‘పంచాయతీ’పై అస్పష్టత! 

Process of gram panchayat elections is delayed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ జాప్యం జరుగుతోంది. పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం జూలై 31తో ముగుస్తోంది. ఆలోపే కొత్త పాలకవర్గాలను ఏర్పాటు చేసేలా ఎన్నికల నిర్వహణ పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం దీనికి అనుగుణంగా అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. అయితే పంచాయతీరాజ్‌ శాఖ వైఖరి దీనికి విరుద్ధంగా ఉంది. జూన్‌ 25లోపు గ్రామపంచాయతీల వారీగా రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపిస్తామని పంచాయతీరాజ్‌ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మంత్రి జూపల్లి చెప్పిన గడువు దగ్గరపడినా జిల్లాల వారీగా రిజర్వేషన్ల కోటాను నిర్ధారించలేదు. ఏ కేటగిరికి ఎన్ని పంచాయతీలు అనే లెక్కలు తేలలేదు. దీనిపై స్పష్టత వస్తేనే పంచాయతీల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశం ఉంటుంది.

పంచాయతీల వారీగా సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారు కోసం కనీసం వారం రోజులు పడుతుంది. మొత్తంగా పంచాయతీరాజ్‌ శాఖ తీరుతో గడువులోపు ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపించడంలేదని స్పష్టమవుతోంది. ఓటర్ల జాబితా, బీసీ ఓటర్ల గణన, రిజర్వేషన్ల నిర్ధారణ వంటి ప్రక్రియల్లోనూ ఇదే తీరుగా వ్యవహరిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దనే నిబంధనలున్నాయి. ఈ విషయంలో న్యాయపరమైన సమస్యలు రాకుండా అనుసరించే వ్యూ హంపైనా పంచాయతీరాజ్‌ శాఖ సరిగా స్పందించడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కాగా రిజర్వేషన్ల ఖరారుకు అనుసరించే మార్గదర్శకాలను జూన్‌ 12న ప్రభుత్వం విడుదల చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ మేరకు సర్క్యులర్‌ జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఏ కేటగిరీకి ఎన్ని సర్పంచ్‌ స్థానాలు కేటాయించాలనేది స్పష్టత ఇచ్చింది. పంచాయతీరాజ్‌ శాఖ, జిల్లాల కలెక్టర్లు జిల్లాల వారీగా రిజర్వేషన్‌ కోటా ను నిర్ధారించాలని ఆదేశించింది. ఈ ఇప్పటికీ పూర్తి కాలేదు. రాష్ట్రంలో మొత్తం సర్పంచ్‌ స్థానాలు 12,751 ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top