అతివేగానికి కళ్లెం

Police Strategies To Prevent Accidents In Adilabad - Sakshi

జిల్లాలో 11 ప్రమాదకర స్థలాలు

వేగాన్ని లెక్కించేందుకు  స్పీడ్‌గన్ల ఏర్పాటు

వీటితో ఇంటివద్దకే ఈ–చలాన్‌

సాక్షి, ఆదిలాబాద్‌: అతివేగంతో ఎందరో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా వాహనదారులు మాత్రం వాటిని తుంగలో తొక్కడంతో అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో రోడ్డు ప్రమాదాలు సంభవించి అనేక మంది ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసు శాఖ అతివేగంగా వాహనాలు నడిపే వారికి కళ్లెం వేసింది.

స్పీడ్‌గన్‌తో వేగాన్ని లెక్కించి మితి మీరితే కొరడా ఝులిపించేందుకు సిద్ధమైంది. ఇటీవల పోలీసు అధికారులు జిల్లాకు రెండు స్పీడ్‌ కంట్రోల్‌ లెజర్‌ గన్స్‌ను తెప్పించారు. జాతీయ రహదారిపై ఎక్కువ ప్రమాదాలు సంభవించే ప్రాంతాలు, రద్దీ ఏరియాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అతివేగంగా వచ్చే వాహనాల ఫొటో తీసి డాప్లర్‌ సిద్ధాంతం ఆధారంగా స్పీడ్‌ లెజర్‌గన్‌ ద్వారా వేగాన్ని లెక్కిస్తారు. పరిమితికి మించి వేగం ఉంటే ఈ–చలాన్‌ ద్వారా ఇంటి వద్దకే జరిమానా రశీదులు పంపిస్తారు. 

గాలిలో కలుస్తున్న ప్రాణాలు
అతివేగంతో ఎన్నో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. దీంతోపాటు డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో 121 ప్రమాదాలు జరిగాయి. ఇందులో 33 మంది మృత్యువాత పడ్డారు. 70 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇవేకాకుండా అనధికారికంగా ప్రమాదాలు ఎన్నో సంభవించాయి.

అయితే వీటిని నివారించేందుకు పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో 11 ప్రమాదకర స్థలాలను గుర్తించింది. ఈ ప్రాంతాల్లో స్పీడ్‌గన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం దేవాపూర్‌ చెక్‌పోస్టు, భోరజ్‌ చెక్‌పోస్టు, చాంద బ్రిడ్జి, తదితర ప్రాంతాల్లో స్పీడ్‌గన్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదాలు ఎక్కువగా గుడిహత్నూర్‌ నుంచి నేరడిగొండ, దేవాపూర్‌ చెక్‌పోస్టు, భోరజ్‌ ప్రాంతాల్లోనే జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

స్పీడ్‌కు కళ్లెం..
స్పీడ్‌గన్‌తో వాహనాల మితిమీరిన వేగానికి చెక్‌ పడే అవకాశం ఉంది. వాహనాలు మితిమీరిన వేగంతో వెళితే స్పీడ్‌గన్‌తో దాని వేగాన్ని లెక్కించి ఈ–చలాన్‌ ద్వారా ఇంటి వద్దకే జరిమానాలు పంపుతారు. రూ.వెయ్యి నుంచి రూ.1400 వరకు జరిమానా విధిస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు. 14 కంటే ఎక్కువ జరిమానాలు పడిన వ్యక్తి డబ్బులు చెల్లించకుంటే పోలీసులు సంబంధిత వాహన యజమానులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెడతారు.

జరిమానా మొత్తంతోపాటు ఫెనాల్టీ కడితేనే వదిలిపెడతారు. అయితే సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనం నడిపితే రూ.వెయ్యి, రాంగ్‌రూట్‌లో వాహనం నడిపిస్తే రూ.1100, హెల్మెట్‌ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే రూ.100, ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్తే రూ.1200, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుంటే రూ.500, వాహనానికి బీమా లేకుంటే రూ.వెయ్యి, పొల్యూషన్‌ ధ్రువీకరణ పత్రం లేకుంటే రూ.వెయ్యి, వాహనానికి నంబర్‌ ప్లేట్‌ లేకుంటే రూ.100, మైనర్లు వాహనం నడిపితే రూ.వెయ్యి, పరిమితికి మించి వేగంగా వెళితే రూ.1400 జరిమానా విధిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లాలో ప్రస్తుతం ఈ–చలాన్‌ విధానం ద్వారానే ఈ జరిమానాలు విధిస్తున్నారు. అజాగ్రత్త, నిబంధనలు అతిక్రమించే వారిపై జరిమానాల రూపంలో కొరడా ఝులిపిస్తున్నారు. 

నిబంధనలు పాటించాలి
వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి. ఏ రోడ్డులో ఎంత వేగంతో వెళ్లాలనే విషయం సైన్‌బోర్డులపై ఉంటుంది. ఆ వేగానికి మించి వెళ్తేస్పీడ్‌గన్‌ల ద్వారా ఈ–చలాన్‌ రూపంలో జరినామాలు విధిస్తాం. వాహనదారులు మితిమీరిన వేగంతో వెళ్లొద్దు. దీంతో ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. వాహనపత్రాలు, లైసెన్స్‌ లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడపరాదు. ప్రస్తుతం జాతీయ రహదారిపై ఈ స్పీడ్‌గన్‌లను ఏర్పాటు చేశాం.
– విష్ణు ఎస్‌.వారియర్, ఎస్పీ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top