రండోరన్నా.. దండుగా పోదాం..!

Pragathi Nivedana Sabha Posters Released In Adilabad - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు ఉమ్మడి ఆదిలాబాద్‌ నుంచి వేలాదిగా జనం తరలి వెళ్లనున్నారు. సెప్టెంబర్‌ రెండో తేదీన ముందస్తు ఎన్నికలకు శంఖారావంగా తలపెట్టిన ఈ సభకు ఉమ్మడి జిల్లా నుంచి లక్ష మందిని సమీకరించాలని నాయకులు ముందుగా భావించారు. అయితే వాహనాల కొరతతో పాటు వ్యవసాయ పనుల్లో రైతులు బిజీగా ఉన్న పరిస్థితుల్లో 10 నియోజకవర్గాల నుంచి 50వేల నుంచి 70వేల వరకు జనాన్ని సమీకరించి హైదరాబాద్‌ తరలించాలని నిర్ణయానికి వచ్చారు.

జన సమీకరణ బాధ్యతలను సీఎం కేసీఆర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు అప్పగించడంతో పాటు జనాన్ని సభ జరిగే కొంగరకలాన్‌కు తీసుకొచ్చేందుకు అయ్యే రవాణా, భోజన ఖర్చులను కూడా ఇప్పటికే పార్టీ తరపున ఎమ్మెల్యేలకు చేరవేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మంచిర్యాల ఎమ్మెల్యే ఎన్‌.దివాకర్‌రావు మినహా ఇద్దరు మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మిగతా ఎమ్మెల్యేలు ఆర్టీసీ బస్సులను ఇప్పటికే బుక్‌ చేశారు. దివాకర్‌రావు నియోజకవర్గంలోని అన్ని స్కూల్, కాలేజీ బస్సులతో పాటు ఇతర ప్రైవేటు వాహనాలను కూడా సభ కోసం వినియోగిస్తున్నారు.

ఎమ్మెల్యేలతో పాటు టిక్కెట్టు ఆశిస్తున్న మిగతా నాయకులు, ఎంపీలు  సైతం భారీ ఎత్తున జన సమీకరణ జరిపేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆదివారం జరిగే సభకు ఏ జిల్లా, ఏ నియోజకవర్గం నుంచి ఎంత మంది వెళ్తున్నారు, ఏ నేత ఎంత మందిని తరలించారనే విషయాలను ఇంటలిజెన్స్, స్పెషల్‌ పార్టీ వంటి నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు నమోదు చేసుకొని ప్రభుత్వానికి పంపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నిఘా సంస్థల కళ్లలో పడేందుకైనా నేతలు భారీ జనసమీకరణపై దృష్టి పెట్టారు.

ఒక్కో నియోజకవర్గం నుంచి 5–7వేలు
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఆదిలాబాద్, నిర్మల్‌ నుంచి భారీగా జన సమీకరణ జరిపే బాధ్యతలను మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి స్థానిక నాయకులకు అప్పగించారు. నియోజకవర్గం, మండలాల వారీగా ప్రతి గ్రామం నుంచి జనాన్ని హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని ఆదేశాలిచ్చారు. ఈ మేరకు మండల స్థాయి నాయకులను బాధ్యులుగా నియమించారు. మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మండల, గ్రామ నాయకులు ఎంత మందిని సమీకరించి సభకు తీసుకెళ్తారనే విషయాన్ని సేకరించారు.

ఈ మేరకు వాహనాలను ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆర్థిక రూపంలో వచ్చిన నిధులను కూడా సభ జరిగే రోజు అయ్యే ఖర్చుల కోసం మండల స్థాయి నాయకులకు పంపిణీ చేసినట్లు సమాచారం. ఒక్కో నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేలు కనీసంగా ఐదు వేల మందిని సమీకరించినా, మిగతా నాయకులు, వచ్చే ఎన్నికల్టో టిక్కెట్లు ఆశిస్తున్న నాయకులు మరో రెండు వేల మందిని సమీకరించినా... ఉమ్మడి జిల్లా నుంచి 70వేల మంది సభకు తరలివెళ్తారని నేతలు అంచనాకు వచ్చారు.

చెన్నూర్, బోథ్‌లలో ఎమ్మెల్యేలకు పోటీగా ఎంపీలు
పది నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరితో పాటు పలు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ టికెట్టు కోసం పోటీపడుతున్న వారు కూడా అధికంగానే ఉన్నారు. ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న ఇద్దరు నాయకులు ఈసారి అసెంబ్లీకే పోటీ చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ చెన్నూర్‌ నుంచి పోటీ చేయడం ఖాయమనే ధీమాతో నియోజకవర్గంలో జన సమీకరణపై దృష్టి పెట్టారు. ఇక్కడ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఇప్పటికే 50 ఆర్టీసీ బస్సులను బుక్‌ చేశారు.

