జల కళ | peoples are happy with the rains | Sakshi
Sakshi News home page

జల కళ

Jul 29 2014 2:14 AM | Updated on Oct 1 2018 2:03 PM

ఎడతెరపి లేకుండా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో జిల్లాలో వాగులు, వంకలు జళకళ సంతరించుకున్నాయి. ఈ వర్షం అన్ని పంటల సాగుకు అనుకూలం కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, ఖమ్మం: ఎడతెరపి లేకుండా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో జిల్లాలో వాగులు, వంకలు జళకళ సంతరించుకున్నాయి. ఈ వర్షం అన్ని పంటల సాగుకు అనుకూలం కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక వర్షపాతం. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కలిపి సోమవారం 270 సెం.మీ వర్షం పడింది. అత్యధికంగా చింతూరులో 15.3 సెం.మీ, అత్యల్పంగా దమ్మపేటలో 1.6 సెం.మీ వర్షపాతం నమోదైంది.

జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు పడుతుండడంతో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలోకి కొంతమేర నీరు చేరింది. కొత్తగూడెం, పాల్వంచ పరిధిలో ముర్రేడు, కిన్నెరసాని నదులు ఓ మోస్తరుగా ప్రవహిస్తున్నాయి. కొత్తగూడెం మండలంలోని సింగభూపాలెం చెరువు పూర్తిగా నిండిపోయింది. వర్షంతో సింగరేణి ఓపెన్‌కాస్టు గనుల్లోకి వరద నీరు చేరడంతో ఉత్పత్తి స్తంభించిపోయింది. కొత్తగూడెం రీజియన్‌లోని కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాలో 53 వేల టన్నుల మేర ఉత్పత్తికి నష్టం వాటిల్లింది.
 
భద్రాచలం డివిజన్‌లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నుంచి 9 గేట్లను ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. గుండాల మండలంలోని మల్లన్న వాగు, జల్లేరులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో గుండాల మండల కేంద్రానికి మండలంలోని ఇతర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లో చిరుజల్లులు కురిశాయి. అశ్వారావుపేట మండలంలోని పెదవాగు ప్రాజెక్టు నీటిమట్టం 17 అడుగులకు చేరింది.
 
పూర్తిస్థాయి నీటిమట్టం 21 అడుగులకు ఈరాత్రికి చేరే అవకాశముంది. ఎగువ ప్రాంతంలోని నందిపాడు, తిరుమలకుంట, కావడిగుండ్ల ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్ నిండే అవకాశముందని సంబంధిత శాఖ అధికారులు చెపుతున్నారు. తాగు, సాగునీటికి ఉపయోగించే అంకమ్మ చెరువు అలుగు వరకు నీళ్లు చేరాయి. ముల్కలపల్లి మండలంలోని మూకమామిడి ప్రాజెక్టులోకి వర్షపు నీరు తక్కువ గా చేరింది. ఇలాగే రెండు రోజులు వర్షాలు కురిస్తే రిజర్వాయర్ నిండనుంది.
 
కుక్కునూరు మండలంలోని గుండేటి వాగు ఉధృతంగా ప్రవహించడంతో కుక్కునూరు, బెస్తగూడెం గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. వేలేరుపాడు మండలంలోని యడవల్లి వద్ద ఎద్దువాగుపై బ్రిడ్జి నీటమునిగింది. దీంతో కోయిదా- వేలేరుపాడు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వైరా రిజర్వాయర్‌లోకి వరద నీరు వచ్చి చేరడంతో నీటిమట్టం 12.3 అడుగులకు చేరుకుంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement