కేసీఆర్ ఆరు నెలల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.
హైదరాబాద్ : కేసీఆర్ ఆరు నెలల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణలో 480 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి ప్రభుత్వానికి నోటీసు పంపిందని పొన్నాల ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఆసరా పథకం వృద్ధులు, వికలాంగులకు భద్రత కల్పించలేకపోయిందని పొన్నాల అన్నారు. కరెంట్ లేక తెలంగాణ చీకటిమయమైందని, రైతుల ఆత్మహత్యలతో పల్లెల్లో చావు డప్పులు తప్ప పండుగ డప్పు మోగలేదని ఆయన విమర్శించారు. కేసీఆర్ సర్కార్ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేకపోయిందని పొన్నాల అన్నారు.