పోలీసుల నిర్లక్ష్యమే కొంపముంచిందా?

Priyanka Murder Case: Relatives And Netizens Alleges Police Negligence - Sakshi

ప్రియాంక మిస్సింగ్‌ కేసులో పోలీసుల తీవ్ర జాప్యం

మా పరిధి కాదంటూ కుటుంబీకులను ఇబ్బంది పెట్టిన పోలీసులు 

కేసు నమోదు సమయంలోనూ అనుచిత వ్యాఖ్యలు 

సైబరాబాద్‌ పోలీసుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు 

సాక్షి, హైదరాబాద్‌/రంగారెడ్డి జిల్లా/శంషాబాద్‌: ఆధునిక వాహనాలు.. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకున్నా క్షేత్రస్థాయిలో పోలీసుల తీరు లో మాత్రం మార్పు రావట్లేదు. శంషాబాద్‌ పరిధి లో చోటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృ ష్టించిన పశువైద్యురాలు ప్రియాంకారెడ్డి దారు ణ హత్య ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. ఘటన జరిగిన 24 గంటల్లోగా నిందితుల్ని పట్టుకున్నప్పటికీ ఘటనకు ముందు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఉంటే ప్రియాంక ప్రాణాలతో మిగిలి ఉండేది. ఈ కేసులో పోలీసుల అలసత్వం అడుగడుగునా ప్రస్ఫుటమవుతోంది. ఈ కేసు నమోదు, ప్రాథమిక దర్యాప్తులో సైబరాబాద్‌ పోలీసుల తీరును ప్రియాంక తండ్రి శ్రీధర్‌రెడ్డితో పాటు పౌరసమాజం తీవ్రంగా విమర్శిస్తోంది.  

ఫిర్యాదు తీసుకోవడానికీ విముఖత 
బుధవారం రాత్రి ప్రియాంక సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయిన తర్వాత ఆమె కుటుంబీకులు అనేక ప్రాం తాల్లో వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ (ఆర్‌జీఐఏ) పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. జరిగిన విషయం చెప్పి ప్రియాంక ఆఖరుసారి మాట్లా డినప్పుడు ఉన్న ప్రదేశం వివరాలు చెప్పారు. ఆ రాత్రి డ్యూటీలో ఉన్న పోలీసులు ఆ ఏరియా తమ పరిధిలోకి రాదని, శంషాబాద్‌ రూరల్‌ పీఎస్‌కు వెళ్లాలని పంపించారు. అక్కడకు వెళ్లిన వారిని మళ్లీ ఆర్‌జీఐఏ ఠాణాకు తిరిగి పంపించారు. ప్రియాంక తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఏ స్టేషన్లోనైనా ఫిర్యా దు తీసుకుని పోలీసులు రంగంలోకి దిగివుంటే ఆమె ప్రాణాలతో ఉండేదనే వాదనలు విన్పిస్తున్నాయి. 

ప్రియాంక కుటుంబీకులు రెండోసారి తమ ఠాణాకు వచ్చిన తర్వాతగానీ మిస్సింగ్‌ కేసు నమోదు చేయలేదు. ఇక్కడే జరగాల్సిన జాప్యం జరిగిపోయింది. బాధితులు వచ్చినప్పుడు పరిధుల విషయం పక్కన పెట్టి స్పందించాలని ఉన్నతాధికారులు, కోర్టులు పదేపదే స్పష్టం చేస్తున్నా పోలీసుల తీరులో మాత్రం మార్పు రావట్లేదు. తక్షణం స్పందించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం, ఆ తర్వాత పరిధి ఆరా తీసి ఆ ఠాణాకు బదిలీ చేయడం వంటి విధానాలే కరువయ్యాయి. కాగా, ప్రియాంకారెడ్డి కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదుపై నిర్లక్ష్యంగా వహించిన ఓ సీఐ, ఓ ఎస్‌ఐపై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. 

కెమెరాల ఫీడ్‌ చూస్తూ కాలక్షేపం... 
మిస్సింగ్‌ కేసుల దర్యాప్తులో పోలీసులు తీవ్ర నిర్ల క్ష్యం వహిస్తున్నారు. తప్పిపోయింది యుక్త వయ స్సు వారైతే ఉద్దేశపూర్వకంగానే ఎవరితోనో కలిసి వెళ్లిపోయి ఉంటారని, పెద్ద వయస్సు వారు అయి తే కుటుంబీకులతో ఉండటం ఇష్టం లేక దూరమై ఉంటారని చెప్తూ కాలయాపన చేస్తుంటారు.  ప్రియాంక మిస్సింగ్‌ కేసు దర్యాప్తులోనూ సైబరాబాద్‌ పోలీసులు ఇదే నిర్లక్ష్యం ప్రదర్శించారు. కేసు నమోదు చేసిన తర్వాత.. పోలీసులు అవమానకరంగా, హేళనగా మాట్లాడినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ‘మీ బిడ్డ ఎవరితోనైనా వెళ్లిందేమో? లవర్‌ తీసుకెళ్లాడేమో? ఎక్కడకీ పోదులే.. తిరిగి ఇంటికి వస్తుందిలే’ అంటూ వ్యాఖ్యలు చేసి వారిని మనోవేదనకు గురి చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు టోల్‌ప్లాజా వద్దకు వచ్చి సీసీ కెమెరాల ఫుటేజ్‌ చూస్తూ కాలక్షేపం చేశారే తప్ప సరైన దిశలో కేసును దర్యాప్తు చేయలేకపోయారు. ఉదంతం తీవ్రతను, పూర్వాపరాలను కుటుంబీకులు వివరించి లారీడ్రైవర్ల ప్రమేయంపై అనుమా నం కూడా వ్యక్తం చేశారు. అప్పుడైనా రంగంలోకి దిగి శంషాబాద్‌తో పాటు పక్కన ఉన్న షాద్‌నగర్‌ అధికారులను అప్రమత్తం చేసి అనుమానిత ప్రాం తాల్లో పోలీసు వాహనాలతో పెట్రోలింగ్‌ నిర్వహించినా నిందితులు మృతదేహంతో సహా దొరికేవా రు. అలా చేయకపోవడంతోనే నిందితులు మృతదేహాన్ని లారీలో పెట్టుకుని దాదాపు 30 కి.మీ. ప్ర యాణించగలిగారన్న వాదనలు విన్పిస్తున్నాయి. 

పట్టింపులేని పెట్రోలింగ్‌ 
సంఘటన జరిగిన ప్రాంతం పక్కనే ఉన్న సర్వీసు రహదారి నుంచి పెట్రోలింగ్‌ వాహనం నాలుగు సార్లు చక్కర్లు కొట్టినట్లు సీసీ టీవీల్లో నమోదైంది. పెట్రోలింగ్‌ వాహనంలో ఉన్న పోలీసులు అటు ఇటుగా తిరగడమే తప్ప ఆగి ఉన్న లారీలను తీయించే విషయంలో నిర్లక్ష్యం వహించినట్లు స్పష్టమవుతోంది. రోడ్డుపై అడ్డంగా ఆగి ఉన్న లారీని అక్కడి నుంచి తీయిస్తే జాతీయరహదారి నుంచి రాకపోకలు సాగించే వారికి లోపల జరిగే సంఘటన స్పష్టంగా కనిపించేది. దీంతో ప్రియాంక దుర్ఘటన జరిగి ఉండకపోయేదనే వాదనలున్నాయి.  

భయం భయంగా ఉంది 
పెద్దకూతురి మరణం తీవ్రంగా కలచివేసిందని, చిన్న కుమార్తెను ఉద్యోగానికి పంపేందుకు భయపడుతున్నామని శుక్రవారం పరామర్శించడానికి వచ్చిన మంత్రులతో ప్రియాంకరెడ్డి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్‌ వెటర్నరీ కళాశాలలో ప్రియాంక చదువుతున్న సమయం లోనే నాలుగేళ్ల క్రితమే శంషాబాద్‌కు వచ్చామని, భవ్యకు కూడా సమీప ఎయిర్‌ పోర్టులో ఉద్యోగం రావడంతో ఇక్కడే ఉండిపోయామన్నారు. కొద్దిరోజుల తర్వాత ప్రియాంక కూడా హైదారాబాద్‌కు బదిలీ చేయించుకుంటానందని, ఇంతలోనే ఘో రం జరిగిపోయిందని వాపోయారు. సమాజంలో జరుగుతున్న నేరాలపై అవగాహన లేక కూడా తన కుమార్తె హత్యకు ఓ కారణమని ప్రియాంక తండ్రి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. నేరాలపై అవగాహన పెంచాల్సిన అవసరముందని, నిందితుల తరఫున న్యాయవాదులు ఎవరూ వాదించకూడదని కోరారు. నిందితులకు ఫాస్ట్రాక్‌ కోర్టు ద్వారా త్వరగానే శిక్షపడుతుందని ఆశిస్తున్నానన్నారు. 

10 అడుగులు వేసుంటే..
టోల్‌ ప్లాజాకు యాభై నుంచి అరవై మీటర్ల దూరం.. జాతీయ రహదారికి కేవ లం ఇరవై నుంచి ముప్పై అడుగుల దూరంలోనే దారుణం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి సర్వీసు ర«హదారిని ఆనుకుని ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో ప్రియాంకపై అత్యాచారం చేశారు. ప్రియాంక కాస్త ధైర్యం చేసి పదడుగులు ముందుకు వెళ్లి ఉంటే అక్కడే హైమాస్ట్‌ వెలుగులతో పాటు, వాహనాల రాకపోకలతో జన సమ్మర్దమైన ప్రాంతంలోకి చేరి సురక్షితంగా వచ్చి ఉండేదని, ఆమె దుండగుల బారినుంచి తప్పించుకునే అవకాశం ఉండేదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. 

శవం దొరికాక హడావుడి: ప్రియాంక బంధువులు  
ప్రియాంకారెడ్డి అదృశ్యం అయిన తీరు, ఆఖరిసారిగా సోదరితో మాట్లాడటం, సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయిపోవడం వంటి విషయాలు సామాన్య వ్యక్తి విన్నా తక్షణం అప్రమత్తమై వెతికే ప్రయత్నం చేసుండేవాడు. కానీ, సైబరాబాద్‌ పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించారు. ఆమె మృతదేహం లభించిన తర్వాత మాత్రం 10 బృందాలు, 15 బృందాలతో దర్యాప్తు అంటూ హడావుడి చేశారు. నిందితుల్ని మరుసటి రోజే పట్టుకున్నారు సరే... అసలు ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించి ఉంటే అసలు ఈ హత్యే జరగకపోయేది.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top