'ప్రశ్నించే ప్రతిపక్షాన్ని గెలిపించాలి'

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, అధికార టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు కోరారు. ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ వైస్ ఛైర్మన్ కోదండరెడ్డితో కలిసి భట్టి విక్రమార్క మల్లు శుక్రవారం సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. హుజూర్‌నగర్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉత్తమ్ పద్మావతి రెడ్డి కచ్చితంగా విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొందని ఈ సందర్బంగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఉప ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యయుత వాతావరణంలో జరిపించాలని అధికారులు భట్టి కోరారు. సామాన్యులను, మేధావులను, జర్నలిస్టులను, ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో ప్రభుత్వం తరఫున ప్రతి మండలానికి ఒక మంత్రి, ప్రతి గ్రామానికి ఒక ఎమ్మెల్యేని పెట్టి అధికారాన్ని దుర్వినియోగం చేసి మరీ గెలవాలని టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందని భట్టి ఆరోపించారు. డబ్బు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని విజయం సాధించేందుకు కుటిల ప్రయత్నం చేస్తోందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.
హుజూర్‌నగర్ నియోజకవర్గానికి చెందిన నాయకుడు, ప్రస్తుతం మండలి ఛైర్మన్‌గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి.. రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్న విషయాన్ని మర్చిపోయి.. అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తున్నారని భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయి అనంతరం పార్టీ మారడాన్ని తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో విలువైన ఓటు హక్కును కాపాడాలని భట్టి విక్రమార్క మీడియా ముఖంగా గవర్నర్ తమళసై సౌందరాజన్‌ను అభ్యర్థించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి