అందరికీ.. ప్రతిష్టాత్మకమే! | Prestigious everyone! | Sakshi
Sakshi News home page

అందరికీ.. ప్రతిష్టాత్మకమే!

Feb 25 2016 5:11 AM | Updated on Aug 10 2018 8:16 PM

అందరికీ.. ప్రతిష్టాత్మకమే! - Sakshi

అందరికీ.. ప్రతిష్టాత్మకమే!

అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి....

మూడు రోజులుగా అచ్చంపేటలో
 మకాం వేసిన మంత్రి జూపల్లి
విజయావకాశాలపై ఓ స్వచ్ఛంద
 సంస్థ ద్వారా టీఆర్‌ఎస్ సర్వే
ఐక్యకూటమిగా ఏర్పడిన టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ
ముగిసిన నామినేషన్ల దాఖలు..
 ఇక బుజ్జగింపుల పర్వం

  
అచ్చంపేట :అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మూడు రోజులుగా వార్డులు వారీగా అభ్యర్థుల కసరత్తు చేసి నామినేషన్లు వేయించారు. బుధవారం నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. మొత్తంగా 135 నామినేషన్లు దాఖలయ్యాయి. కొన్ని వార్డులకు పోటీ ఎక్కువ ఉండడంతో టీఆర్‌ఎస్, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన  వారు ఇద్దరు, ముగ్గురు చొప్పున నామినేషన్లు వేశారు. వారిని బుజ్జగించే పనిలో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. అయితే గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అయితే మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికోసం ఇప్పటికే అధికార పార్టీ అచ్చంపేటలో ఓ సంస్థ చేత రెండు రోజులుగా సర్వే కూడా చేయించింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మూడురోజులుగా అచ్చంపేటలో మకాం వే శారు. మంత్రి స్వయంగా రంగంలోకి దిగి అసంతృప్తివాదులను, ఇతర పార్టీల వారినీ..తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని వర్గాలతో సమావేశమై మద్దతు కూడగడుతున్నారు. 

టీడీపీకి చెందిన మాజీ మంత్రి పి.రాములు, కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యలు మంగ్యానాయక్, జిల్లా అధికార ప్రతినిధి మండికారి బాలాజీ, టీఆర్‌ఎస్ అసమ్మతి వర్గం నాయకులు జి.సుదర్శన్‌లు ఐక్య కూటమిగా ఏర్పడి వార్డుల వారీగా అభ్యర్థులను నిలిపారు. టీఆర్‌ఎస్‌కు దీటైన పోటీ ఇచ్చేందుకు వారు సుదీర్ఘమైన ఆలోచనలు, ఎత్తుగడలు వేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొంది. సీపీఎం, సీపీఐ, బీఎస్‌పీ పార్టీలు కొన్ని వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులను పోటీలో నిలిపాయి.


 ఓ సంస్థ ద్వారా సర్వే...
అచ్చంపేట నగరపంచాయతీ ఎన్నికలపై రెండు రోజులుగా ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించారు. ఈ ఎన్నికలు టీఆర్‌ఎస్‌కు అనుకూలమా...!ఏమైనా వ్యతిరేకత ఉందా..! అనే కోణంలో పట్టణంలో మంగళవారం నుంచి ఓ ప్రైవేట్ ఏజెన్సీ సర్వే చేస్తోంది. వార్డుల వారీగా నిలబడే అభ్యర్థుల భవిష్యత్తు గురించి కూడా సమాచారం సేకరిస్తున్నట్లు సమాచారం. దీని ఆధారంగా పోటీ చేసే అభ్యర్థులను ఉపసంహరణ వరకు మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రైవేట్ ఏజెన్సీ కాకుండా కొల్లాపూర్ నియోజకవర్గ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర ప్రజాప్రతినిధుల బృందం కూడా అచ్చంపేటలో సమాచారం సేకరిస్తోంది.

 మంత్రి బుజ్జగించినా ససేమిరా..
సీనియర్ నాయకుడు గార్లపాటి సుదర్శన్ కొంతకాలంగా టీఆర్‌ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. అచ్చంపేట నగరపంచాయతీ ఎన్నికల్లో ఐక్య కూటమితో చేతులు కలిపారు. అచ్చంపేటకు వచ్చిన పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మూడు రోజులుగా సుదర్శన్‌కు ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నం చేసినా ఆయన టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చేది లేదని తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఈ విషయంపై ఐక్యకూటమి ప్రెస్‌మీట్‌లో సుదర్శన్ కూడా తాను టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతున్నట్లు వస్తున్న పుకార్లు నిజం కాదని చెప్పడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement