అన్నీ ప్రాధాన్యమే.. వేటికి ముందు!  | Officials stranding about irrigation projects debts Payments | Sakshi
Sakshi News home page

అన్నీ ప్రాధాన్యమే.. వేటికి ముందు! 

Jan 13 2019 2:17 AM | Updated on Mar 22 2019 2:57 PM

Officials stranding about irrigation projects debts Payments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాగునీటి శాఖలో నిర్మాణం కొనసాగుతున్న ప్రాజెక్టులకు నిధుల చెల్లింపులపై అధికారుల్లో మథనం మొదలైంది. పనులకు చెల్లించాల్సిన పెండింగ్‌ బకాయిలు భారీగా ఉండటం, అందుకు తగ్గట్లు నిధుల విడుదల జరగకపోవడంతో వారు కిందామీద పడుతున్నారు. ప్రాజెక్టుల ప్రాధాన్యతను గుర్తించి అందుకు తగ్గట్లే నిధులను విడుదల చేయడం అధికారులకు కత్తిమీద సాములా మారింది. తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించగా, అన్నీ ప్రాధాన్యతవే అంటూ ఆయా ప్రాజెక్టుల ఇంజనీర్లు నివేదిక ఇస్తుండటంతో ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. 

భారీగా పేరుకుపోయిన బకాయిలు.. 
సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో ప్రస్తుతం ఏకంగా రూ.7,683 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోనే రూ.967 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయి. వచ్చే ఖరీఫ్‌ నాటికి పూర్తి చేసి నీళ్లిచ్చే ప్రాజెక్టుల జాబితాలో ఉన్న దేవాదులలో రూ.668 కోట్లు, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమాలో కలిపి మరో రూ.400 కోట్లు, డిండిలో రూ.319 కోట్లు, సీతారామలో రూ.126 కోట్లు, ఎల్లంపల్లిలో రూ.321 కోట్లు, పెన్‌గంగలో రూ.84 కోట్లుండగా, అత్యధికంగా పాలమూరు–రంగారెడ్డి పరిధిలో రూ.1,607కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవిగాక మిషన్‌ కాకతీయకు సంబంధించి సైతం రూ.877 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఆర్థిక శాఖను నీటిపారుదల శాఖ అధికారులు అడిగినప్పుడల్లా నిధుల విడుదలపై దాటవేత ధోరణే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమీక్ష సందర్భంగా నిధుల అవసరాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రాధాన్యతా క్రమాన్ని బట్టి నిధులు విడుదల చేయాలని, పాలమూరు–రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు రుణాలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో వేటికి తక్షణ అవసరముంటుందో, ఆ వివరాలు పంపాలని ప్రాజెక్టుల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  

దేవాదుల నుంచి ఎల్లంపల్లి వరకు.. 
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఇంజనీర్లు తక్షణ నిధుల అవసరంపై నివేదికలు సమర్పిస్తున్నారు. ఇందులో తమ పరిధిలో అన్నీ ప్రాధాన్యత ఉన్నవేనని, వాటికి తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. దేవాదులకు ఏకంగా రూ. 511 కోట్లు చెల్లిస్తేనే పనులు ముందుకు కదులుతాయంటూ అధికారులు నివేదించగా, ఆదిలాబాద్‌లోని పెన్‌గంగ, చనాకా–కొరటాతో పాటు ఇతర మధ్యతరహా ప్రాజెక్టులకు కలిపి రూ.120 కోట్లు వెంటనే ఇవ్వాలని ఆ జిల్లా అధికారులు విన్నవించారు. సీతారామ కింద ఈ ఖరీఫ్‌ నుంచే నీటిని ఆయకట్టుకు పారించాలంటే పెండింగ్‌ బిల్లుల్లో రూ.120 కోట్లు ఇవ్వాలని అక్కడి నుంచి వినతులు వచ్చాయి. ఎస్సారెస్పీ తొలి దశకు రూ.110 కోట్లు, ఎల్లంపల్లికి రూ.60 కోట్లు, మిషన్‌ కాకతీయకు తక్షణంగా రూ.150 కోట్లు ఇవ్వాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ వినతులపై శాఖ ఈఎన్‌సీలతో సీఎస్‌ ఎస్‌కే జోషి, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు చర్చలు జరపనున్నారు. అక్కడ వడపోత చేశాకే నిధుల విడుదల జరుగనుంది. 

‘పాలమూరు’రుణాలపై కదలిక.. 
ఇక పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఈ దఫా ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని ఇటీవల సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దీనికి అవసరమైన రుణాలను పొందే ప్రక్రియను వేగిరం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు మొత్తంగా రూ.17,570 కోట్ల మేర రుణాలు కావాలంటూ ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ రమేశ్‌ ఈఎన్‌సీకి లేఖ రాశారు. ఈఎన్‌సీ నుంచి రుణాల ప్రతిపాదన లేఖ ప్రభుత్వానికి వెళ్లనుంది. అక్కడ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన వెంటనే రుణాల ప్రక్రియ మొదలు కానుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement