కరుణ లేకపాయె

Officials Stops Money Distribution in Hyderabad - Sakshi

రూ.1500 ఆర్థిక చేయూతకు నోచుకోని పేదలు  

హామీని విస్మరించిన పౌరసరఫరాల శాఖ

వరుసగా 3 నెలలు రేషన్‌ తీసుకోనివారికి రిక్తహస్తం

నగదు పంపిణీని నిలిపివేసిన అధికారులు    

గ్రేటర్‌లో 4 లక్షలకుపైగా కుటుంబాల్లో నిరాశ  

సాక్షి, సిటీబ్యూరో: దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదనే సామెతను గుర్తుకు తెస్తోంది పౌరసరఫరాల శాఖ తీరు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆహార భద్రత కార్డు కలిగిన ప్రతి పేద కుటుంబానికీ ఉచిత బియ్యంతో పాటు నిత్యావసర సరుకుల కోసం రూ.1500 ఆర్థిక చేయూతను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ.. వివిధ కారణాలతో వరుసగా మూడు నెలలు రేషన్‌ సరుకులు డ్రా చేయని పేద కుటుంబాలకు కష్టకాలంలో ‘నగదు’ చేయూతను పౌరసరఫరాల శాఖ నిలిపివేసింది. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలో భాగంగా చౌకధరల దుకాణాల ద్వారా క్రమం తప్పకుండా రేషన్‌ డ్రా చేసుకునే కార్డుదారులకు థర్ట్‌ పార్టీ ఐడెంటిఫికేషన్‌ ద్వారా, వరుసగా మూడు మాసాలు సరుకులు డ్రా చేయని కార్డుదారులకు ఈ–పోస్‌ బయోమెట్రిక్‌ గుర్తింపు ద్వారా ఉచిత బియ్యం అందించాలని సూచించింది. వరుసగా మూడు మాసాలు (జనవరి నుంచి మార్చి) వరకు సరుకులు డ్రా చేయని కార్డుదారులకు ఏప్రిల్‌ నెల ఉచిత రేషన్‌ కోటా పంపిణీ జరిగినా.. నిత్యావసర సరుకుల కోసం ప్రభుత్వం ప్రకటించిన నగదు చేయూత విషయంలో మాత్రం పౌరసరఫరాల శాఖ మొండిచేయి చూపించింది(112 ఏళ్ల తర్వాత..)

హామీకి భిన్నంగా..
పౌరసరఫరాల శాఖ సంస్కరణల్లోభాగంగా ఆహారభద్రత కార్డుదారులకు ఇచ్చిన స్పష్టమైన హామీని సైతం కష్టకాలంలో గాలికి వదిలేసినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా పేద కుటుంబాలు వరుసగా సరుకులు డ్రా చేయకున్నా.. కార్డు రద్దు చేయబోమని ప్రకటించి.. ప్రభుత్వ నగదు చేయూత విషయంలో ఇందుకు భిన్నంగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది. వాస్తవంగా రెండేళ్ల క్రితం వరకు ఆహార భద్రత కార్డుదారులు వివిధ కారణాలతో వరుసగా మూడు మాసాలు సరుకులు డ్రా చేయకుంటే ఆలాంటి కార్డులను గుర్తించి పౌరసరఫరాల శాఖ వాటిని రద్దు చేసేది. దీంతో ఆహార భద్రతకార్డు కలిగిన ప్రతి కుటుంబం సబ్సిడీ బియ్యం అవసరం ఉన్నా.. లేకున్నా డ్రా చేయడంతో పీడీఎస్‌ బియ్యం పెద్ద ఎత్తున పక్కదారి పట్టి ప్రభుత్వ లక్ష్యం నెరవేరేది కాదు. దీనిని పసిగట్టిన పౌరసరఫరాల శాఖ సంస్కరణల్లో భాగంగా రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా కట్టడి చేసేందుకు ఆహార భద్రత కార్డుదారులు క్రమం తప్పకుండా రేషన్‌ సరుకులు డ్రా చేయకున్నా.. కార్డు రద్దు కాదని, అవసరమున్న కార్డుదారులు మాత్రమే సబ్సిడీ బియ్యం తీసుకోవాలని  విజ్ఞప్తి చేసింది. దీంతో అత్యవసరమున్న కార్డుదారులు ప్రతినెలా సరుకులు డ్రా చేస్తుండగా, మిగిలినవారు వివిధ కారణాలతో వీలుపడక మూడు, నాలుగు నెలలకోసారి సరుకులు డ్రా చేస్తూ వస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి ప్రతి నెలా సుమారు 30 శాతం వరకు సబ్సిడీ సరుకులు మిగులుబాటు అవుతున్నాయి. తాజాగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం చేయూత విషయంలో మాత్రం సరుకులు డ్రా చేయని కుటుంబాల విషయంలో ఇందుకు భిన్నంగా వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తోంది.

నిలిచిన నగదు లబ్ధి..
గ్రేటర్‌ పరిధిలోని సుమారు 4.18 లక్షల పేద కుటుంబాలకు నగదు లబ్ధి నిలిచిపోయింది. పౌరసరఫరాల శాఖ హామీకి లోబడి సరుకులు డ్రా చేయకపోవడంతో కష్ట కాలంలో ఆర్థిక చేయూతపై దెబ్బపడింది. హైదరాబాద్‌– మేడ్చల్‌– రంగారెడ్డి పరిధిలో కలిపి ఆహార భద్రత కార్డులు కలిగిన 16 లక్షల 930 కుటుంబాలు ఉన్నాయి. అందులో సుమారు 25 శాతం వరకు వివిధ కారణాలతో వరుసగా సరుకులు డ్రా చేయకుండా అడపాదడపా డ్రా చేస్తూ వస్తున్నారు. అందులో అత్యధికంగా మేడ్చల్‌లో 1.54 లక్షలు, రంగారెడ్డిలో 1.38 లక్షలు, హైదరాబాద్‌లో 1.26 లక్షల పైచిలుకు ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వరుసగా మూడు నెలలు సరుకులు డ్రా చేయని పేద కుటుంబాల్లో సగానికి పైగా ఈ నెల ఉచిత బియ్యం డ్రా చేసినా.. బ్యాంక్‌ ఖాతాలో నగదు జమా మాత్రం పౌరసరఫరా శాఖ నిలిపివేసింది. దీంతో పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందని దాక్షగా మారాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top