రెండువేలైతే కుదరదు!

Private hospitals objections on cataract operations - Sakshi

     ‘కంటి వెలుగు’క్యాటరాక్ట్‌ ఆపరేషన్లపై ప్రైవేటు ఆస్పత్రుల గగ్గోలు 

     ఆ సొమ్ము గిట్టుబాటు కాదంటున్న యాజమాన్యాలు 

సాక్షి, హైదరాబాద్‌: కంటి వెలుగు కింద క్యాటరాక్ట్‌ ఆపరేషన్లకు ప్రభుత్వమిచ్చే సొమ్ము సరిపోవడం లేదని ప్రైవేటు  ఆస్పత్రులు గగ్గోలు పెడుతున్నాయి. ఒ క్కో క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌కు రూ. 2వేలు ఇస్తుండటంతో గిట్టుబాటు కావడంలేద ని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీం తో పలుచోట్ల ఆపరేషన్లు ఆలస్యం అవుతున్నాయని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఏం చేయాలో అర్థంగాక అధికారులు తల పట్టుకుంటున్నారు.  

11 శాతం మందికి.. 
ప్రభుత్వం గత నెల 15న ప్రారంభిం చిన కంటి వెలుగు కార్యక్రమంలో సోమ వారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా  22.13 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 9.52 లక్షల మంది పురుషులు, 12.60 లక్షల మంది స్త్రీలున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన కంటి పరీక్షల అనంతరం 4.26 లక్షల మందికి రీడింగ్‌ గ్లాసులు ఇచ్చారు. మరో 5.13 లక్షల మందికి ఇతర దృష్టిలోపం కారణంగా సంబంధిత అద్దాలివ్వాలని నిర్ణయించారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో దాదాపు 11 శాతం మందికి క్యాటరాక్ట్‌ అవసరమని నిర్ధారించినట్లు సమాచారం. మరో 4 శాతం మందికి ఆపరేషన్లు అవసరమని నిర్ధారించారు.

పెరుగుతున్న ఆపరేషన్లు 
కంటి వెలుగు ప్రారంభానికి ముందు రాష్ట్రంలో 3 లక్షల మందికే ఆపరేషన్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. కానీ పరిస్థితి చూస్తుంటే 12 లక్షల మందికి ఆపరేషన్లు చేయాల్సి వస్తుందని వైద్యారోగ్య శాఖ అంచనా వేసింది. దీంతో ఆపరేషన్లు చేసే ఆస్పత్రుల సంఖ్యనూ పెంచారు. ఇప్పటివరకు 70 ఆస్పత్రులకు అనుమతివ్వగా.. మరో 41 ఆస్పత్రులను గుర్తించారు. వీరి ఆపరేషన్లకు కనీసం ఏడాదిన్నర పడుతుందని వైద్యారోగ్య వర్గాలు చెబుతున్నాయి. ఆరోగ్యశ్రీలో 25 వరకే కంటి ఆపరేషన్లు నిర్వహిస్తుండగా కంటి వెలుగులో 60 వరకు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో కంటి ఆపరేషన్‌కు కనిష్టంగా రూ. 2 వేలు, గరిష్టంగా రూ. 35 వేల వరకు సంబంధిత ఆస్పత్రికి ప్రభుత్వం చెల్లిస్తోంది. ఏదైనా ఆస్పత్రి అంతకు మించి వసూలు చేస్తే జాబితా నుంచి ఆస్పత్రిని తీసేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.  

క్యాటరాక్ట్‌వే ఎక్కువ 
కంటి ఆపరేషన్లలో ఎక్కువగా క్యాటరాక్ట్‌వే ఉన్నాయి. ఆరోగ్యశ్రీలో క్యాటరాక్ట్‌ ఆపరేషన్ల ధర లేకపోవడంతో ఆపరేషన్‌కు రూ. 2,000లను ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇతర ఆపరేషన్లకు ఆరోగ్యశ్రీ ధరల ప్రకారం ఇస్తోంది. అయితే కేంద్రం ప్రారంభించిన ఆయుష్మాన్‌భవలో క్యాటరాక్ట్‌కు రూ. 6 వేలు ఇస్తున్నారని.. ఇక్కడ కనీసం రూ. 5,000 అయినా ఇవ్వాలని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు కోరుతున్నాయి. లేదంటే మున్ముందు ఆపరేషన్లను నిలిపేసే ప్రమాదముందని కొన్ని యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top