ఓటేయడానికి పోటెత్తారు! | People Starts To Natives For Casting Votes | Sakshi
Sakshi News home page

ఓటేయడానికి పోటెత్తారు!

Apr 10 2019 3:27 AM | Updated on Apr 10 2019 8:54 AM

People Starts To Natives For Casting Votes - Sakshi

సొంతూళ్లో ఓటేసేందుకు నగరవాసులు మంగళవారం కూడా భారీగా పోటెత్తారు.

సాక్షి, హైదరాబాద్‌: సొంతూళ్లో ఓటేసేందుకు నగరవాసులు మంగళవారం కూడా భారీగా పోటెత్తారు. పెద్దసంఖ్యలో తమ ఊళ్లకు పయనమయ్యారు. దీంతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోయాయి. రెగ్యులర్‌ రైళ్లతో పాటు వేసవి రద్దీ దృష్ట్యా ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలోనూ రిజర్వేషన్లు నిండిపోవడంతో చాలామంది జనరల్‌ బోగీలను ఆశ్రయించారు. విజయవాడ, విశాఖ, కాకినాడ తదితర ప్రాంతాలకు బయల్దేరిన రైళ్లలో సాధారణ బోగీలు సామర్థ్యానికి మించిన ప్రయాణికులతో కిటకిటలాడాయి. మరోవైపు హైదరాబాద్‌ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు బయలుదేరే ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సుల్లోనూ ప్రయాణికులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఏపీఎస్‌ఆర్టీసీతో పాటు తెలంగాణ ఆర్టీసీకి చెందిన సుమారు 1500 బస్సులు ప్రతిరోజూ హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి.

రద్దీ నేపథ్యంలో మంగళవారం ఒక్కరోజే వందకు పైగా బస్సులను అదనంగా నడిపినట్లు అధికారులు తెలిపారు. అలాగే నగరం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు వెయ్యి ప్రైవేట్‌ బస్సులు కూడా కిక్కిరిసిపోయాయి. ఈ రద్దీని సొమ్ము చేసుకొనేందుకు పలు ట్రావెల్స్‌ సంస్థలు యథావిధిగా తమ దోపిడీ కొనసాగించాయి. సాధారణ రోజుల్లో విధించే చార్జీలను రెట్టింపు చేశాయి. కొంతమంది ఆపరేటర్లు ఏకంగా రెండు రెట్లు పెంచేశారు. బస్సులు, రైళ్లతో పాటు కార్లు, ఇతర వ్యక్తిగత వాహనాల్లోనూ జనం తరలి వెళ్లారు. ఏపీలోని సొంత ఊళ్లలో ఓటుహక్కు కలిగి ఉన్న నగరవాసులు దాదాపు 15 లక్షల మంది ఉంటారని అంచనా. వారిలో మంగళవారం ఒక్కరోజే వివిధ మార్గాల్లో దాదాపు 7 లక్షల మందికి పైగా వెళ్లినట్టు తెలుస్తోంది. (చదవండి: చలో ఆంధ్రా!)

నేడు తెలంగాణ జిల్లాలకు.. 
మరోవైపు గురువారం జరగనున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా బుధవారం తెలంగాణ జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నగరంలో స్థిరపడినప్పటికీ, సొంత ఊళ్లోనే ఓటు హక్కు కలిగిన ఉన్న లక్షలాది మంది నగరవాసులు బుధ, గురువారాల్లో హైదరాబాద్‌ నుంచి తరలి వెళ్లనున్నారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, సంగారెడ్డి, తదితర ప్రాంతాలకు రద్దీకి అనుగుణంగా మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్‌ల నుంచి, ఉప్పల్‌ రింగ్‌రోడ్డు, ఎల్‌బీనగర్‌ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను 
నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 

ప్రైవేట్‌ వాహనాలకు గిరాకీ... 
రెగ్యులర్‌ రైళ్లలో బుకింగ్‌లు ఎప్పుడో నిలిచిపోగా, ప్రత్యేక రైళ్లలో వెయిటింగ్‌ లిస్టు భారీగా పెరిగింది. ఇక ప్రైవేట్‌ బస్సులు, ఆర్టీసీ బస్సుల్లోనూ డిమాండ్‌ విపరీతంగా ఉండడంతో చాలామంది ట్రావెల్స్‌ నుంచి కార్లు, మినీ బస్సులు తదితర వాహనాలను బుక్‌ చేసుకొని ఓటేయడానికి వెళుతున్నారు. నగరంలో ఉన్న ఓటర్లను ఊళ్లకు రప్పించేందుకు కొంతమంది నాయకులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఓలా, ఉబెర్‌ వంటి క్యాబ్‌ సంస్థలకు అనుసంధానంగా నడిపే కారు డ్రైవర్లు సైతం తమ సొంత వాహనాలను ఏపీ వైపు మళ్లిస్తున్నారు.

ప్రయాణికుల డిమాండ్, రద్దీ బాగా ఉండడంతో చార్జీలను అమాంతంగా పెంచేశారు. ఈ నెల 8వ తేదీ నుంచి 13 వరకు 80 శాతం వాహనాలు ఏపీలోని వివిధ ప్రాంతాలకు బుక్‌ అయినట్టు నగరానికి చెందిన ఒక ట్రావెల్స్‌ నిర్వాహకుడు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ, ఏలూరు, విశాఖపట్టణం, అమలాపురం, తిరుపతి, పొద్దుటూరు, కడప, ఉభయ గోదావరి జిల్లాలు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని ప్రైవేట్‌ బస్సుల్లో డిమాండ్‌ బాగా పెరిగింది. దీంతో ప్రైవేట్‌ బస్సుల దారిదోపిడీ సైతం తారాస్థాయికి చేరింది. హైదరాబాద్‌ నుంచి ఒంగోలుకు సాధారణంగా అయితే రూ.550 వరకు చార్జి ఉండగా.. ప్రస్తుతం ఆ టికెట్‌ ధరను ఏకంగా రూ.2వేల నుంచి రూ.2,500 వరకు పెంచేశారు. దాదాపు అన్ని మార్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement