ప్రారంభంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో పంటల సాగు ఆలస్యమైంది. ఈ పంటలు చేతికొచ్చే సరికి ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ... రబీలోనైనా కాలం కలిసివస్తుందేమోనని ఆశతో రైతులు ఉన్నారు. అదేవిధంగా ఖరీఫ్ సాగు చేయని రైతులు రబీ సాగుకు ముందస్తుగా సిద్ధమవుతున్నారు. ఖరీఫ్‌లో వర్షాలు సానుకూలంగా కురవనందున వరి సాగు బాగా తగ్గింది.

ఈ రబీలోనైనా వరి సాగు చేపట్టాలని మధ్య తరహా నీటి ప్రాజెక్ట్‌ల పరిధిలోని ఆయకట్టు రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల వరుసగా కురిసిన వర్షాల వల్ల జిల్లాలోని పాకాల, లక్నవరం, రామప్ప, గణపసముద్రం చెరువుల్లోకి నీరు చేరింది. ఈ కారణంగా రైతులు వరి సాగు వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనా. ఇక జిల్లాలో పూర్తిగా వర్షాధార వ్యవసాయమే అయినందున కాలం కలిసొస్తేనే రబీలో మెట్ట పంటల సాగు పెరిగే అవకాశం ఉంది.  
 
49,340 క్వింటాళ్ల విత్తనాలు అవసరం

జిల్లాలో రబీ సాగుకు 49,340 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వేరుశనగ విత్తనాలు 26 వేల క్వింటాళ్లు, శనగలు 2,100 క్వింటాళ్లు, పెసర్లు 2,600 క్వింటాళ్లు, మినుములు 2,000 క్వింటాళ్లు, జొన్నలు 1,000 క్వింటాళ్లు, మొక్కజొన్నలు 10,000 క్వింటాళ్లు, 100 క్వింటాళ్ల చొప్పున  పొద్దు తిరుగుడు, నువ్వులు, బొబ్బెర్లు, ఉలువలు 300 క్వింటాళ్లు, వరి విత్తనాలు 5 వేల క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. రబీలో కిలో మొక్కజొన్న విత్తనాలకు రూ.25, వరికి రూ. 50, ఉలువలకు రూ.32, మిగతా అన్ని రకాల విత్తనాలకు 33 శాతం రాయితీ ఇవ్వనున్నారు. గత ఏడాది విత్తనాలపై సబ్సిడీ 50 శాతం ఉండగా... ఈ ఏడాది 33 శాతానికి తగ్గించారు.
 
ఎరువుల ప్రణాళిక

రబీ సీజన్‌లో 1,30,322 టన్నుల ఎరువులు అవసరమని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.  యూరియా 67,396 టన్నులు, డీఏపీ 20,219 టన్నులు, కాంప్లెక్సు 26,959 టన్నులు, ఏంఓపీ 10,783 టన్నులు , ఎస్‌ఎస్‌పీ 4,964 టన్నులు అవసరమని అంచనా వేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement