అమెరికా ఆలయంలో భారీ నరమేధం కుట్ర భగ్నం | US Teen Arrested Over Plot to Massacre Hindus at Temple | Sakshi
Sakshi News home page

అమెరికా ఆలయంలో భారీ నరమేధం కుట్ర భగ్నం

Oct 15 2026 8:06 AM | Updated on Oct 15 2026 8:34 AM

US Teen Arrested Over Plot to Massacre Hindus at Temple

అమెరికాలో భారీ నరమేధం కుట్రను అక్కడి పోలీసులు భగ్నం చేశారు. ఇల్లినాయిస్‌ స్టేట్‌ చికాగో నగరం పరిధిలోని ఓ హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని సామూహిక కాల్పులకు తెగపడాలని ఓ టీనేజర్‌ ప్లాన్‌ గీశాడు. అయితే చివరి నిమిషంలో సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని నిలువరించి.. అరెస్ట్‌ చేశారు. అతను పక్కా హిందూ వ్యతిరేకి అని గుర్తించారు.

ఇల్లినాయిస్‌ రాష్ట్రంలోని పలాటైన్‌కు చెందిన 19 ఏళ్ల అలెగ్జాండ్రోస్‌ పాపోరాకిస్‌.. భారతీయులపై విద్వేషాన్ని వ్యక్తం చేస్తూ తరచూ సోషల్‌ మీడియా పోస్టులు చేస్తుండేవాడు. ఉపన్యాసాలు ఇస్తుండేవాడు. ఈ క్రమంలో కాల్పుల ప్రణాళికతో కూడిన మేనిఫెస్టోను సిద్ధం చేసుకున్నాడు. అతడు సామూహిక కాల్పులకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు గుర్తించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అక్టోబర్‌ 11వ తేదీన పలాటైన్‌, మౌంట్‌ ప్రాస్పెక్ట్‌ పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగారు. ఆకస్మిక తనిఖీఉల జరిపిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

భారతీయులపై భయంకరమైన విద్వేషం..
పాపోరాకిస్‌ టాకో బెల్‌ ఫాస్ట్‌ఫుడ్‌ రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. దర్యాప్తులో భాగంగా పాపోరాకిస్‌ ఎలక్ట్రానిక్‌ సమాచారాన్ని పరిశీలించిన పోలీసులు.. ‘వై ఐ ఫాట్‌: ఏకేఏ (అరోరా షూటర్స్‌ మేనిఫెస్టో)’ పేరుతో ఉన్న పత్రాన్ని గుర్తించారు. అందులో శ్వేతజాతి(వైట్‌పీపుల్‌) ఆధిపత్యవాద, తీవ్రవాద భావజాలంతోపాటు దక్షిణాసియా ప్రజలు.. అందునా ముఖ్యంగా భారతీయులపై హింసకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

తోటి ఉద్యోగుల వాంగ్మూలాల ప్రకారం.. పాపోరాకిస్‌ ఇతర జాతుల ప్రజలపై అవమానకర వ్యాఖ్యలు చేసేవాడు. భారతీయులపై ప్రత్యేకంగా ద్వేషం వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. అక్టోబర్‌ 11న దాడికి పాల్పడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే.. ఆ రోజు ప్రత్యేకమైనదని సహోద్యోగులతో చెప్పినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 

అతడి ఇంట్లో రైఫిల్‌, తూటాలు, బాడీ ఆర్మర్‌తోపాటు ఇతర వ్యూహాత్మక పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దాడికి సంబంధించిన వివరాలను అతను మరో వ్యక్తికి కూడా పంపినట్లు తెలుస్తోంది. అయితే, ఏ ఆలయంపై దాడి చేయాలనుకున్న విషయాన్ని అధికారులు ఇంకా ధృవీకరించలేదు. అంతేకాదు.. తుపాకీ జామ్‌ కావడంతో అతను తాను కాల్పుల ప్లాన్‌ను వాయిదా వేసుకుని ఉండొచ్చనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.

రెండు అభియోగాలు..
పాపోరాకిస్‌పై ఉగ్రవాద బెదిరింపులకు సంబంధించిన ఒక అభియోగంతోపాటు, రైఫిల్‌ను అక్రమంగా కలిగి ఉన్నాడనే మరో అభియోగాన్ని నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, అవసరమైతే అదనపు అభియోగాలు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఎఫ్‌బీఐ కూడా విచారణలో సహకరిస్తోంది.

కుక్‌ కౌంటీ కోర్టులో బుధవారం హాజరైన పాపోరాకిస్‌ను జడ్జి కస్టడీలో ఉంచాలని ఆదేశించారు. తదుపరి విచారణను అక్టోబర్‌ 30కి వాయిదా వేశారు.

ఆలయాలకు పోలీసుల హెచ్చరికలు..
ఈ ఘటనతో అక్కడి పోలీసులు హిందూ ప్రార్థనా మందిరాలను అప్రమత్తం చేశారు. ఇల్లినాయిస్‌ స్టేట్‌లో మొత్తంగా 58 ఆలయాలు ఉన్నట్లు ఆన్‌లైన్‌ డాటా ఆధారంగా తెలుస్తోంది. దీంతో భక్తులు, ఆలయాల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై స్పందించిన హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌.. పోలీసులు వేగంగా స్పందించడాన్ని అభినందించింది. అనుమానాస్పద సమాచారం లేదా ముప్పు కనిపిస్తే అధికారులకు తెలియజేయాలని హిందూ కమ్యూనిటీని కోరింది.

ఇదీ చదవండి: సీజేపీకి అమెరికా నిధులు.. మోదీకి మద్దతుగా ఉద్యమం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement