112 ఏళ్ల తర్వాత..

Lockdown People Celebrate in Home Ramadan Festival Hyderabad - Sakshi

రంజాన్‌ మాసంలో మళ్లీ అదే పరిస్థితి  

1908లో ముంచెత్తిన వరద నీరు   

ఆవాసాలకే పరిమితమైన ప్రజలు  

ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌ ప్రభావం  

ఇళ్లలోనే ముస్లింల ప్రార్థనలు  

బోసిపోయిన మసీదులు

నగర చరిత్రలో ఇలాగ ఇది రెండోసారి 

సాక్షి, సిటీబ్యూరో: రంజాన్‌ మాసం అనగానే ఉపవాస దీక్షలు.. సహర్‌.. ఇఫ్తార్‌.. మసీదుల్లో సామూహిక ప్రార్థనలు.. గృహోపకరణాల కొనుగోళ్లు.. నగరంలో ఎక్కడ చూసినా సందడి కనిపించేది. ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేది. ఇక్కడి వంటకాలు, రంజాన్‌ ఆరాధనలు, నైట్‌ బజార్లతో కళకళలాడేది. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రస్తుత రంజాన్‌ నెలలో అంతటా నిశ్శబ్ద వాతావరణమే అలుముకుంది. ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మసీదులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి.  హైదరాబాద్‌.. పునాదుల నుంచి ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూసింది.

శతాబ్దాల చరితకునిలయం భాగ్యనగరం. అంటువ్యాధుల రక్షణ కోసం దీనికి పునాదులు పడ్డాయి. వందేళ్లకుపైగా పూర్వం వరదలు, వర్షాలు, అంటువ్యాధుల ప్రభావంతో ప్రజలు అతలాకుతలమయ్యారు. తాజాగా కరోనా ప్రభావంతో నగరం నిర్మానుష్యంగా మారింది. రంజాన్‌ మాసంలో సిటీ కళ తప్పడం చరిత్రలో ఇదే తొలిసారి కాదు. 1908లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సుమారు 112 ఏళ్లకు ముందు ఇది జరిగిందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  (క్వారంటైన్‌: బిర్యాని కోసం రగడ)

ఆనాడు భయం గుప్పిట్లో జనం
1908 సెప్టెంబర్‌ 26 నుంచి 28 వరకు మూసీ నదికి వరదలు వచ్చాయి. అప్పుడు రంజాన్‌ నెల వచ్చింది. నగరంలో వర్షం ఎడతెరిపిలేకుండా మూడు రోజుల పాటు భారీగా కురిసింది. దీంతో నీటి వరదల తాకిడికి మూసీ నది పరీవాహక ప్రాంతాలు తొలుత కొట్టుకుపోయాయి. ఇళ్లు, దుకాణాలు, చిన్న చిన్న వంతెనలు, నయాపూల్‌ వంతెన నేలమట్టమయ్యాయి. నగరమంతా నీరు నిలిచింది. మూసీనది నుంచి వచ్చిన నీటితో కోఠి, బషీర్‌బాగ్‌ వరకు నీరు వచ్చి చేరింది. బ్రిటిష్‌ రెసిడెన్సీ వద్ద 11 అడుగుల మేర నీరు వచ్చి ఆగింది. ఆ రోజుల్లో రంజాన్‌ మాసం కొనసాగుతోంది. అప్పటి పాలకులు ప్రజల కోసం తమ దర్బార్‌ దర్వాజాలకు తెరిచారు. ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ నయాపూల్‌ వంతెన వద్ద వచ్చి కూర్చున్నారు. ప్రజల రోదనలు, ఆర్తనాదాలతో నగరం దద్దరిల్లింది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. వరదల అనంతరం అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, ముస్లింలు రంజాన్‌ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు రోజూ రెండు పూటలా అన్నం అందజేసింది. ప్రతి కుటుంబానికి నెలకు రూ.120 అందించింది. వరదల సమయంలో కూడా రంజాన్‌ నెల కొనసాగింది. దాదాపు ఆరు నెలల వరకు నగరం పూర్తి స్థాయిలో తేలిక పడింది.  

ఇలాంటి రంజాన్‌ రెండోసారి..  
1908లో వచ్చిన వరదలతో నగరం అతలాకుతలమైంది. ఆ సమయంలోనే రంజాన్‌ నెల కొనసాగుతోంది. వరదలతో ముస్లింలు సహర్, ఇఫ్తార్‌ల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అప్పటి రంజాన్‌ నెల ఇప్పటి రంజాన్‌ కంటే ఇంకా భయానకంగా ఉంది. ఇప్పడు ఇళ్లలోనే ఉండాలి. కానీ అప్పుడు ఇళ్లన్నీ కొట్టుకుపోయాయి. వేలాదిగా ప్రాణనష్టం వాటిల్లింది. వరదల అనంతరం అంటువ్యాధులు ప్రబలుతాయని జనంలో భయం. ఇలా ఎన్నో ఇబ్బందులను నగరం చూసింది. వరదల అనంతరం నగరం కోలుకోవడానికి దాదాపు 6 నెలలు పట్టింది.  – అల్లమా ఇజాజ్‌ ఫరూఖీ,ప్రముఖ చరిత్రకారుడు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top