ప్రాణహిత, పాలమూరుకు 15 వేల కోట్లు

ప్రాణహిత, పాలమూరుకు 15 వేల కోట్లు - Sakshi


బడ్జెట్‌లో ఈ రెండు ప్రాజెక్టులకు పెద్దపీట

కొత్తగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టుకు రూ.771 కోట్లు

డిండి, కంతనపల్లికి భారీగానే కేటాయింపులు

మిషన్ కాకతీయకు రూ.2 వేల కోట్లు

కేటాయింపు ప్రణాళికలకు కేబినెట్ ఆమోదం


 

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా నిర్మించతలపెట్టిన, రీ ఇంజనీరింగ్ చేసిన ప్రాజెక్టులకు వచ్చే బడ్జెట్‌లో నిధుల పంట పండనుంది. మొత్తంగా రూ.25 వేల కోట్ల సాగునీటి శాఖ బడ్జెట్‌లో వాటికే దాదాపు 65 శాతం నిధులు కేటాయించేలా ప్రణాళికలు తయారయ్యాయి. ఈ బడ్జెట్ ప్రణాళికకు ఆదివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని కేబినెట్ ఆమోదముద్ర వేసింది. బడ్జెట్‌లో పాలమూరు-రంగారెడ్డి, ప్రాణహిత ఎత్తిపోతలకే సుమారు రూ.15 వేల కోట్లు కేటాయించనున్నారు. రీ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న డిండి, సీతారామ, కంతనపల్లి, ఇందిరమ్మ వరద కాల్వకు కూడా భారీగా నిధులు కేటాయించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

 కొత్త ప్రాజెక్టులకూ పెద్దపీట: రాష్ట్ర బడ్జెట్‌లో సాగునీటి శాఖకు ఏటా రూ.25 వేల కోట్లు కేటాయించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ప్రాజెక్టులవారీగా కేటాయించాల్సిన నిధులపై పలు దఫాలుగా కసరత్తు చేశారు. మొదట వేసిన అంచనాల్లో ప్రాణహిత, పాలమూరు ప్రాజెక్టులు ఒక్కోదానికి రూ.8 వేల కోట్ల చొప్పున కేటాయించాలని ప్రతిపాదనలు రూపొందించారు. తాజాగా రెండింటికి కలిపి రూ.15 వేల కోట్లు కేటాయించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.



ఇందు లో పాలమూరు ప్రాజెక్టుకు రూ.7,860.88 కోట్లు, ప్రాణహితకు రూ.7,400 కోట్లు కేటాయించేందుకు ఓకే చేశారు. కొత్తగా చేపట్టిన సీతారామ, భక్తరామదాసు ప్రాజెక్టుకు రూ. 771.80 కోట్లు, డిండి ఎత్తిపోతలకు రూ.780 కోట్లు కేటాయిం చేందుకు ఆమోదముద్ర వేశారు. ఇక చివరి దశలో ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు మొత్తంగా రూ.685 కోట్ల మేర కేటాయింపులు జరిపారు. ఆదిలాబాద్‌లోని మధ్యతరహా ప్రాజెక్టులను పూర్తిచేసి ఆయకట్టు లక్ష్యాలను చేరేలా కేటాయింపుల ప్రతిపాదనలు ఓకే అయ్యాయి. వీటితోపాటు మిషన్ కాకతీయకు రూ.2 వేల కోట్లు కేటాయించనున్నారు.

 

ఆయకట్టు లక్ష్యం మరో 52 లక్షల ఎకరాలు.

రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ప్రాజెక్టుల కింద ఇప్పటివరకు మొత్తంగా రూ.46 వేల కోట్ల మేర ఖర్చు చేయగా, వృద్ధిలోకి వచ్చిన ఆయకట్టు 9 లక్షల ఎకరాల వరకు ఉంది.  పాత ప్రాజెక్టులు, చిన్న నీటి వన రుల కింద ఉన్న ఆయకట్టుతో కలిపి మొత్తంగా 48,22 లక్షల ఆయకట్టుకు ప్రాజెక్టుల ద్వారా సాగునీరందుతోంది. ఈ లెక్కన ప్రభుత్వం లక్ష్యం మేరకు మరో 52 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. దీనిపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది. ఈ లక్ష్యాన్ని చేరుకునేలా కృషి చేయాలని సీఎం సూచించినట్లు తెలిసింది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top