తెలుగు రాష్ట్రాల నుంచి 28వేల కోట్ల పెద్దనోట్ల మాయం!

Prevention of 2000 Banknotes Decreased During The Telangana elections - Sakshi

తెలంగాణలో ముందస్తు, వచ్చే సార్వత్రిక ఎన్నికల ఎఫెక్ట్‌

రాజకీయ పార్టీలు, బడా వ్యాపారుల చేతుల్లో చిక్కుకున్న రూ.2వేల నోటు

పరిస్థితిని గుర్తించిన ఆర్బీఐ విజిలెన్స్‌.. పెద్దనోట్ల సరఫరా నిలిపివేత

బ్యాంకులకు వస్తున్న రూ. 200, 100, 50 నోట్లు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ముందస్తు ఎన్నికలతోపాటు వచ్చే సార్వత్రిక ఎన్నికలు పెద్దనోటును మింగేస్తున్నాయి. రవాణా చేసేందుకు, దాచిపెట్టేందుకు ఈజీగా ఉండే రూ.2వేల నోటుపైనే రాజకీయ పార్టీలతోపాటు బడావ్యాపారులు దృష్టిపెట్టారు. వీరంతా ఇప్పటికే పెద్దనోటును భారీగా నిల్వ చేయడంతో లావాదేవీలు చాలామటుకు తగ్గిపోయాయి. మరో 45 రోజుల్లో తెలంగాణ ఎన్నికలు, తర్వాతి ఆర్నెల్లలో.. ఏపీ శాసనసభ ఎన్నికలతో పాటు లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తుండటంతో రూ.2వేల నోట్ల నిల్వ పెరిగిపోయింది.

ఆర్‌బీఐ వెల్లడించిన సమాచారం ప్రకారం.. తెలుగు రాష్ట్రాలకు రూ.53 వేల కోట్ల విలువైన 2 వేల నోట్లు సరఫరా చేస్తే మొన్నటి సెప్టెంబర్‌ 30వ తేదీనాటికి రూ.28 వేల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు బ్లాక్‌ అయ్యాయి. ఈ ప్రమాద తీవ్రతను ఆర్‌బీఐ ముందుగానే పసిగట్టింది. తెలుగు రాష్ట్రాల నుంచి రూ.24 వేల కోట్ల విలువైన పెద్దనోట్లను వెనక్కు తీసుకుంది. వచ్చే ఏడాది మే నాటికి దాచిపెట్టిన మొత్తంలో సింహభాగం చలామణిలోకి వస్తుందని రిజర్వు బ్యాంక్‌ అంచనా వేస్తోంది. రకరకాల రూపేణా సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈ మొత్తం బ్యాంక్‌లకు రావచ్చన్నది ఆర్‌బీఐ ఆశ. 

వెళ్లడమే.. రావడం లేదు 
ఏడాది కాలంగా బ్యాంక్‌ల నుంచి పెద్దనోట్లు బయటకు వెళ్లడమే గానీ తిరిగి వస్తున్న దాఖలాలు లేకపోవడాన్ని రిజర్వు బ్యాంక్‌ గుర్తించింది. ఆ మాటకొస్తే విడుదల చేసిన 6 నెలల్లోనే.. తెలుగు రాష్ట్రాల్లో రూ.10వేల కోట్ల విలువైన ఈ నోట్లను బ్లాక్‌ చేసినట్లు రిజర్వు బ్యాంక్‌ అంచనాకు వచ్చింది. రాన్రానూ ఈ నోట్లు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు గుర్తించి.. 2017 డిసెంబర్‌ నుంచి పెద్దనోట్లను సరఫరా చేయడం ఆపేసింది. అప్పటికే తగినంత మొత్తంలో రూ.500, రూ.200 నోట్లను భారీగా బ్యాంక్‌లకు సరఫరా చేసిన ఆర్బీఐ.. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి చలామణిలో ఉన్న రూ.2.50 లక్షల కోట్ల విలువైన 2 వేల నోట్లను వెనక్కి తీసుకుంది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి వెనక్కు తీసుకున్నవి రూ.24వేల కోట్లు అని ఆర్బీఐ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