ఒక్కో బస్సులో 50 మంది అనుకున్నా 2,500 మందికి ఆర్టీసీ బస్సులు సరిపోతాయి. ఇవికాక ప్రైవేటు వాహనాలు, స్కూల్‌ వాహనాలను కూడా సిద్ధం చేశారు. అలాగే సుమన్‌ కూడా తనదైన శైలిలో జనసమీకరణ జరిపే పనిలో పడ్డారు. చెన్నూర్, మందమర్రి, కోటపల్లి ప్రాంతాలతో పాటు సింగరేణి బెల్ట్‌లోని కార్మికులను భారీగా సభకు తరలించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈసారి బోథ్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు పావులు కదుపుతున్న ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేష్‌ బలపరీక్షకు పోటీ పడుతున్నారు. తన సత్తా చాటేలా భారీగా జనసమీకరణ జరిపేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఎమ్మెల్యేలతో బలపరీక్షకు...
ఖానాపూర్‌లో ఎమ్మెల్యే రేఖానాయక్‌ కేవలం తొమ్మిది ఆర్టీసీ బస్సులను మాత్రమే బుక్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే, టిక్కెట్టు ఆశిస్తున్న రాథోడ్‌ రమేష్‌ కూడా పోటాపోటీగా జనసమీకరణ జరిపే ప్రయత్నాల్లో ఉన్నారు. గతంలో ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రచారం జరిగిన రేఖానాయక్‌ భర్త శ్యామ్‌నాయక్‌ గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కుమురం భీం జిల్లా రవాణాశాఖ అధికారిగా ఉన్న ఆయనను ఆ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఆదిలాబాద్‌ పంపించారన్న అపప్రద ఉంది. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాలకు దూరంగా ఆదిలాబాద్‌లోనే విధులు నిర్వర్తిస్తున్నారు.

మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్‌రావు ప్రైవేటు వాహనాలు, స్కూలు బస్సుల మీద దృష్టి పెట్టగా, ఇక్కడినుంచి టిక్కెట్లు ఆశిస్తున్న టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మన్‌ పుస్కూరు రామ్మోహన్‌రావు, ఎంపీపీ బేర సత్యనారాయణ తదితరులు జనాన్ని తరలించే ప్రయత్నాల్లో ఉన్నారు. బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్యకే టికెట్‌ అని ఎంపీ సుమన్‌ చెప్పినప్పటికీ, టికెట్టు ఆశిస్తున్న గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ప్రవీణ్‌కుమార్‌ తన ప్రయత్నాలను మానలేదు. ఆయన కూడా బలపరీక్ష జరపాలనే ఆలోచనతోనే ఉన్నారు. ఇక్కడ దుర్గం చిన్నయ్య 50 బస్సులను బుక్‌ చేశారు. కుమురంభీం, నిర్మల్‌ జిల్లాల్లో ఎమ్మెల్యేలదే హవా కొనసాగనుంది.

620 ఆర్టీసీ బస్సుల్లో సభకు 452
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో కలిపి 620 బస్సులున్నాయి. వీటిలో శుక్రవారం నాటికి 452 బస్సులను సభ కోసం అద్దెకు తీసుకునేందుకు అడ్వాన్స్‌ను చెల్లించారు. ఆర్టీసీకి చెందిన ఎక్స్‌ప్రెస్‌ బస్సులో గరిష్టంగా 49 మంది, పల్లెవెలుగు, ఆర్డినరీ బస్సులో 52 మంది మాత్రమే కూర్చొనేందుకు సీటింగ్‌ కెపాసిటీ ఉంది. ఇంతకన్నా మించినా ఆర్టీసీ అదనపు చార్జీలు వసూలు చేస్తుంది. ఒక్కో బస్సుకు కిలోమీటరుకు రూ.43 చొప్పున కొంగరకలాన్‌ వెళ్లి వచ్చేందుకు రూ.26,800 ఆర్టీసీ వసూలు చేస్తోంది. అడ్వాన్స్‌ కింద మరో రూ.4వేలు తీసుకుంటున్నారు. సీటింగ్‌ కెపాసిటీని మించి ప్రయాణిస్తే అడ్వాన్స్‌ రూ.4వేల నుంచి మినహాయించుకునే వెసులుబాటు ఆర్టీసీకి ఉంది. ఈ లెక్కన ఇప్పటివరకు రూ.1.37 కోట్లు చెల్లించగా, మరో రూ.12 లక్షలు చెల్లించాల్సి ఉంది. శనివారం నాటికి మరిన్ని బస్సులు బుక్‌ అయ్యే అవకాశం ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top