నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట హైటెక్ బస్టాండులో బుధవారం అర్థరాత్రి జరిగిన కాల్పుల ఘటనలో గాయపడ్డ సీఐ మొగిలయ్యకు చేసిన ఆపరేషన్ పూర్తియినట్టు కిమ్స్ వైద్యులు వెల్లడించారు.
హైదరాబాద్/నల్లగొండ: దుండగుల కాల్పుల ఘటనలో గాయపడ్డ సీఐ మొగిలయ్యకు చేసిన ఆపరేషన్ పూర్తియినట్టు కిమ్స్ వైద్యులు వెల్లడించారు. గురువారం దాదాపు నాలుగు గంటలపాటు ఏడుగురు వైద్యుల బృందం చికిత్స నిర్వహించినట్టు తెలిపారు. శరీరంలో ఇరుకున్న రెండు బుల్లెట్లును తీశామని చెప్పారు. మరో 48గంటలపాటు సీఐ మొగులయ్యను తమ పరిశీలనలో ఉంచామన్నారు. అలాగే దుండగుల కాల్పుల్లో గాయపడ్డ హోంగార్డ్ కిశోర్కు కాసేపట్లో చికిత్స నిర్వహిస్తామని కిమ్స్ వైద్యులు తెలిపారు.
నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట హైటెక్ బస్టాండులో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులపై కొందరు దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో కానిస్టేబుల్ లింగయ్యతో పాటు హోంగార్డు మహేశ్ అక్కడికక్కడే మృతిచెందారు. సీఐ మొగిలయ్య, కానిస్టేబుల్ అరవింద్, హోంగార్డు కిశోర్ తీవ్రంగా గాయపడ్డారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన సీఐ మొగలయ్యతో పాటు ఆయన గన్ మెన్ పరిస్థతి విషమంగా ఉండటంతో వారినీ హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే.