
హుజూర్‌నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది.
సాక్షి, హైదరాబాద్ : హుజూర్‌నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు సోనియా గాంధీ ఆమోదముద్ర వేయడంతో, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ఆమె అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 21న జరగనుంది. 24వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ చేపడతారు. సెప్టెంబర్ 23 నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్ 1న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 3 వరకు ఉపసంహరణ జరగనుంది.
హుజూర్‌నగర్ నియోజకవర్గానికి సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదుపరి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. దేశ వ్యాప్తంగా 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనుండగా తెలంగాణలో ఏకైక స్థానం హుజూర్‌నగర్‌కు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సిట్టింగ్ స్థానం మళ్లీ దక్కించుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.