సైకిల్‌ పెట్రోలింగ్‌!

Police New Street Bicycle Petroling In Hyderabad - Sakshi

పోలీసుల కొత్త రూట్‌

గల్లీల్లోనూ గస్తీ నిర్వహణకు ఆస్కారం

కాలుష్యానికి తావు లేకుండా చర్యలు

ప్రజలతోనూ సన్నిహిత సంబంధాలు

ప్రయోగాత్మకంగా పంజగుట్ట పరిధిలో ఐదు సైకిళ్లు

సిటీ పోలీస్‌ ఇక సైకిల్‌ బాట పడుతున్నారు. స్ట్రీట్‌ బైస్కిల్‌ పెట్రోలింగ్‌ (ఎస్‌బీపీ) పేరిట కాలనీలు, గల్లీల్లో గస్తీ నిర్వహణకు ప్రత్యేక సైకిళ్లు వినియోగించాలని నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా పంజగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఐదు సైకిళ్లను సోమవారం నుంచి వినియోగిస్తున్నారు. బ్లూకోల్ట్స్, ఇన్నోవాలు, ఇంటర్‌సెప్టార్‌ వాహనాలు వెళ్లలేని గల్లీల్లోనూ గస్తీ చేపట్టేందుకు ఈ సైకిళ్లు ఉపయోగపడతాయని, ఇంధనం అవసరం లేని కారణంగా ఇవి పర్యావరణ హితమైనవి కూడా అని పోలీస్‌ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. దశలవారీగా వీటి వినియోగాన్ని విస్తరిస్తామని తెలిపారు.    

సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుతం నగర పోలీసు విభాగం గస్తీ కోసం బ్లూకోల్ట్స్‌గా పిలిచే ద్విచక్ర వాహనాలు, రక్షక్‌లుగా పిలిచే ఇన్నోవాలు వినియోగిస్తోంది. వీటికి తోడు ఒక్కో సబ్‌–డివిజన్‌లో ఒకటి చొప్పున ఇంటర్‌సెప్టర్‌ వాహనాలు తిరుగుతున్నాయి. ఇవన్నీ పెట్రోల్‌ లేదా డీజిల్‌ ఇంధనంగా పని చేస్తూ అత్యంత వేగంగా దూసుకుపోయేవి. వీటివల్ల కాలుష్యంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ప్రతి ప్రాంతంలోనూ ఉన్న మారుమూల గల్లీల్లోకి వీటి ద్వారా వెళ్ళడం సాధ్యం కాదు. కొన్ని సందర్భాల్లో మౌంటెడ్‌ పోలీసుగా పిలిచే అశ్వక దళాన్ని వాడుతున్నా.. అన్ని సందర్భాల్లోనూ ఇది అనువైంది కాదు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ పెట్రోలింగ్‌ కోసం ప్రత్యేకమైన సైకిల్స్‌ సమీకరించుకోవాలని నిర్ణయించారు. బ్యాటరీ సాయంతో పని చేసే ఈ బై సైకిల్స్‌ను ప్రయోగాత్మకంగా పంజగుట్ట ఠాణా పరిధిలో సోమవారం ప్రారంభించారు. తొలి దశలో ఐదు సైకిళ్లలో స్ట్రీట్‌ బైస్కిల్‌ పెట్రోలింగ్‌ (ఎస్‌బీపీ) పేరుతో ఇది మొదలైందని ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రవీందర్‌ ‘సాక్షి’కి తెలిపారు. ఎంఎస్‌ మక్తా, బీఎస్‌ మక్తా, ఎల్లారెడ్డిగూడ, ఆనంద్‌నగర్‌కాలనీ, సోమాజిగూడల్లోని స్లమ్స్, గల్లీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎస్‌బీపీ వ్యవస్థ పని చేస్తుందని వివరించారు.

అవసరాలకు తగ్గట్టు ఏర్పాట్లు...
ఈ సైకిళ్లను గస్తీ పోలీసుల దైనందిన అవసరాలకు తగ్గట్లు డిజైన్‌ చేశారు. వీటిని వినియోగించడం ద్వారా గస్తీ సిబ్బంది ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు బ్లూకోల్ట్సŠ, రక్షక్‌లు చేరలేని ప్రాంతాలకూ ఇవి వెళ్తాయి. లాఠీ, వాటర్‌బాటిల్, సైరన్‌లతో పాటు జీపీఎస్‌ విధానం కూడా ఈ సైకిళ్లకు ఉంటుంది. వాకీటాకీ, సెల్‌ఫోన్, డైరీలను తమ వెంట తీసుకువెళ్ళడానికి అనువుగా ఏర్పాట్లు చేశారు. ఉదయం ఠాణా నుంచి గస్తీకి బయలుదేరిన సిబ్బంది సాయంత్రం వరకు ఈ సైకిల్‌ పైనే తిరుగుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వారికి అలసట లేకుండా అద్భుతంగా పని చేసే షాక్‌ ఎబ్జార్వర్స్, బ్రేకింగ్‌ సిస్టం దీనికి ఉన్న అదనపు ఆకర్షణలు. ఈ సైకిల్‌కు వెనుక భాగంలో ఏర్పాటు చేసిన పెట్టెలో ప్రథమ చికిత్స ఉపకరణాలతో పాటు క్రైమ్‌ సీన్‌ను రక్షించడానికి ఉపయోగించేవీ, సైరన్‌ ఏర్పాటు చేశారు. మారుమూల ప్రాంతం లో నేరం జరిగినప్పుడు తక్షణం అక్కడు వెళ్ళే ఎస్‌బీపీ సిబ్బంది తక్షణం సహాయక చర్యలు చేపట్టడానికి, నేర స్థలిని రక్షించడానికి ఇవి ఉపకరిస్తాయి. 

భవిష్యత్‌లో ఎస్‌బీపీ విస్తరణ...
దేశంలోనే బెస్ట్‌ ఠాణాగా నిలిచిన పంజగుట్ట నుంచి ఈ ఎస్‌బీసీని ప్రారంభించారు. భవిష్యత్తులో మరింత విస్తరించాలని నగర పోలీసులు భావిస్తున్నారు. టూరిస్ట్‌ స్పాట్స్‌లో పోలీసింగ్, పెట్రోలింగ్‌ కోసం వినియోగించనున్నట్లు తెలిసింది. రెండో దశలో టూరిస్ట్‌లు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో గస్తీ కోసం వినియోగిస్తారు. ట్యాంక్‌బండ్‌ చుట్టూ సంచరించే లేక్‌ పోలీసులతో పాటు కేబీఆర్‌ పార్క్, పెడస్ట్రియన్‌ ప్రాజెక్టు అమలవుతున్న చార్మినార్, కుతుబ్‌షాహీ టూంబ్స్, గోల్కొండ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించే బృందాలకు కేటాయించాలని భావిస్తున్నారు. టూరిజం పోలీసింగ్‌కు మాత్రమే కాకుండా బందోబస్తులు, ఊరేగింపుల సమయంలోనూ వినియోగించనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top