గత ఐదు రోజులుగా జంట నగరాల్లో పేరుకుపోతున్న చెత్తను తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ తగిన చర్యలు తీసుకోవడంలేదంటూ దాఖలైన పిల్‌పై గురువారం హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
హైదరాబాద్ : గత ఐదు రోజులుగా జంట నగరాల్లో పేరుకుపోతున్న చెత్తను తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ తగిన చర్యలు తీసుకోవడంలేదంటూ దాఖలైన పిల్‌పై గురువారం హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ విచారణలో.. జంట నగరాల్లో పేరుకుపోతున్న చెత్తను తొలగించేందుకు చర్యలు చేపట్టామని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) గురువారం హైకోర్టుకు నివేదించింది.
ప్రైవేటు ఏజెన్సీల ద్వారా చెత్తను తొలగిస్తున్నామని, ఇందుకు పారిశుద్ధ్య కార్మికుల సేవలను కూడా వాడుకుంటున్నామని జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది పి.కేశవరావు కోర్టుకు వివరించారు. ఈ వివరాలను నమోదు చేసుకున్న కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.