రూ.1000, రూ.500 నోట్లు రద్దుచేసిన తర్వాత.. 2016 నవంబర్‌ 11 నుంచి 2017 డిసెంబర్‌ 31 నాటికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.53వేల కోట్ల విలువైన రూ.2వేల నోట్లను సరఫరా చేసింది. అవసరమైనంత స్థాయిలో చిన్ననోట్లు ముద్రణ కాకపోవడం, అందుబాటులోకి రాకపోవడంతోనే పెద్దనోట్లను ఇంత పెద్దమొత్తంలో ఏపీ, తెలంగాణలకు పంపిణీ చేయాల్సి వచ్చింది. 2018 జనవరిలో పెద్దనోట్లు భారీ మొత్తంలో బ్లాక్‌ అవుతున్నట్లు గుర్తించి.. వెంటనే వీటి సరఫరాను ఆపేసింది.

తెలంగాణ కంటే ఏపీలోనే ఈ నోట్లు భారీగా బ్లాక్‌ అయినట్లు ఆర్బీఐ అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ‘రెండు రాష్ట్రాల్లో దాదాపు రూ.28 వేల కోట్ల విలువైన నోట్లు బ్లాక్‌ అయినట్లు మా ఆడిట్‌లో బయటపడింది. ఇదే విషయాన్ని మేము కేంద్ర నిఘాసంస్థల దృష్టికి తీసుకువెళ్లాం. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, ఆదాయపన్ను శాఖలు వీటిని గుర్తించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి’అని ఆర్‌బీఐ హైద రాబాద్‌ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. 

చలామణిలో 6వేల కోట్లే.. 
రిజర్వు బ్యాంక్‌ వెనక్కి తీసుకోవడంతోపాటు బ్లాక్‌ చేసిన నోట్లు పోగా.. తెలుగు రాష్ట్రాలలో రూ.6వేల కోట్ల విలువైన 2 వేల నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నట్లు సెప్టెంబర్‌ 30వ తేదీన ఆర్‌బీఐ అంచనా వేసింది. వీటిని కొంత మొత్తాన్ని బ్యాంక్‌లు ఏటీఎంల్లో పెట్టడానికి ప్రాధాన్యత ఇచ్చాయి. అయితే, ఏటీఎంల నుంచి బయటకు వెళ్లిన నోట్లు తిరిగి బ్యాంక్‌లకు రాకపోవడాన్ని గుర్తించారు. ప్రస్తుతం రిటైల్‌ వ్యాపారుల నుంచి 60% రూ.500 నోట్లు మిగిలిన 40% రూ.200, 100, 50 నోట్లు వస్తున్నాయని బ్యాంకర్లు చెపుతున్నారు.

రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటర్లకు ఈజీగా పంపిణీ చేసే లక్ష్యంతో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వీటిని నిల్వ చేస్తూఉండొచ్చని ఆర్బీఐ విజిలెన్స్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఎప్పటినుంచో పెద్ద నోట్లను నిల్వ చేసిన బడా వ్యాపారులు, కాంట్రాక్టర్లు కూడా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు విరాళాలుగా అందించే అవకాశమందని.. అజ్ఞాతంలో ఉన్న మొత్తంలో 50% వరకు వచ్చే ఏడాది మే నాటికి బ్యాంక్‌లకు వస్తుందని ఆర్‌బీఐ ఆశిస్తోంది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లతో పాటే ఇటీవల రూ.500 నోట్లను కూడా పెద్దమొత్తంలోనే నిల్వచేస్తున్నారని ఎస్‌బీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. తమకు ఏటీఎంల్లో వినియోగించడానికి రూ.500 నోట్లకు కొరత ఏర్పడి రూ.100 నోట్లను వినియోగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.  

  • నోట్ల రద్దు తర్వాత తొలి ఆర్నెల్లలో బ్లాక్‌ అయిన వాటి విలువ రూ. 10,000 కోట్లు
  • తెలుగు రాష్ట్రాల నుంచి మాయమైన మొత్తం పెద్దనోట్ల విలువ రూ. 28,000 కోట్లు
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top