ఓపెన్‌కాస్ట్‌ బ్లాస్టింగ్‌తో ఇబ్బందులు

Problems With Opencast Blasting - Sakshi

ఊడిపడిన ఫ్యాన్‌...మహిళకు గాయాలు

ఆందోళన చెందుతున్న విఠల్‌నగర్‌ కాలనీవాసులు

సాక్షి, గోదావరిఖని(రామగుండం) : సింగరేణి రామ గుండం రీజియన్‌ పరిధిలోని ఆర్జీ–2 డివిజన్‌ పరిధిలో గల ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్ట్‌–3లో సోమవారం మట్టి తొలగించేందుకు ప్రైవేట్‌ కాంట్రాక్టు సంస్థ చేపట్టిన బ్లాస్టింగ్‌ ధాటికి గోదావరిఖని విఠల్‌నగర్‌లోని ఓ ఇంట్లో ఫ్యాన్‌ ఊడి కిందపడింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న గాండ్ల వెంకటమ్మ అనే మహిళ చెవుకు గాయమైంది. ఆ సమయంలో తన కూతురు పిల్లలు ఇంట్లోనే ఆడుకుంటుండగా వారిపై ఫ్యాన్‌ పడకపోవడంతో వారికి ప్రాణాపాయం తప్పింది. ఆదివారం కూడా ఇదే కాలనీలో నివసించే రాజు అనే కిరాణా వ్యాపారి ఇంట్లో బ్లాస్టింగ్‌ చేసిన తర్వాత ఫ్యాన్‌ కుప్పకూలింది.

ఈ సమయంలో ఇంట్లోని వారు భయంతో బయటకు పరుగులు తీశారు. కాగా ఓసీపీ–3లో మట్టి తొలగింపు పనుల కోసం చేస్తున్న బ్లాస్టింగ్‌కు వాడుతున్న పేలుడు పదార్థాలను ఎక్కువగా వినియోగిస్తున్న కారణంగానే తమ ఇళ్లు పగుళ్లు తేలడం, ఇంట్లో రేకులు, ఫ్యాన్లు ఊడిపడుతున్నాయని విఠల్‌నగర్‌ వాసులు ఆందోళన చెందుతున్నారు. అయితే బ్లాస్టింగ్‌ విషయమై గతంలో ఆందోళన చేసినప్పుడు తక్కువ సామర్థ్యంతో బ్లాస్టింగ్‌ చేస్తున్నారని, ఆ తర్వాత షరా మామూలుగానే వ్యవహరిస్తున్నారని కార్పొరేటర్‌ చుక్కల శ్రీనివాస్‌ తెలిపారు. రెండు నెలల క్రితం ఓ ఇంట్లో మండంపై ఆడుకుంటున్న బాలుడిపై బ్లాస్టింగ్‌ జరిగిన సమయంలో పెద్ద బండరాయి పడింది. దీంతో బాలుడి కుటుంబసభ్యులు, స్థానికులు ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్టులోపలికి వెళ్లి వాహనాలు నడవకుండా రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

దీంతో స్పందించిన యాజమాన్యం అధికారులను విఠల్‌నగర్‌ కాలనీకి పంపించి ఇళ్లల్లో అద్దాలను బిగించారు. ఆ సమయంలో అద్దాలు పగలకుండా తక్కువ స్థాయిలో బ్లాస్టింగ్‌ చేసి కాలనీవాసులను అధికారులు నమ్మించారు. ఆ తర్వాత షరా మామూలుగానే బ్లాస్టింగ్‌ చేస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు. కాగా సింగరేణి కార్మికులు, వారి కుటుంబసభ్యులు నివసించే ఈ కాలనీలో బ్లాస్టింగ్‌ వల్ల నష్టపోతున్నప్పటికీ సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని స్థానికులంటున్నారు.

దీనికితోడు రామగుండం కార్పొరేషన్‌కు పన్నులు చెల్లిస్తున్నా అధికారులు సింగరేణి యాజమాన్యంతో ఏనాడు తమ గురించి చర్చించలేదని, ఇక తమ ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలని కాలనీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతున్న నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం, రామగుండం కార్పొరేషన్‌ అధికారులు బ్లాస్టింగ్‌ సమస్యను పరిష్కరించాలని వారు  కోరుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top