దారి తప్పుతున్న నాలుగోసింహం

Police Conistable Illigal Activities In Adilabad - Sakshi

సాక్షి, నిర్మల్‌ : భద్రత మాదే..బాధ్యత మాదే.. ఉన్నది మేం మీ కొరకే.. రాత్రని లేదు.. పగలని లేదు..’ అంటూ పీపుల్స్‌ ఫ్రెండ్లీ పోలీసుగా ఆ శాఖ గుర్తింపు తెచ్చుకుంటోంది. కానీ.. అదే శాఖలో కొంతమంది ఖాకీల తీరు మొత్తం వ్యవస్థకే కళంకం తెస్తోంది. ఇటీవల కొంతమంది పోలీసు సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ఫ్రెండ్లీ పోలీసుకు వ్యతిరేక అర్థాన్నిస్తున్నాయి. ఓ వైపు ఉన్నతాధికారులు జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు శాయశక్తులా కృషిచేస్తుంటే.. కొంతమంది కిందిస్థాయి కానిస్టేబుళ్లు మాత్రం ‘ఖాకీ’ చొక్కాను అడ్డుపెట్టుకుని అడ్డదారులు తొక్కుతున్నారు.

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడి..
పోలీస్‌శాఖలో పలువురు కానిస్టేబుళ్లు అడ్డదారులు తొక్కుతున్నారన్న విషయం రెడ్‌హ్యాండెడ్‌గా బయట పడింది. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోనే ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీఎస్‌(సెంట్రల్‌ క్రైం స్టేషన్‌) కానిస్టేబుల్‌ ఎబ్‌నైజర్‌ ఓ గుర్తు తెలియని యువతితో నిర్మల్‌లోని ఓ లాడ్జిలో ఉండగా.. స్థానిక యువకులు రెడ్‌హ్యాండెడ్‌గా  పట్టుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన వారే ఇలా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీనిపై పోలీసుల వివరణ మరోలా ఉంది. హైదరాబాద్‌ నుంచి నిర్మల్‌ వచ్చిన సదరు యువతి తన ఊరికి వెళ్లాల్సిన బస్సు వెళ్లిపోవడంతో బస్టాండ్‌లోనే ఉండిపోయింది. పలువురు వ్యక్తులు ఆమెను వేధిస్తున్నట్లు సీసీఎస్‌ పోలీసుల దృష్టికి వచ్చింది. ఈమేరకు కానిస్టేబుల్‌ ఎబ్‌నైజర్‌ ఆమె వద్దకు వెళ్లి, బస్సు అందుబాటులో లేకపోవడంతో సమీపంలోని లాడ్జీలో ఉంచేందుకు తీసుకెళ్లినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఏది ఏమైనా.. ఓ కానిస్టేబుల్‌ ఇలా లాడ్జీలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో చర్చనీయాంశంగా మారింది.

సస్పెన్షన్‌ దాకా..
అసాంఘిక చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన కానిస్టేబుల్‌ ఎబ్‌నైజర్‌ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆదివారం జరిగిన ఘటనపై మీడియా, సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఎస్పీ శశిధర్‌రాజు మంగళవారం ఎబ్‌నైజర్‌కు సస్పెన్షన్‌ ఉత్తర్వులను జారీ చేశారు. ఖానాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా ఉన్న ఎబ్‌నైజర్‌ ప్రస్తుతం సీసీఎస్‌ అటాచ్డ్‌ కానిస్టేబుల్‌గా కొనసాగుతున్నారు. లాడ్జీలో ఉండగా స్థానిక యువకులు వీడియోలు తీయడంతో పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది. 

దారితప్పుతున్న ఖాకీ..
ఓ వైపు ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసు విధానం అమలు చేస్తోంది. పోలీసులకు ఇటీవలే వీక్లీ ఆఫ్‌ కూడా ప్రకటించింది. కానీ.. డిపార్ట్‌మెంట్‌ పేరు చెప్పి ప్రజల్లో ఉన్న కాసింత భయాన్ని కొంతమంది తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఖాకీ చొక్కాకు ఉన్న విలువను దిగజార్చేలా ప్రవర్తిస్తున్నారు. నెలవారీగా వసూళ్లు, శాఖ పేరు చెప్పి డబ్బులు తీసుకోవడం, కేసులు వస్తే తమకు లాభం చేకూరేలా వ్యవహరించడం.. ఇలా పలువురు కానిస్టేబుళ్ల వ్యవహారం నడుస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణలో తలమునకలైన ఉన్నతాధికారుల దాకా వీరి వ్యవహారం వెళ్లడం లేదు. కొంతమంది అధికారులకు తెలియకుండా తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. . 

చిన్నకేసులేనా..?
జిల్లాలో పేకాట ఆడేవారిని పట్టుకునే పోలీసులు.. మట్కా, గుట్కావంటి పెద్ద దందాలను నడిపే వారిని ఎందుకు వదిలేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొంతమంది అధికారం అండదండలతో దొంగ దందాలు నడుపుతున్నారన్న విషయం తెలిసినా.. అడ్డుకోవాల్సిన పోలీసులు ‘మాములు’గా తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చిన్నపాటి పేకాట కేసులను పెద్దగా చూపే పోలీసులకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారిన పలు లాడ్జీలపై ఇప్పటివరకు ఎందుకు దృష్టి పెట్టలేదన్న విమర్శలు వస్తున్నాయి. జిల్లాకేంద్రంలోని బస్టాండ్‌లోనే ఏడాదిలో దాదాపు యాభైకిపైగా దొంగతనాలు జరిగాయి. ఇందులో రికవరీ చేసింది పదిలోపే ఉన్నాయి. మిగతా వాటి సంగతి ఏమవుతోంది..? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. సమాజ రక్షకులుగా కొండంత అండగా నిలబడే పోలీస్‌ శాఖకు కళంకం తెచ్చే కొందరిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరమూ ఉంది.

చర్యలు తప్పవు.. 
పోలీస్‌శాఖకు మచ్చతెచ్చేలా ఎవరు ప్రవర్తించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. సీసీఎస్‌ కానిస్టేబుల్‌పై వచ్చిన ఆరోపణల మేరకు కేసు నమోదుతోపాటు సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేశాం. ప్రజలతో ఫ్రెండ్లీగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయడానికే ప్రతి పోలీసూ ప్రయత్నించాలని చెబుతున్నాం. 
– శశిధర్‌రాజు, ఎస్పీ, నిర్మల్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top