సొంత రాష్ట్రానికే వెళ్తాం | power employees division : 55% of the relieved staff opted for AP | Sakshi
Sakshi News home page

సొంత రాష్ట్రానికే వెళ్తాం

Dec 11 2017 3:51 AM | Updated on Aug 18 2018 5:57 PM

power employees division : 55% of the relieved staff opted for AP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ విద్యుత్‌ సంస్థల నుంచి రిలీవైన ఏపీ స్థానికత గల విద్యుత్‌ ఉద్యోగుల్లో అత్యధిక శాతం మంది సొంత రాష్ట్రం ఏపీకి వెళ్లేందుకే మొగ్గు చూపారు. ఈ వివాదంపై హైకోర్టు జారీచేసిన మధ్యంతర ఆదేశాల మేరకు తెలంగాణ విద్యుత్‌ సంస్థలు రిలీవైన ఉద్యోగుల నుంచి గత నెలలో ఆప్షన్లు స్వీకరించగా, 55.12 శాతం మంది ఏపీకి, తెలంగాణకు 44.87 శాతం మంది ఆప్షన్లు ఇచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం విద్యుత్‌ ఉద్యోగుల విభజన ప్రక్రియకు ఏపీ విద్యుత్‌ సంస్థలు సహకరించడం లేదని ఆరోపిస్తూ తెలంగాణ విద్యుత్‌ సంస్థలు ఏకపక్షంగా తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల విభజన ప్రక్రియను చేపట్టి స్థానికత ఆధారంగా 2015 జూన్‌ 11న 1,252 మంది విద్యుత్‌ ఉద్యోగులను ఏపీకి రిలీవ్‌ చేశాయి. తెలంగాణ రిలీవ్‌ చేసిన ఉద్యోగులను ఏపీ విద్యుత్‌ సంస్థల్లో చేర్చుకోకపోవడం, రిలీవైన ఉద్యోగులు హైకోర్టులో కేసు వేయడంతో దాదాపు రెండున్నరేళ్లుగా ఈ వివాదం అపరిష్కృతంగా ఉండిపోయింది.

గత నెల 3న హైకోర్టు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు ఈ ఉద్యోగుల నుంచి తెలంగాణ విద్యుత్‌ సంస్థలు ఆప్షన్లు స్వీకరించి ఆ సమాచారాన్ని ఏపీ విద్యుత్‌ సంస్థలతో పంచుకున్నాయి. రిలీవైన ఉద్యోగుల్లో 619 మంది ఏపీకి, 504 మంది తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చారు. మరో నలుగురు తమ విషయంలో నిర్ణయాన్ని విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలకే వదిలేశారు. మరో 23 మంది రిటైర్డు కావడం, మరణించగా, మిగిలిన వారు ఆప్షన్లు ఇవ్వలేదని అధికారవర్గాలు తెలిపాయి. ఆప్షన్లు ఇచ్చిన వారిలో అధిక శాతం మంది సొంత రాష్ట్రం ఏపీలో పనిచేసేందుకే మొగ్గు చూపడం గమనార్హం. విద్యుత్‌ ఉద్యోగుల విభజన కేసుపై హైకోర్టులో జరిగే తదుపరి విచారణలో ఇరు రాష్ట్రాలు ఆప్షన్లు కేటాయించిన ఉద్యోగుల విషయంలో తమ అభిప్రాయాలను తెలపనున్నాయి.

ఎస్పీడీసీఎల్‌కే ఏపీ ఉద్యోగుల మొగ్గు
తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ నుంచి మొత్తం 1,252 మంది విద్యుత్‌ ఉద్యోగులు రిలీవై ప్రస్తుతం ఏ రాష్ట్రానికీ చెందని వారిగా డోలాయమానంలో ఉన్నారు. కోర్టు ఆదేశాలతో తెలంగాణ విద్యుత్‌ సంస్థలు ప్రతినెలా వీరికి రూ.12 కోట్ల జీతభత్యాలు చెల్లిస్తున్నప్పటికీ వారిని విధుల్లో చేర్చుకోకుండా ఖాళీగా కూర్చోబెట్టింది. వీరినుంచి ఏ పని తీసుకోకుండానే గత రెండున్నరేళ్లలో ఏకంగా రూ.300 కోట్ల జీతాలు చెల్లించింది. అయినా, వారితో పని చేయించుకునేందుకు ఇష్టపడడం లేదు. రిలీవ్‌ చేసిన వెంటనే ఏపీ సీఎం చంద్రబాబును కలవడం, హైకోర్టులో కేసులు వేసి తొందరపడ్డారని రిలీవైన ఉద్యోగుల తీరు పట్ల తెలంగాణ విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు అసంతృప్తిగా ఉండడమే దీనికి కారణం. దీనితో సంబంధాలు దెబ్బతిన్నాయి, రిలీవైన ఉద్యోగులను మళ్లీ తెలంగాణలో చేర్చుకున్నా ఇక్కడి ఉద్యోగులతో సఖ్యతతో పనిచేసే అవకాశం లేదని తెలంగాణ యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో అధిక మంది ఉద్యోగులు ఏపీకి ఆప్షన్‌ ఇచ్చారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ నుంచి రిలీవైన ఉద్యోగుల్లో 65.5 శాతం తెలంగాణకు ఆప్షన్‌ ఇవ్వగా, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ నుంచి రిలీవైన ఉద్యోగుల్లో 83.9 శాతం మంది ఏపీకి ఆప్షన్లు ఇవ్వడం గమనార్హం. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో పని చేసేందుకే అధిక శాతం రిలీవైన ఉద్యోగులు మొగ్గు చూపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement